స్వపక్షంలో విపక్షం

ABN , First Publish Date - 2021-06-24T04:57:36+05:30 IST

అధికార పార్టీ కౌన్సిలర్ల మధ్య వర్గ విభేధాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. అజెండాలో ఉన్న అనేక అంశాలపై అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లే అడ్డుతగలడం.. వారికి టీడీపీకి చెందిన కౌన్సిలర్లు తోడుగా నిలవడంతో కౌన్సిల్‌ సమావేశం రచ్చ...రచ్చగా మారింది. ఎమ్మెల్యే సమక్షంలో వర్గవిభేదాలు గుప్పుమనడం సాలూరు పట్టణంలో హాట్‌టాపిక్‌గా మారింది. స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో కౌన్సిల్‌ మూడో సాధారణ సమావేశం బుధవారం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పువ్వల ఈశ్వరమ్మ ఆధ్వర్యంలో నిర్వహించారు

స్వపక్షంలో విపక్షం
అధికార్లను ప్రశ్నిస్తున్న అధికార పార్టీ కౌన్సిలర్లు

గరం గరంగా మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశం 

బయటపడ్డ విభేదాలు

కౌన్సిలర్ల తీరుపె ఎమ్మెల్యే రాజన్నదొర అసంతృప్తి

తమను గుర్తించడం లేదన్న టీడీపీ కౌన్సిలర్లు

సాలూరు, జూన్‌ 23: అధికార పార్టీ కౌన్సిలర్ల మధ్య వర్గ విభేధాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. అజెండాలో ఉన్న అనేక అంశాలపై అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లే అడ్డుతగలడం.. వారికి టీడీపీకి చెందిన కౌన్సిలర్లు తోడుగా నిలవడంతో కౌన్సిల్‌ సమావేశం రచ్చ...రచ్చగా మారింది. ఎమ్మెల్యే సమక్షంలో వర్గవిభేదాలు గుప్పుమనడం సాలూరు పట్టణంలో హాట్‌టాపిక్‌గా మారింది. స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో కౌన్సిల్‌ మూడో సాధారణ సమావేశం బుధవారం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పువ్వల ఈశ్వరమ్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. సమావేశానికి ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర కూడా హాజరయ్యారు. అజెండాలో పొందుపరిచిన అంశాలు మున్సిపల్‌ సిబ్బంది చదివి వినిపించటం మొదలు పెట్టారు. మొదటి అంశంమైన మున్సిపల్‌ కార్యాలయ అవరణంలో ఉన్న పాత భవనం తొలగించేందుకు రూ.34,500,  శిథిలాలను తరలించడానికి రూ.15000, ఆ ప్రదేశంలో సీసీ పేవ్‌మెంట్‌(వాహనాల పార్కింగ్‌కు) నిర్మించేందుకు రెండు లక్షల 64 వేల 818 రూపాయలు ఖర్చు చేయనున్నట్లు చెప్పటంతో ఒక్కసారిగా కౌన్సిల్‌ సభ్యులైన వంగపండు అప్పలనాయుడు, గిరి రఘు, గొర్లె వెంకటరమణతో పాటు అధికార పార్టీకి చెందిన పలువురు కౌన్సిలర్‌లు అభ్యంతరం తెలిపారు. టీడీపీ కౌన్సిలర్లు హర్షకుమార్‌, లక్ష్మోజీలు కూడా వ్యతిరేకించారు. 

అధికార పార్టీ కౌన్సిలర్లు మాట్లాడుతూ ప్రజల ధనంతో తమకు నచ్చిన పనులు చేయడం సరికాదని, కార్యాలయ ఆవరణలో పార్కింగ్‌ కోసం ప్రత్యేకంగా సీసీ ఎందుకు నిర్మించాలో అర్థం కావడం లేదన్నారు. ఇప్పటికే వాస్తు పేరుతో మున్సిపల్‌ కార్యాలయానికి లక్షల  రూపాయలు ఖర్చు చేశారని విమర్శించారు. పట్టణంలో ప్రజలు అనేక సమస్యలతో సతమతమౌతుంటే కేవలం మున్సిపల్‌ కార్యాలయానికి మాత్రమే అధికంగా డబ్బులు ఖర్చు చేస్తే ఎలా అని ప్రశ్నించారు. ఆ సమయంలో ఇరువర్గాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. దీంతో ఎమ్మెల్యే రాజన్నదొర కలుగజేసుకుని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసేటప్పుడు ఏది అత్యంత అవసరమో తెలుసుకోవాలని సూచించారు. ఇలా సమస్యలు సృష్టించేలా ప్రతిపాదనలు రూపొందించడం సరికాదన్నారు. ప్రజా అవసరాలు, ప్రాధాన్యాలు దృష్టిలో ఉంచుకోవాలన్నారు. తన ఇంటి ముందు సుమారు ఆరు నెలలు కిందట భూమిపూజ చేసిన సీసీ రోడ్డు, కాలువల నిర్మాణంలో ఏమాత్రం పురోగతి లేదని, అధికారులు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఇంటి ముందే ఇలా ఉంటే పట్టణంలో పరిస్థితిని అర్థం చేసుకోవచ్చునని అసహనం వ్యక్తం చేశారు. అజెండాలో ఉన్న మొదటి అంశంపైనే కౌన్సిల్‌ సభ్యులు ఇలా రచ్చ చేసుకోవడం బాగాలేదని హితవు పలికారు. సాలూరు మున్సిపాల్టీలో ఏం జరుగుతోందో రాష్ట్ర నాయకత్వం దృష్టిలో ఉందన్నారు. సమావేశానికి ముందే అజెండాపై కౌన్సిల్‌ సభ్యులంతా మాట్లాడుకోవాలని సూచించారు. మొదటిసారి కౌన్సిలర్‌గా ఎన్నికైన తనకు సమావేశంలో ఏం జరుగుతోందో....ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదని 24వ వార్డు కౌన్సిలర్‌ హైమా విజయలక్ష్మి ఎమ్మెల్యేకు తెలిపారు. అనంతరం సమావేశం మధ్యలోనే ఎమ్మెల్యే వెనుదిరిగారు. 21వ వార్డుకు చెందిన బందాపు సీతమ్మ మాట్లాడుతూ తన వార్డులో తాను కౌన్సిలర్‌గా ఉండగా మరో వ్యక్తిని ఇన్‌చార్జిగా వేయడం ఏంటని ప్రశ్నించారు. చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ పార్టీ నిబంధనల ప్రకారం కొన్ని చేయాల్సి ఉంటుందని, అంత మాత్రం చేత కౌన్సిలర్లకు ప్రాఽధాన్యం తగ్గదని అన్నారు. అస్సలు తమకు ఏ విషయాలు కూడా చెప్పడం లేదని, వార్డు వలంటీర్లు, సచివాలయ సిబ్బంది తమను పట్టించుకోటం లేదని టీడీపీ కౌన్సిలర్‌లు లక్ష్మోజీ, హర్షకుమార్‌లు సమావేశం దృష్టిలో పెట్టారు. కమిషనర్‌ మాట్లాడుతూ ఇప్పటికే అనేకసార్లు వలంటీర్లతో పాటు సచివాలయ సిబ్బందికి సైతం హెచ్చరించామని చెప్పారు. సమస్య వస్తే  తన దృష్టికి తేవాలని కోరారు. సమావే శంలో మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ దీప్తి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


Updated Date - 2021-06-24T04:57:36+05:30 IST