మోదీ గారూ! మా గోడు వినండి : ప్రతిపక్షాలు

ABN , First Publish Date - 2021-08-08T19:19:36+05:30 IST

తాము చెప్పేది వినాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ప్రతిపక్షాలు

మోదీ గారూ! మా గోడు వినండి : ప్రతిపక్షాలు

న్యూఢిల్లీ : తాము చెప్పేది వినాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ప్రతిపక్షాలు ఓ వీడియో సందేశం ద్వారా కోరాయి. పెగాసస్ స్పైవేర్‌తో నిఘా వివాదంపై పార్లమెంటులో చర్చించాలని డిమాండ్ చేశాయి. ఈ వీడియోను టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ ఆదివారం విడుదల చేశారు. 


డెరెక్ ఒబ్రెయిన్ ఆదివారం ఇచ్చిన ట్వీట్‌లో, ‘‘మిస్టర్ మోదీ, మా మాట వినండి’’ అని పేర్కొన్నారు. వివిధ ప్రతిపక్ష పార్టీల నేతలు పార్లమెంటులో మాట్లాడిన వీడియో క్లిప్‌లతో కూడిన వీడియోను ఈ ట్వీట్‌కు జత చేశారు. పెగాసస్ స్నూపింగ్ వివాదంపై పార్లమెంటులో చర్చించాలని కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, సీపీఎం, ఆర్జేడీ, టీఆర్ఎస్, ఎన్‌సీపీ, ఆప్ ఎంపీలు  డిమాండ్ చేస్తుండటం ఈ వీడియోలో కనిపించింది. 


ఈ వీడియోలో కనిపించినవారిలో, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ, తర్వాత ఎప్పుడైనా ప్రవేశపెట్టదగిన బిల్లులను ప్రభుత్వం ఇప్పుడే ప్రవేశపెడుతోందని ఆరోపించారు.  పెగాసస్ నిఘా వివాదంపై చర్చ జరపాలని డిమాండ్ చేశారు.


టీఎంసీ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్, సమాజ్ వాదీ పార్టీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్, శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది, ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా, తదితర ప్రతిపక్ష నేతల డిమాండ్లను ఈ వీడియోలో చూపించారు. 


పెగాసస్ వివాదం, రైతుల నిరసనలు, ఇతర సమస్యలపై చర్చించాలనే డిమాండ్‌తో పార్లమెంటు ఉభయ సభల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా 14 ప్రతిపక్ష పార్టీలు జట్టు కట్టాయి. 


జూలై 19న ప్రారంభమైన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు షెడ్యూలు ప్రకారం ఆగస్టు 13న ముగుస్తాయి.


Updated Date - 2021-08-08T19:19:36+05:30 IST