ఇదేనా రైతు ప్రభుత్వమంటే?

ABN , First Publish Date - 2021-06-18T08:22:25+05:30 IST

‘‘రైతు ప్రభుత్వమని చెప్పి, ఆ రైతులనే నిండా ముంచే విధానాలను అవలంభిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే వరుస విపత్తులతో నష్టపోయిన అన్నదాతలకు ప్రభుత్వం ధాన్యం బకాయిలు సరైన సమయంలో

ఇదేనా రైతు ప్రభుత్వమంటే?

పంట కొనుగోళ్లలో వైఫల్యం.. రైతుకు చెల్లింపుల్లో నిర్లక్ష్యం

సర్కారు నిర్వాకంతో అన్నదాతల అగచాట్లు

మద్దతు ధరలకు ప్రభుత్వమే కొనాలి

కొన్న పంటలకు తక్షణమే చెల్లింపులు చేయాలి

సీఎం జగన్‌కు ప్రతిపక్ష నేత చంద్రబాబు లేఖ


అమరావతి, జూన్‌ 17(ఆంధ్రజ్యోతి): ‘‘రైతు ప్రభుత్వమని చెప్పి, ఆ రైతులనే నిండా ముంచే విధానాలను అవలంభిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే వరుస విపత్తులతో నష్టపోయిన అన్నదాతలకు ప్రభుత్వం ధాన్యం బకాయిలు సరైన సమయంలో చెల్లించకపోవడంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మద ్దతు ధరకు పంట కొనుగోలు చేయడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది’’ అని ప్రతిపక్ష నేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ధాన్యం కొనుగోలు, బకాయిల చెల్లింపుల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం, పంటలకు లభించని గిట్టుబాటు ధరలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి గురువారం ఆయన లేఖ రాశారు.


‘‘టీడీపీ హాయంలో ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ చేశాం. మీరు ధాన్యం కొనుగోళ్ల చెల్లింపు గడువును 21 రోజులకు పెంచారు. అయినా ఆ గడువులోపు రైతులకు నగదు ఇవ్వడం లేదు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి, రెండు నెలలు దాటినా ఉలుకూ, పలుకూ లేదు. దీంతో పంటలు పండించేందుకు తీసుకున్న అప్పులకు వడ్డీలు ఎవరు కడతారు? ఖరీ్‌ఫకు పెట్టుబడులు ఎవరిస్తారు? బకాయిలు సకాలంలో చెల్లించకపోవడంతో వడ్డీలు పెరిగిపోతున్నాయి. వాటిని ఎవరు భరిస్తారు? ధాన్యం డబ్బుల కోసం కాళ్లు అరిగేలా తిరుగుతున్నా, ప్రభుత్వం నిమ్మకునీత్తినట్లు వ్యవహరిస్తోంది. అన్నదాతలను అప్పుల పాలు చేస్తోంది. రైతులకు చెల్లించాల్సిన బకాయులు రూ.4 వేల కోట్లపైనే ఉన్నాయి. ఇప్పటికే ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో చాలా వరకు రైతులు ధాన్యం విక్రయించగా, ఒక్క గోదావరి జిల్లాల్లోనే రూ.2,500 కోట్లు బకాయిలున్నట్లు చెప్తున్నారు. తక్షణమే ఆ బకాయిలు చెల్లించాలి’’అని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.


మరోవైపు ధాన్యం సేకరణలోనూ తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. 45 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని  కొనుగోలు చేస్తామని చెప్పి, ఇప్పటికి 27.87 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించారన్నారు. ప్రభుత్వం ఇస్తున్న కొనుగోలు ధరతో రైతులు క్వింటాకు రూ.300 నుంచి రూ.800 వరకు నష్టపోతున్నారన్నారు. మిల్లర్లు, వైసీపీ నాయకులు కుమ్మక్కై రైతుల్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. ‘‘రాష్ట్రంలో 16లక్షల మంది కౌలు రైతులున్నారు. జగన్‌ ప్రభు త్వం చేతకానితనంతో ఈ సంఖ్యను 41 వేలకు కుదించి రైతు భరోసాను ఇస్తోంది. కౌలు రైతులకు విత్తనాలు, ఎరువులు అందడం లేదు. సున్నా వడ్డీ, పంటల బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లింపుల్లోనూ కౌలు రైతులు నష్టపోయారు. ఈ క్రాప్‌ నమోదు పేరుతో రైతును ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ-క్రా్‌పపై అవగాహన లేక, అనేక మంది పేర్లు నమోదు చేసుకోలేదు. దీంతో వారు నష్టపోతున్నారు. పంటచేలో పని చేసుకోవాల్సిన రైతుల్ని రోడ్డున పడేసి, ఇబ్బంది పెడుతున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా గిట్టుబాటు ధర కల్పించి, అన్నదాతలను ఆదుకోవాలి’’ అని కోరారు. వరితో పాటు అపరాలు, నూనెగింజలు పండించిన రైతులు కూడా పంట ఉత్పత్తులు అమ్ముకునేందుకు ఇబ్బందులు పడుతున్నారన్నారు. దళారుల వద్ద కనీస మద్దతు ధర రావడం లేదని తెలిపారు. 

Updated Date - 2021-06-18T08:22:25+05:30 IST