పార్టీ పదవులకు ఓపీఎస్, ఈపీఎస్ నామినేషన్లు

ABN , First Publish Date - 2021-12-04T21:30:12+05:30 IST

అన్నాడీఎంకే కీలక పదవులకు ఆ పార్టీ అగ్రనేతలు ఓ.పన్నీర్ సెల్వం, ఎడప్పాడి కె.పళనిస్వామి శనివారంనాడు సంయుక్తంగా ..

పార్టీ పదవులకు ఓపీఎస్, ఈపీఎస్ నామినేషన్లు

చెన్నై: అన్నాడీఎంకే కీలక పదవులకు ఆ పార్టీ అగ్రనేతలు ఓ.పన్నీర్ సెల్వం, ఎడప్పాడి కె.పళనిస్వామి శనివారంనాడు సంయుక్తంగా నామినేషన్లు వేశారు. కో-ఆర్డినేటర్ పదవికి ఓపీఎస్, జాయింట్ కోఆర్డినేటర్ పదవికి ఈపీఎస్ నామినేషన్ వేశారు. పెద్దఎత్తున పార్టీ కార్యకర్తలు, సీనియర్ నేతలు, మాజీ మంత్రులు ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్నాడీఎంకే కార్యాలయంలో శనివారంనాడు నామినేషన్ల సమర్పణ కార్యక్రమం జరిగింది. ఈ ఇద్దరు నేతలు తమ నామినేషన్ పత్రాలను పార్టీ ఎన్నికల కమిషనర్లయిన సి.పొన్నియన్, పొల్లాచ్చి వి.జయరామన్‌లకు అందజేశారు.


తొలుత ఉదయం 10.55 గంటలకు పార్టీ కార్యాలయానికి పన్నీర్ సెల్వం చేరుకున్నారు. ఆ తర్వాత పళనిస్వామి వచ్చారు. ఇద్దరూ కలిసి పార్టీ దివంగత నేతలు ఎంజీఆర్, జయలలిత విగ్రహాల వద్ద ఘననివాళులర్పించారు. అన్నాడీఎంకే నేతలు వారికి పుష్పగుచ్చాలు అందజేసి, శాలువాలు కప్పి అభినందలు తెలిపారు. అనంతరం పన్నీర్ సెల్వం, పళనిస్వామి పేర్లను సీనియర్ నేతలు ప్రతిపాదించగా, తక్కిన వారు ఆమోదం తెలిపారు. ఆ వెనువెంటనే వీరిరువురూ సంయుక్తంగా తమ నామినేషన్ పత్రాలను ఎన్నికల కమిషనర్లకు అందజేశారు. మధ్యాహ్నం 3 గంటలతో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. నామినేషన్స ఉపసంహరణ గడువు ముగిసి, ఇతరులెవరూ నామినేషన్లతో పోటీ పడకుంటే పన్నీర్‌సెల్వం, పళనిస్వామి ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది.

Updated Date - 2021-12-04T21:30:12+05:30 IST