ఆశనిపాతం!

ABN , First Publish Date - 2020-03-29T11:00:32+05:30 IST

కరోనా వైరస్‌ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం

ఆశనిపాతం!

‘స్థానిక’ ఎన్నికల వాయిదా ప్రకటనతో ఆందోళనలో అభ్యర్థులు

 జీర్ణించుకోలేకపోతున్న వైసీపీ నేతలు

 మళ్లీ నోటిఫికేషన్‌ జారీ చేయాలని విపక్ష పార్టీల డిమాండ్‌


(ఆంధ్రజ్యోతి-అమలాపురం): కరోనా వైరస్‌ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం అభ్యర్థుల పాలిట అశనిపాతంగా మారింది. దీంతో జిల్లాలో 61 జడ్పీటీసీ, 1086 ఎంపీటీసీ, 1072 సర్పంచ్‌ స్థానాలకు ఎన్నికలు నిలిచి పోయాయి. అయితే ఉపసంహరణ ఘట్టాన్ని ముగించుకుని ఆదివారం ప్రచార పర్వానికి ఉప్రకమించిన అభ్యర్థులను ఈ వార్త తీవ్ర ఆందోళనకు గురిచేసింది. పైగా ఎన్నికల కోడ్‌ అమలులో ఉంటుందన్న ప్రకటన జిల్లా అధికార యంత్రాంగానికి ఇబ్బందికరంగా మారింది.  పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో జడ్పీటీసీ అభ్యర్థి అయినవిల్లి శ్రీసిద్ధివినాయక ఆలయం నుంచి ప్రచారాన్ని ప్రారంభించారు.


కొద్ది సమయంలోనే ఎన్నికల వాయిదా పడినట్టు సమాచారం రావడంతో వైసీపీ శ్రేణులు ఇబ్బందికి గురయ్యారు. అమలాపురం రూరల్‌ మండలం  సమనస నుంచి జడ్పీటీసీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ప్రచారంలో ఉండగానే వాయిదా వార్త తెలియడంతో ఆ పార్టీ కార్యకర్తలు నిరుత్సాహానికి గురయ్యారు. కాగా అభ్యర్థులకు ఈ పరిణామం ఆర్థికంగా భారం కానుంది. వారు సుమారు 45 రోజుల పాటు ఓటర్ల పట్ల సానుకూల వైఖరి ప్రదర్శించడం కష్టసాధ్యమే. కరోనా వైరస్‌ సాకు చూపి ఎన్నికలు వాయిదా వేయడాన్ని వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.


విపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ సహా వివిధ పార్టీల అభ్యర్థులు మొత్తం ఎన్నికల ప్రక్రియను రద్దు చేసి మళ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేయాలని డిమాండు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం ఏరోజు ఏ మలుపు తిరుగుతుందోనని ఏకగ్రీవ అభ్యర్థులతో పాటు పోటీలో ఉన్న అభ్యర్థుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. మరోవైపు వాయిదా ప్రకటనతో ఎన్నికల విధులకు హాజరైన అధికారులు, సిబ్బంది వారు చేస్తున్న పనులకు బ్రేక్‌ వేశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ పంచాయతీ ఎన్నికలకు  గ్రామాల్లో పోలింగ్‌ బూత్‌ల వారీగా సిద్ధం చేసిన సామగ్రిని మూటలుగా కట్టి  ఓ గదిలో భద్రపరిచారు. 


Updated Date - 2020-03-29T11:00:32+05:30 IST