సంక్షోభంలో సదవకాశం

ABN , First Publish Date - 2020-04-09T05:51:07+05:30 IST

కరోనా వంటి భయంకరమైన అంటు వ్యాధులు కొన్ని కఠోర సత్యాలను మనకు గుర్తు చేస్తుంటాయి. ఈ సత్యాలను ప్రకృతి చేసే హెచ్చరికలుగా గుర్తించాలి. గతంలో ప్లేగు, కలరా, ఎయిడ్స్ వంటి అనేక రకాల అంటు వ్యాధులు ప్రపంచ వ్యాప్తంగా ...

సంక్షోభంలో సదవకాశం

ఆధ్యాత్మిక చింతన, వేదాంత ధోరణి, ప్రేమతత్వం, సహోదర భావం, నిస్వార్థ జీవనం, పరిమిత కోరికలు, నిరాడంబర జీవితం, ఉన్నతమైన మానవతా విలువలను పెంపొందించుకొని లోక కల్యాణం కోసం ఏ విధంగా పాటుపడాలో అలోచించి ఆచరించాలి. ప్రకృతి నుండి నేర్చుకొని, ప్రకృతిని రక్షించుకుంటూ ప్రకృతితో మమేకమై కలకాలం సుఖ సంతోషాలతో నివసించడం నేర్చుకోవాలి. ఈ విషయాల గురించి ఆలోచించే సమయం కరోనా సంక్షోభం మనకు అందించిన మంచి అవకాశం.


కరోనా వంటి భయంకరమైన అంటు వ్యాధులు కొన్ని కఠోర సత్యాలను మనకు గుర్తు చేస్తుంటాయి. ఈ సత్యాలను ప్రకృతి చేసే హెచ్చరికలుగా గుర్తించాలి. గతంలో ప్లేగు, కలరా, ఎయిడ్స్ వంటి అనేక రకాల అంటు వ్యాధులు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమందిని బలితీసుకున్న విషయం మనకు తెలిసిందే. అప్పటికంటే నేడు వైద్య విజ్ఞానరంగంలో ఎంతో పురోగతిని సాధిం చాం. కంప్యూటర్, కమ్యూనికేషన్, ఇంటర్నెట్, ఫేస్‌బుక్, తదితర ఆధునిక సాంకేతిక వ్యవస్థల వల్ల నేడు ప్రపంచం మొత్తం ఏకీకృత ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందుతూ వుంది. ప్రపంచ దేశాల మధ్య ఆదాన ప్రదానాలు, వ్యాపార లావాదేవీలు నానాటికి పెరుగుతూ వున్నాయి. ఇలా వస్తున్న మార్పులు మనుషుల జీవన ప్రమాణాలు, జీవన విధానాలను ప్రభావితం చేస్తూ మానవ జీవితాలు, సంస్కృతీనాగరికతల్లో అనూహ్య పరిణామాలకు కారణమవుతున్నాయి. ప్రపంచీకరణ ప్రక్రియ వేగం పుంజుకుంది. అందువల్ల కరోనా వంటి వ్యాధులు వేగంగా ప్రపంచమంతా వ్యాప్తి చెందుతాయి. ఆర్ధిక వ్యవస్థలతో పాటు అన్ని వ్యవస్థలు తిరోగమనంలో పడతాయి.


ఎంతగా అభివృద్ధి చెంది పురోగతిని సాధించినా కరోనా వంటి వ్యాధుల వల్ల మానవ జాతి మనుగడే ప్రశార్థకంగా మారే పరిస్థితులు మనల్ని వెన్నంటే నీడలా వెంటాడుతుంటాయి. అభివృద్ధి, ఆధునికత, పురోగతి, విజ్ఞానం, పరిశోధనలు దారి తప్పి ప్రకృతికి, మానవునికి మధ్య సంబంధాలను కలుషితం చేసి, మానవ మనుగడను సవాలు చేసే పరిస్థితులను సృష్టించుకొంటున్నాము. మనుగడకు ఆధారభూతమైన ప్రకృతి సంబంధ సూత్రాలను, నియమ నిబంధలను ఉల్లఘింస్తున్నాము. మంచి నీటిని అందించే మంచు పర్వతాలు, స్వచ్ఛమైన గాలి, భూగర్భ ఖనిజాలు, జలాలు, సముద్రపు జంతు రాశి, వృక్షరాశి, ఓజోన్ పొర రక్షణ కవచం, భూమిపై నివసించే పశుపక్ష్యాదులు, పచ్చని అడవులు అందించే ఆక్సిజన్, వర్షం, ఋతువులు ఇవన్నీ మానవ జాతి మనుగడను ప్రభావితం చేసే ప్రాకృతిక అంశాలు. అవసరానికి మించి, హద్దులేని కోరికలను తీర్చు కొనుటకు ప్రకృతి సంపదను హరించి వేయడం శాపంగా మారింది. అవసరాలకు తగినంత సం పద ప్రకృతిలో వుంది కాని మన అనవసర కోర్కెలను తీర్చే శక్తి ప్రకృతికి లేదు అన్న విషయం గుర్తిస్తే మంచిది. సుఖభోగాల కోసం, భౌతిక ఆనందాల కోసం, ప్రకృతి వనరులను కొల్లగొడుతూ జీవరాశి సమతుల్యతను నాశనం చేస్తున్నామని తెలుసు కోవాలి. నానాటికి పెరుగుతున్న వాతావరణ కాలుష్యం, చిత్ర విచిత్రమైన ఆహారపుటలవాట్లు, విభిన్నమైన మత్తు పదార్థాల వినియోగం, అసహజమైన లైంగిక ప్రవృత్తి, అవసరానికి మించి ఇంటర్నెట్ వినియోగం, సహజ విరుద్ధమైన వినోద క్రీడలు.. ఇలా అనేక రకాల అంశాలను మానవ జాతి ప్రకృతి వ్యతిరేక వికృత చేష్టలుగా చెప్పుకొనవచ్చు. మానవాళిలో నానాటికి పెరుగుతున్న స్వార్థ చింతనలు, కామ క్రోధాలు, అవినీతి, కక్షలు, కార్పణ్యాలు, ధనాపేక్ష, మంచిని ద్వేషించుట, చెడుని గౌరవించుట వంటి అంశాలు, పతనమవుతున్న మానవతా విలువలు ప్రకృతికి మానవునికి మధ్య వున్న సమతుల్య సంబధాలను నాశనం చేస్తున్నాయి. ధనార్జనే ద్యేయంగా సుఖ భోగాలే లక్ష్యంగా మనిషి జీవితం అంతులేని అలుపెరుగని పరుగుగా మారింది. 


లాక్‌డౌన్ వల్ల ఇంటికే పరిమితమవుతున్న ప్రజలు ఒక్కసారిగా ఈ పరుగుని తాత్కాలికంగా ఆపివేశారు. ఈ విశ్రాంత సమయంలో ఆత్మ పరిశీలన, ఆత్మావలోకనం చేసుకోవడం ఉత్తమం. మన జీవన ప్రయాణం గురించి, వర్తమాన, భవిష్యత్ గురించి లోతైన విషయాలను విశ్లేషణాత్మకంగా కూలంకషంగా పరిశీలించుకొనవలసిన సమయం. ఆధ్యాత్మిక, వేదాంత ధోరణిలో మనల్ని మనం స్వీయ అధ్యయనం చేసుకొనవలసిన సమయం. వ్యక్తిగా, కుటుంబంగా, సమాజంగా, దేశంగా, ప్రపంచంగా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒక క్రమం, పద్ధతి, సమతుల్యత, సహజీవనం అనే అంశాలను ప్రకృతి నుండి, నేర్చుకోవాలి. ప్రకృతి మాదిరే విశ్వం కూడా క్రమబద్ధంగా నడుస్తోంది. నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు, వంటివి నిరంతరం క్రమం తప్పకుండా వాటి వాటి కక్ష్యలలో లక్షల కి.మీ. వేగంతో కోటానుకోట్ల కి.మీ ప్రయాణిస్తూనే ఉంటాయి. వీటి చలనాల మూలంగానే మనం భూమి మీద నిశ్చలంగా నివసించగలుగుతున్నాము. ప్రకృతితో పెనవేసుకున్న మనం ప్రకృతిని అనుసరించి క్రమశిక్షణతో జీవించకపోతే మనల్ని మనం నాశనం చేసుకోవడం తథ్యం.


ప్రకృతిని శాసించడం గాని, నియంత్రించడం గాని సాధ్యంకానప్పుడు, దానిననుసరించి జీవించడం మేలుకదా! వేదాంత ధోరణిలో చూస్తే అనంత విశ్వంలో ఒక గెలాక్సీ చాలా చిన్నది. గెలాక్సీతో పోలిస్తే సూర్య కుటుంబం ఇంకా చిన్నది. సూర్య కుటుంబంతో పోలిస్తే భూమి ఎంతో చిన్నది. అనంత విశ్వంలో రేణువులాంటి ఈ భూమి మీద నివసించే మనిషి జీవితం ఏపాటిది..? అత్యంత స్వల్పం, అశాశ్వతం. అది ఆవిరి వంటిది, నీటి బుడగ వంటిది. ఈ జీవన సత్యాలను గ్రహించి వైరాగ్యం చెంది నీరసం చెందాలని కాదు గాని, మన జీవన గమ్యం, గమనాలను సరి చేసుకొని ముందుకు వెళ్లాలని చెప్పడం నా ఉద్దేశం. ఆయా దేశాల మధ్య ఆధిపత్య పోటీ వలన, ఈ భూమిని 100 సార్లు నాశనం చేయగల సామర్థ్యం గల ఆయుధాలను సృష్టించుకొన్నాము. పొరపాటున మూడవ ప్రపంచ యుద్ధం వస్తే నాల్గవ ప్రపంచం యుద్ధం ఉండదు. మానవులతో సహా ప్రకృతి సంపద మొత్తం నాశనం అవుతుంది. కావున కరోనా వలన ఇంటికే పరిమితమైన ప్రజలు ప్రకృతితో ఏవిధంగా సహజీవనం చేయాలి, క్రమశిక్షణ, పరిమిత కోరికలు, ఆరోగ్య కరమైన జీవన ప్రమాణాలు ఏవిధంగా అలవర్చుకుని భూతలస్వర్గాన్ని ఏవిధంగా నిర్మించుకోవాలో ఆలోచించాలి. ప్రపంచ దేశాల నాయకత్వం మానవ జాతి మనుగడకు నడుం బిగించాలి. వాతావరణ కాలుష్యం, ఓజోన్ పొర పరిరక్షణ, అణ్వయుధాల నియంత్రణ, అసమానతలను తగ్గించడం, పేదరిక నిర్మూలన, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, మనోవికాసం, సంతోషం, ఆనందం, శారీరక ధారుడ్యం, అందరికి అందుబాటులో వుండే వైద్య, విద్య, గృహ సదుపాయం మొదలగు విషయాలపట్ల ఏకాభిప్రాయానికి రావాలి. ఆయా దేశాలను పట్టి పీడిస్తున్న అంతర్గత, అంతర్జాతీయ సమస్యలను రాజకీయ ప్రయోజనాలకోసం జటిలం చేయకుండా, సమస్త మానవాళి కోసం సత్వరమే పరిష్కరించుకోవాలి. మత విశ్వాసాలు మానవత్వాన్ని పెంచి పోషించాలే తప్ప మనుషుల మధ్య అంతరాలు పెంచకూడదు. సిద్ధాంతాలు మానవ జాతి పురోగతికి ఉపయోగపడాలి తప్ప దేశాల మధ్య వైరుధ్యాలను సృష్టించకూడదు. ఆచార సంప్రదాయాలు మనుషులను ఐక్యం చేయాలి కాని విభేదాలు సృష్టించ కూడదు. మన సంస్కృతి, నాగరికతలు సకల జనులను సన్మార్గంలో నడపాలి గాని పెడదారి పట్టకూడదు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పురోగతికి ఉపయోగపడాలిగాని వినాశనానికి దారితీయ కూడదు. అంతరాలు క్రమేపి తగ్గాలి గాని నానాటికి పెరగకూడదు. మానవ సంబంధాలు మానవత్వపు విలువల పునాదుల మీద పునర్ నిర్మించబడాలి. సహోదర భావం, పరస్పర సహకారం, సహజీవనం అనే సూత్రాలను ఆధారం చేసుకొని ఆయా సమాజాల, ప్రాంతాల మధ్య సంబంధాలు సరికొత్తగా ఏర్పాటు చేసుకోవాలి. దేశాల మధ్య సంబంధాలు మెరుగుడి, యుద్ధ వాతావరణం పూర్తిగా సమసి పోవాలి. సంపన్న దేశాలు, పేద దేశాలకు బాసటగా నిలవాలి. ఆధ్యాత్మిక చింతన, వేదాంత ధోరణి, ప్రేమ తత్వం, సహోదర భావం, నిస్వార్థ జీవనం, పరిమిత కోరికలు, నిరాడంబర జీవితం, ఉన్నతమైన మానవతా విలువలను పెంపొందించుకొని లోక కల్యాణం కోసం ఏ విధంగా పాటుపడాలో ఆలోచించి ఆచరించాలి. ప్రకృతి నుండి నేర్చుకొని, ప్రకృతిని రక్షించు కుంటూ ప్రకృతితో మమేకమై కలకాలం సుఖ సంతోషాలతో నివసించడం నేర్చుకోవాలి. ఈ విషయాల గురించి ఆలోచించే సమయం కరోనా సంక్షోభం మనకు అందించిన మంచి అవకాశం.

రావెల కిషోర్ బాబు, మాజీ మంత్రి

Updated Date - 2020-04-09T05:51:07+05:30 IST