హెల్మెట్లతో అసెంబ్లీకి వచ్చిన విపక్ష ఎమ్మెల్యేలు

ABN , First Publish Date - 2021-07-26T21:12:33+05:30 IST

గత మార్చి 23న అసెంబ్లీలో పోలీసులు, స్థానిక గూండాలు తమపై దాడులు చేసిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఈసారి ఎవరికి వారు..

హెల్మెట్లతో అసెంబ్లీకి వచ్చిన విపక్ష ఎమ్మెల్యేలు

పాట్నా: హెల్మెట్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్లపై విపక్ష నేతలు సోమవారంనాడు బీహార్ అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఈ ఏర్పాట్లన్నీ తమ భద్రత కోసమే అని చెప్పారు. గత మార్చి 23న అసెంబ్లీలో పోలీసులు, స్థానిక గూండాలు తమపై దాడులు చేసిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఈసారి ఎవరికి వారు భద్రతా ఏర్పాట్లు చేసుకున్నామని, హెల్మెట్లు, ఫస్ట్ ఎయిడ్ బాక్సులు తెచ్చుకున్నామని మీడియాకు తెలిపారు. నల్లటి మాస్కులు అందరికీ పంచుతూ కనిపించారు.


ఆర్జేడీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ గత మార్చి 23న పోలీసులు, స్థానిక గూండాలను పిలిపించి అసెంబ్లీలోనే తమపై ఉసిగొలిపారని, పోలీసులను సస్పెండ్ చేసినంత మాత్రాన అదేమీ పనిష్‌మెంట్ కాదని అన్నారు. అసెంబ్లీలో భద్రత కోసమే తాము హెల్మెట్లు ధరించామని, పోలీసులు, స్థానిక గూండాలు తమపై దాడి చేస్తే తలకు దెబ్బలు తగలకుండా హెల్మెట్లు తమను కాపాడతాయని చెప్పారు. బీహార్ ప్రత్యేక సాయుధ పోలీసు బిల్లును తక్షణం ఉపసంహరించాలని మార్చి 23న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో విపక్ష నేతలు ఆందోళనకు దిగడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ క్రమంలోనే పోలీసులు, స్థానిక గూండాలు తమపై దాడి చేశారంటూ విపక్ష నేతలు ఆరోపించిన ఘటనలో ఇద్దరు పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు. అసెంబ్లీ వెలుపల మహిళా ఎమ్మెల్యేలకు మహిళా పోలీసులు ఎస్కార్ట్‌గా నిలవాల్సిన పరిస్థితి తలెత్తింది.

Updated Date - 2021-07-26T21:12:33+05:30 IST