సెల్ఫ్‌ గోల్స్‌లో విపక్షం బిజీ

ABN , First Publish Date - 2021-08-06T08:03:45+05:30 IST

ఒకవైపు దేశం గోల్స్‌ మీద గోల్స్‌ కొట్టి పతకాలు సాధిస్తుం టే మరోపక్క ప్రతిపక్షం రాజకీయ స్వార్థం తో పార్లమెంటును స్తంభింపజేసి సెల్ఫ్‌ గోల్స్‌ చేసుకుంటోందని ప్రధాని మోదీ అన్నారు.

సెల్ఫ్‌ గోల్స్‌లో విపక్షం బిజీ

పార్లమెంటును ఆపగలరేమో.. ప్రగతిని ఆపలేరు: ప్రధాని మోదీ

లఖ్‌నవూ, ఆగస్టు 5: ఒకవైపు దేశం గోల్స్‌ మీద గోల్స్‌ కొట్టి పతకాలు సాధిస్తుం టే మరోపక్క ప్రతిపక్షం రాజకీయ స్వార్థం తో పార్లమెంటును స్తంభింపజేసి సెల్ఫ్‌ గోల్స్‌ చేసుకుంటోందని ప్రధాని మోదీ అన్నారు. గురువారం ఆయన ఉత్తరప్రదేశ్‌ ఆహార భద్రత పథకం లబ్ధిదారులతో ఢిల్లీ నుంచి వీడి యో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. దేశం ఏం కోరుకుంటోంది? ఏం సాధిస్తోంది? దేశంలో ఎలాం టి మార్పులు జరుగుతున్నాయనేది విపక్షాలకు పట్టదన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం విపక్షాలు పార్లమెంటును అవమానిస్తున్నాయని ఆరోపించారు. మానవ జాతి గతంలో ఎన్నడూ ఎరుగని అతి పెద్ద సంక్షోభం నుంచి బయట పడటానికి దేశ ప్రజలంతా కష్టపడుతుంటే దేశ ప్రయోజనాలకు సంబంధించిన పనులను ఆపేందుకు విపక్షాలు పోటీ పడుతున్నాయని చెప్పారు. స్వార్థపర, దేశ వ్యతిరేక రాజకీయాలకు భారతీయులను బందీ కానివ్వబోమన్నారు. దేశాభివృద్ధిని అడ్డుకొనేందుకు విపక్షాలు ఎంతగా ప్రయత్నించినా దేశం ముందడుగు వేయడం ఆగదని స్పష్టం చేశారు. 


విపక్షాలు పార్లమెంటు కార్యకలాపాలను అడ్డుకోగలవేమో కానీ దేశాభివృద్ధిని అడ్డుకోలేవని, వాటిని 130 కోట్ల మంది భారతీయులు వమ్ము చేస్తారని అన్నారు. ప్రతిపక్ష నేతలను మోదీ దేశ వ్యతిరేకులుగా అభివర్ణించా రు. దేశాభివృద్ధిని అడ్డుకోవడమే వారి అసలు లక్ష్యమని చెప్పారు. ఢిల్లీలో అధికారానికి, దేశాభివృద్ధికి మార్గం ఉత్తరప్రదేశ్‌ నుంచే వెళుతుందని, దశాబ్దాల పాటు ఉత్తరప్రదేశ్‌ను ఏలిన కొన్ని కుటుంబాలు రాష్ట్రాన్ని ఏ మాత్రం ముందుకు తీసుకెళ్లలేదని అన్నారు. ప్రస్తుతం ఆ కుటుంబాల విషపు వలయం నుంచి రాష్ట్రం బయటపడి వేగం గా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. కరోనా లాంటి భారీ సంక్షోభాలు గతంలో తలెత్తినపుడు మొత్తం వ్యవస్థలు కుప్పకూలేవని, భవిష్యత్తు పట్ల ప్రజల నమ్మకం సడలిపోయేదని చెప్పారు. తాజా కరోనా విపత్తు సమయంలోనూ దేశంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నిర్మాణాలేవీ ఆగలేదని గుర్తు చేశారు. గత ప్రభుత్వాలు పేదలకు ఉద్దేశించిన ఆహార ధాన్యాలను దోచుకున్నాయన్నారు. ప్రస్తుతం రాష్ట్రాన్ని ఏలుతున్న యోగి ఆదిత్యనాథ్‌ను కర్మయోగిగా అభివర్ణించారు. ఆయన ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్నయోజన పథకం కింద 80 వేల రేషన్‌ దుకాణాల ద్వారా ప్రతినెలా 15 కోట్ల మందికి ఆహార ధాన్యాలు అందిస్తున్నట్లు చెప్పారు. 


చరిత్రలో నిలిచిపోయే రోజు 

ఆగస్టు 5 చరిత్రలో నిలిచిపోయే రోజని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత హాకీ జట్టు టోక్యో ఒలింపిక్స్‌లో కంచు పతకం సాధించిన నేపథ్యంలో ఆయన వారికి అభినందనలు తెలిపారు. 2019 ఆగస్టు 5న జమ్మూ కశ్మీరుకు సంబంధించి రాజ్యాంగంలోని 370వ అధికరణను రద్దు చేశామని, 2020 ఆగస్టు 5న అయోధ్యలో రామాలయానికి శంకుస్థాపన చేశామని, 2021 ఆగస్టు 5న భారత పురుషుల హాకీ జట్టు జర్మనీ జట్టుపై విజయం సాధించిందని ప్రస్తావించారు. ఆగస్టు 5వ తేదీ మూడోసారి దేశ ప్రజలందర్నీ హర్షాతిరేకాల్లో ముంచెత్తిందని వ్యాఖ్యానించారు. 

Updated Date - 2021-08-06T08:03:45+05:30 IST