రాజకీయ లబ్దికే విపక్షాల ఆరాటం

ABN , First Publish Date - 2020-10-20T05:48:10+05:30 IST

సాగునీటి ప్రాజెక్టులో సాంకేతికంగా తలెత్తే లోపాలను పరిగణనలోకి తీసుకోకుండా కాంగ్రెస్‌, బీజేపీలతో సహా కమ్యూనిస్టులు రాజకీయ లబ్ధికి ప్రయత్నిస్తున్నాయని ప్రభుత్వ విప్‌ గువ్వల

రాజకీయ లబ్దికే విపక్షాల ఆరాటం

ధ్వజమెత్తిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు

మునకకు గురైన కేఎల్‌ఐ లిఫ్టు పరిశీలన

నెలరోజుల్లోగా మొదటి పంపును పునరుద్దరిస్తామని భరోసా


నాగర్‌కర్నూల్‌/కొల్లాపూర్‌ రూరల్‌, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి) : సాగునీటి ప్రాజెక్టులో సాంకేతికంగా తలెత్తే లోపాలను పరిగణనలోకి తీసుకోకుండా కాంగ్రెస్‌, బీజేపీలతో సహా కమ్యూనిస్టులు రాజకీయ లబ్ధికి ప్రయత్నిస్తున్నాయని ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యేలు మర్రిజనార్దన్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డిలు విమర్శించారు. సోమవారం మధ్యాహ్నం కొల్లాపూర్‌ మండలం రెగుమాన్‌గడ్డ వద్ద మునకకు గురైన కల్వకుర్తి మొదటి లిఫ్టును వారు పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టుల సలహాదారు పెంటారెడ్డితో లిఫ్టు మునకకు దారీ తీసిన పరిస్థితులు, పునరుద్ధరణకు పట్టే సమయం, పనులను వేగవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టుల్లో సాంకేతికమైన ఇబ్బందులు రావడం సహజమని, ఈ అంశాన్ని భూతద్దంలో చూపించి రాజకీయంగా లబ్ధి పొందేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కేఎల్‌ఐ మొదటి లిఫ్టులోని మూడో పంపులో సాఫ్ట్‌వాల్‌లో తలెత్తిన టెక్నికల్‌ ప్రాబ్లమ్‌తోనే పంపుహౌజ్‌ నీట మునిగిందన్నారు. పది రోజుల్లోపే డీవాటరింగ్‌ ప్రక్రియను పూర్తి చేసి పంపుహౌజ్‌లో కనీసం ఒక మోటారైనా ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పంపుహౌజ్‌ పునరుద్ధరణ కోసం సమన్వయంతో పని చేసి తాగు, సాగునీటి ఇబ్బందులను నివారించడానికి పూర్తిస్థాయిలో కృషి చేస్తామన్నారు.


నెల రోజుల వ్యవధిలో మొదటి పంపు వినియోగంలోకి వస్తుందని పూర్తి ఆశాభావంతో ఉన్నామని గువ్వల బాలరాజు పేర్కొన్నారు. విపక్షాలు అనవసరంగా రాద్దాంతం చేయడం మానుకోని, నిర్మాణాత్మక సహకారం అందించాలని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి కోరగా ప్రాజెక్టుల నిర్మాణం రైతాంగం సంక్షేమం విషయంలో టీఆర్‌ఎస్‌ను శంఖించాల్సిన పరిస్థితి కలలో కూడా ఉత్పన్నం కాదన్నారు. ఎమ్మెల్యేల వెంట ఎంజీఎల్‌ఐ ఎస్‌ఈ అంజయ్య, మార్కెట్‌ చైర్మన్‌ నరేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నేతలు రఘువర్దన్‌రెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డి, గాలియాదవ్‌ ఉన్నారు. 

Updated Date - 2020-10-20T05:48:10+05:30 IST