కోవిషీల్డ్ ధరపై భగ్గుమన్న విపక్షాలు

ABN , First Publish Date - 2021-04-21T23:17:01+05:30 IST

కోవిడ్-19 నిరోధక వ్యాక్సిన్ కోవిషీల్డ్ ధరపై కాంగ్రెస్, వామపక్షాలు తీవ్ర ఆగ్రహం

కోవిషీల్డ్ ధరపై భగ్గుమన్న విపక్షాలు

న్యూఢిల్లీ : కోవిడ్-19 నిరోధక వ్యాక్సిన్ కోవిషీల్డ్ ధరపై కాంగ్రెస్, వామపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఒక మోతాదు కోవిషీల్డ్ వ్యాక్సిన్‌‌ను కేంద్ర ప్రభుత్వానికి రూ.150గానూ, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.400గానూ నిర్ణయించడంలోని ఔచిత్యాన్ని ప్రశ్నించాయి.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఒకే ధరకు ఈ వ్యాక్సిన్‌ను అందజేయాలని డిమాండ్ చేశాయి. 


ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం అభివృద్ధిపరచిన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను పుణేలోని సీరం ఇన్‌స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తోంది. ఈ వ్యాక్సిన్ ధరలను బుధవారం ఈ సంస్థ ప్రకటించింది. ఒక మోతాదు కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధర రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.400 అని, ప్రైవేటు ఆసుపత్రులకు రూ.600 అని ఓ ప్రకటనలో తెలిపింది. కేంద్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందంలో మార్పులు ఉండబోవని తెలిపింది. దీంతో కేంద్ర ప్రభుత్వానికి ఒక మోతాదు కోవిషీల్డ్ వ్యాక్సిన్ రూ.150కి అందుతుంది. 


ఈ ప్రకటన వెలువడిన వెంటనే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విటర్ వేదికగా స్పందిస్తూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్నేహితులకు ఇదొక గొప్ప అవకాశమని, కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. ‘‘ఇదీ మన దేశం. మోదీ మిత్రులకు గొప్ప అవకాశం, కేంద్ర ప్రభుత్వ అన్యాయం’’ అని పేర్కొన్నారు. సీరం ఇన్‌స్టిట్యూట్ ప్రకటనను ఆయన ఈ ట్వీట్‌కు జత చేశారు. వ్యాక్సిన్ల పంపిణీలో వివక్ష కనిపిస్తోందని దుయ్యబట్టారు. 


సీపీఎం జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరి ఇచ్చిన ట్వీట్‌లో, వ్యాక్సిన్లను పారదర్శక, న్యాయబద్ధమైన విధానంలో పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. పీఎం-కేర్స్ ఫండ్‌పై  ప్రశ్నలు సంధించారు. కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్లను కొనాలని, వాటిని పారదర్శకంగా, ఉచితంగా రాష్ట్రాలకు అందజేయాలని కోరారు. పీఎం-కేర్స్ (ప్రైమ్ మినిస్టర్స్ సిటిజన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్) నిధికి వచ్చిన లక్షల కోట్ల రూపాయలను దీని కోసం ఖర్చు చేయాలన్నారు. 70 ఏళ్ళ నుంచి మన దేశంలో ఉచిత, సార్వజనీన వ్యాక్సినేషన్ కార్యక్రమం అమలవుతోందన్నారు. 


Updated Date - 2021-04-21T23:17:01+05:30 IST