న్యాయమూర్తిగా ప్రతిపక్షాలు ఉండవలసిన అవసరం లేదు : సీఎం బొమ్మయ్

ABN , First Publish Date - 2022-04-15T17:02:26+05:30 IST

కాంట్రాక్టర్ ఆత్మహత్య నేపథ్యంలో నిరసన ప్రదర్శనలను

న్యాయమూర్తిగా ప్రతిపక్షాలు ఉండవలసిన అవసరం లేదు : సీఎం బొమ్మయ్

బెంగళూరు : ఓ కాంట్రాక్టర్ ఆత్మహత్య నేపథ్యంలో నిరసన ప్రదర్శనలను నిర్వహిస్తున్న కాంగ్రెస్ తీరును కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మయ్ తప్పుబట్టారు. ఈ కేసులో దర్యాప్తు జరుగుతోందని, దర్యాప్తు అధికారిగా కానీ, న్యాయమూర్తిగా కానీ ప్రతిపక్షాలు ఉండవలసిన అవసరం లేదని స్పష్టం చేశారు. 


కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ మంగళవారం ఉడుపిలో ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన రాసినట్లు చెప్తున్న ఆత్మహత్య లేఖలో కర్ణాటక మంత్రి కేఎస్  ఈశ్వరప్పపైనా, ఆయన అనుచరులపైనా నేరుగా ఆరోపణలు చేశారు. తన చేత చేయించిన కాంట్రాక్టు పనులకు బిల్లులను చెల్లించడంలో తనను తీవ్రంగా వేధించారని ఆరోపించారు. 


ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తోంది. ఈశ్వరప్పను మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తోంది. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివ కుమార్ నేతృత్వంలో గురువారం రాత్రి శాసన సభ వద్ద నిరసన ప్రదర్శన జరిగింది. మంత్రి ఈశ్వరప్ప తన పదవికి రాజీనామా చేసినంత మాత్రానికి సరిపోదని, రాజీనామా చేయడం సమస్యకు పరిష్కారం కాదని, ఆయనపై అవినీతి నిరోధక చట్టం క్రింద కేసు నమోదు చేసి, ఆయనను అరెస్టు చేయాలని శివ కుమార్ డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ సంతోష్‌ను 40 శాతం కమిషన్ చెల్లించాలంటూ వేధించారని ఆయన తల్లి, భార్య, సోదరుడు ఆరోపించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈశ్వరప్పపై కేసు నమోదు చేయాలనేది తన డిమాండ్ కాదని, ఇది కర్ణాటక గళమని చెప్పారు. 


ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మయ్ ఓ వార్తా సంస్థతో శుక్రవారం మాట్లాడుతూ, ఈశ్వరప్ప తనంతట తానే రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారని, శుక్రవారం సాయంత్రం రాజీనామాను సమర్పిస్తారని చెప్పారు. దర్యాప్తు అనంతరం అన్ని విషయాలు బయటకు వస్తాయి కాబట్టి ప్రతిపక్షాలు ఓ దర్యాప్తు అధికారిగానో, ఓ జడ్జిగానో ఉండవలసిన అవసరం లేదన్నారు. 


కాంట్రాక్టర్ ఆత్మహత్య నేపథ్యంలో మంత్రి ఈశ్వరప్పపైనా, ఆయన ఇద్దరు సహచరులపైనా కేసు నమోదైంది. దీంతో గురువారం సాయంత్రం ఈశ్వరప్ప మాట్లాడుతూ, బసవరాజ్ బొమ్మయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో తాను నేటి వరకు మంత్రిగా ఉన్నానని, శుక్రవారం మంత్రి పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. 


Updated Date - 2022-04-15T17:02:26+05:30 IST