ప్రతిపక్షాల రాజకీయాలు విధ్వంసకరం

ABN , First Publish Date - 2022-07-03T09:03:16+05:30 IST

బీజేపీ నిర్మాణాత్మక రాజకీయాలు చేస్తుంటే.. విపక్షాలు కుటుంబ, అవినీతి పాలనతో విధ్వంసకర రాజకీయాలు చేస్తున్నాయని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దుయ్యబట్టారు.

ప్రతిపక్షాల రాజకీయాలు విధ్వంసకరం

  • మోదీని వ్యతిరేకించే క్రమంలో దేశాన్నే వ్యతిరేకిస్తున్నాయి
  • మా పార్టీ పేదల సాధికారత కోసం కృషి చేస్తోంది
  • ప్రతిపక్షాలు సొంత కుటుంబాల కోసం పనిచేస్తున్నాయి
  • మోదీ సంక్షేమ పథకాల వల్లే ఎన్నికల్లో బీజేపీకి విజయాలు
  • రాష్ట్రపతి అభ్యర్థిగా ముర్ము
  • ఎంపిక ఎస్టీల పట్ల బీజేపీకి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం
  • జాతీయ కార్యవర్గ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా

హైదరాబాద్‌, జూలై 2 (ఆంధ్రజ్యోతి): బీజేపీ నిర్మాణాత్మక రాజకీయాలు చేస్తుంటే.. విపక్షాలు కుటుంబ, అవినీతి పాలనతో విధ్వంసకర రాజకీయాలు చేస్తున్నాయని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దుయ్యబట్టారు. తమ పార్టీ పేదల  సాధికారత కోసం పనిచేస్తుంటే.. ప్రతిపక్షాలు తమ సొంత కుటుంబాల కోసం పనిచేస్తూ, అవినీతి ఊబిలో కూరుకుపోయా యని విమర్శించారు. ప్రధాని మోదీని వ్యతిరేకించే క్రమంలో ఆ పార్టీలు దేశాన్నే వ్యతిరేకిస్తున్నాయని.. సర్జికల్‌ స్ట్రైక్స్‌పైన, రఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలుపైన ఆరోపణలు ఇందులో భాగమేనని ఆయన మండిపడ్డారు. రాష్ట్రపతి అభ్యర్థిగా ఆదివాసీ ఆడబిడ్డ ద్రౌపది ముర్మును ఎంపిక చేయడం, ఎస్టీల పట్ల బీజేపీకి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా శనివారం నొవాటెల్‌ హోటల్‌లో నడ్డా ప్రారంభోపన్యాసం చేశారు. సుమారు ఆరు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో.. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి 352 మంది కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. దేశ రాజకీయ, ఆర్థిక పరిస్థితులపై సమీక్షించారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే అంశంపైనా చర్చించారు. తొలుత ప్రసంగించిన నడ్డా.. మోదీ ఎనిమిదేళ్ల పాలనలో పేదల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని.. జన్‌ధన్‌ యోజన, ఆయుష్మాన్‌ భారత్‌, పీఎం కిసాన్‌ వంటి పథకాలతో ఆయా వర్గాలకు ప్రయోజనం కలిగిందని  చెప్పారు. 


పీఎంఏవై కింద దేశవ్యాప్తంగా 3 కోట్ల మందికి లబ్ధి చేకూరిందని.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల వల్లే యూపీ, మణిపూర్‌, ఉత్తరాఖండ్‌, గోవా రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలతో పాటు రాంపూర్‌, అజాంగఢ్‌ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా సగటు ఆర్థిక వృద్ధి 6 శాతం ఉంటే మనదేశ ఆర్థిక వృద్ధి 8.7 శాతం ఉందని.. ఇది క్రమంగా పెరుగుతోందని పేర్కొన్నారు.పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికిగాను ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలని యోచిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం ప్రతి పోలింగ్‌ బూత్‌లో 200 మంది క్రియాశీల కార్యకర్తలను గుర్తించి, వారితో ప్రత్యేక వాట్సప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అంతేకాక, దేశవ్యాప్తంగా 30 కోట్ల మంది లబ్ధిదారులతో పార్టీ కేడర్‌ సమావేశమవుతుందని.. పథకాల వారీగా వారి అభిప్రాయాలు తీసుకుంటుందని వెల్లడించారు. పోలింగ్‌ బూత్‌ స్థాయిలో కమిటీలను పటిష్ఠం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని.. పార్టీ పురోభివృద్ధికి ఇది అత్యంత కీలకమని ఆయన వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్‌, కేరళ, జమ్ము కశ్మీర్‌ ప్రాంతాల్లో పార్టీ కార్యకర్తల త్యాగాలు చిరస్మరణీయమని, వారి వీరోచిత పోరాటాలు ప్రశంసనీయమని నడ్డా కొనియాడారు.

Updated Date - 2022-07-03T09:03:16+05:30 IST