మీరు మారిపోయారు సార్‌!

ABN , First Publish Date - 2021-03-02T09:31:02+05:30 IST

మీరు గతంలో మాదిరిగా లేరు, చాలా మారిపోయారు సార్‌...

మీరు మారిపోయారు సార్‌!

  • వైసీపీ అరాచకాలపై చర్యలేవీ
  • ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోరా
  • మీ ధైర్యం గ్రేట్‌.. కానీ, ఉదాసీనత సరికాదు
  • మున్సిపల్‌ ఎన్నికలపై అఖిలపక్ష సమావేశంలో ఎస్‌ఈసీ నిమ్మగడ్డపై విపక్షాల అసంతృప్తి 


అమరావతి, మార్చి 1(ఆంధ్రజ్యోతి): ‘‘మీరు గతంలో మాదిరిగా లేరు, చాలా మారిపోయారు సార్‌. మునిసిపాలిటీ, కార్పొరేషన్‌ ఎన్నికల్లో అధికార వైసీపీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారని మేం ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. చర్యలు తీసుకోవడం లేదు. ఉదాసీనంగా ఉంటే ఎలా?’’ అని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌(ఎ్‌సఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను ఉద్దేశించి విపక్ష పార్టీల నేతలు అసంతృప్తి వ్యక్తంచేశారు. మున్సిపల్‌, కార్పొరేషన్‌ ఎన్నికలపై విజయవాడలోని ఎస్‌ఈసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, కాంగ్రెస్‌, వామపక్షాలు, జనసేన, వైసీపీ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా.. టీడీపీ నుంచి హాజరైన పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మాట్లాడుతూ.. ఎస్‌ఈసీ ఉదాసీనంగా వ్యవహరిస్తోందన్నారు. అధికార వైసీపీ నేతల అరాచకాలు పేట్రేగుతున్నాయని, అభ్యర్థులను బెదిరించి నామినేషన్ల ఉపసంహరణ చేసేలా ఒత్తిడి చేస్తున్నారని, దీనిపై తాము ఫిర్యాదులు చేస్తున్నా ఎస్‌ఈసీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అయితే.. రాష్ట్ర ప్రభుత్వం ఎంతగా అడ్డుకున్నప్పటికీ ఖాతరు చేయకుండా స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిపేలా ఎస్‌ఈసీ ఎంతో ధైర్యంగా వ్యవహరించిందని ప్రశంసించారు.


ఇటీవల ముగిసిన పంచాయతీ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార పక్షం రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో అరాచకాలకు, ఘోరాలకు పాల్పడిందంటూ సాక్ష్యాధారాలతో సహా తాము ఫిర్యాదులు చేసినా ఎస్‌ఈసీ స్పందించలేదని అసహనం వ్యక్తంచేశారు. ఇదే ధోరణిని మున్సిపల్‌ ఎన్నికల్లోనూ కొనసాగిస్తే పంచాయతీ ఎన్నికల కంటే ఘోరంగా పరిస్థితులు మారే అవకాశం ఉందని  ఆందోళన వ్యక్తం చేశారు.. కాంగ్రెస్‌ ప్రతినిధిగా హాజరైన మస్తాన్‌ వలీ మాట్లాడుతూ.. ఎస్‌ఈసీ రమేశ్‌కుమార్‌ రాష్ట్ర ప్రభుత్వానికి లొంగిపోయినట్లుగా అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. సీపీఐ ప్రతినిధి విల్సన్‌ మాట్లాడుతూ.. ఎలాగైనా సరే ఈ ఎన్నికల్లో గెలుపొందాలనే లక్ష్యంతో వైసీపీ నేతలు పలు అక్రమాలు, అవకతవకలకు పాల్పడుతున్నారని, ఎస్‌ఈసీకి ఫిర్యాదు చేసినా స్పందన శూన్యమని విమర్శించారు. కాగా, అధికార వైసీపీ తరఫున హాజరైన నారాయణమూర్తి మాట్లాడుతూ.. వలంటీర్లపై ఎస్‌ఈసీ నియంత్రణ తగదన్నారు. కాగా, సమావేశంలో వర్ల రామయ్య వ్యాఖ్యలపై ఎస్‌ఈసీ అసహనం వ్యక్తం చేశారు. ‘ఇలా వ్యాఖ్యానించడం సరికాదు’ అని నిమ్మగడ్డ హితవు పలికారు. 


న్యాయ వ్యవస్థకు లోబడే నిర్ణయాలు: ఎస్‌ఈసీ

‘‘ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏ నిర్ణయమైనా న్యాయ వ్యవస్థకు, నిబంధనలకు లోబడే తీసుకున్నాం. కొన్ని అంశాల్లో హైకోర్టు ఇచ్చిన సూచనల మేరకే వ్యవహరించా’’ అని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ అన్నారు. ఎన్నికల ప్రచారంలో అన్ని రాజకీయ పక్షాలు, అభ్యర్థులు నిబంధనలతోపాటు కొవిడ్‌ ప్రవర్తనావళిని తప్పకుండా పాటించాలని కోరారు.


ఎస్‌ఈసీలో మార్పు!

తూతూ మంత్రంగా భేటీ: వర్ల

ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలకు, అరాచకాలకు అడ్డుకట్ట వేయడానికి మొదట్లో ప్రయత్నించిన ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌.. తర్వాత మెత్తబడ్డారని వర్ల రామయ్య ఆరోపించారు. గవర్నర్‌ను కలిసి వచ్చిన తర్వాత ఆయనలో ఈ మెతక వైఖరి స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఎస్‌ఈసీతో భేటీ అనంతరం టీడీపీ కార్యాలయంలో వర్ల మీడియాతో మాట్లాడారు. ‘‘ఎన్నికలపై అఖిలపక్ష సమావేశాన్ని తూతూ మంత్రంగా నిర్వహించారు. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న అధికారులు వైసీపీకి అనుకూలంగా వ్యవహరించకుండా అదుపు చేయాలి. మేం అనేక ఘటనలపై ఫిర్యాదులు చేసినా చర్య తీసుకోలేదు. ఇలాగైతే ఎన్నికలు జరపడం ఎందుకు?’’ అని  ప్రశ్నించారు. 

Updated Date - 2021-03-02T09:31:02+05:30 IST