అధికార, విపక్షాలు నాకు రెండు కళ్లు: వెంకయ్యనాయుడు

ABN , First Publish Date - 2021-08-13T21:54:21+05:30 IST

సభాకార్యక్రమాల విషయంలో విపక్షాలు, అధికార పక్షం తనకు రెండు కళ్లని రాజ్యసభ చైర్మన్..

అధికార, విపక్షాలు నాకు రెండు కళ్లు: వెంకయ్యనాయుడు

న్యూఢిల్లీ: సభాకార్యక్రమాల విషయంలో విపక్షాలు, అధికార పక్షం తనకు రెండు కళ్లని రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. తనకు రెండూ సమానమేనని చెప్పారు. రెండు కళ్లూ సరిగా ఉంటేనే చూపు స్పష్టంగా ఉంటుందని పేర్కొన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసిన అనంతరం శుక్రవారంనాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, విపక్ష, అధికార పక్షాలను తాను సమదృష్టిలో చూస్తానని, సభ సజావుగా నడిచేలా చూడాల్సిన బాధ్యత ఉభయులపైనా ఉంటుందని అన్నారు.


సభలో నిరంతర అంతరాయాలపై మీడియా అడిగిన ప్రశ్నకు, చట్టసభలు ఉండేది చర్చలు, సంప్రదింపుల కోసమేనని, బయట జరిగే రాజకీయ కొట్లాటలకు పార్లమెంటు వేదక కారాదని అన్నారు. పార్లమెంటు సమావేశాల్లో చోటుచేసుకున్న కొన్ని అనుచిత ఘటనలపై తీసుకోవాల్సిన చర్యల గురించి పరిశీలిస్తున్నామని అన్నారు. బిల్లులను సెలక్ట్ కమిటీకి నివేదించే అంశంపై అడిగిన మరో ప్రశ్నకు వెంకయ్యనాయుడు సమాధానమిస్తూ, దీనిపై సభ సమష్టిగా నిర్ణయం తీసుకుంటుందని, సభాపతి (చైర్) బలవంతం ఏమీ ఉండదని అన్నారు. జూలై 19న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మొదలైనప్పటి నుంచి పెగాసస్ స్పైవేర్ వ్యవహారం, సాగు చట్టాల రద్దు అంశంపై చర్చకు విపక్షాలు పట్టుబట్టడంతో ఉభయ సభలూ వరుస వాయిదాలకే పరిమితమై, చివరకు నిరవధికంగా వాయిదా పడ్డాయి.



Updated Date - 2021-08-13T21:54:21+05:30 IST