అసైన్డ్‌ భూములకూ అవకాశం

ABN , First Publish Date - 2020-09-12T09:16:32+05:30 IST

ఇప్పటికే అనుమతి లేఅవుట్లను, వ్యక్తిగత ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు అవకాశం ఇచ్చిన ప్రభుత్వం తాజాగా అసైన్డ్‌ భూములపై కూడా దృష్టి సారించింది

అసైన్డ్‌ భూములకూ అవకాశం

క్రమబద్ధీకరించేందుకు సర్కారు కసరత్తు

ఉమ్మడి జిల్లాలో 1.30 లక్షల ఎకరాలు 

ఇప్పటికే 50 శాతం భూములు చేతులు మారినట్టు అంచనా

గతంలోనే వివరాల సేకరణ


హన్మకొండ, సెప్టెంబర్‌ 11 (ఆంధ్రజ్యోతి): 

ఇప్పటికే అనుమతి లేఅవుట్లను, వ్యక్తిగత ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు అవకాశం ఇచ్చిన ప్రభుత్వం తాజాగా అసైన్డ్‌ భూములపై కూడా దృష్టి సారించింది. ఇందుకోసం ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. తెలిసో తెలియక అసైన్డ్‌ భూములను కొన్నవారు వ్యవసాయ భూములకు పట్టాలు రాక, ఇళ్ల స్థలాలకు అనుమతులు దొరక్క అనేక ఇబ్బందులు పడుతున్నారు. అటువంటివారికి ఇది సదవకాశం. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో గత 50-60 ఏళ్ళ కాలంలో సుమారు లక్ష 30వేల ఎకరాల అసైన్డ్‌ భూమిని ప్రభుత్వం భూమిలేని నిరుపేదలకు పంపిణీ చేసింది. అయితే ఇప్పటికే ఇందులో 50 శాతం భూములు పరాధీనం అయ్యాయి. వీటి క్రయవిక్రయాలపై నిషేధం ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున భూమార్పిడులు జరిగాయి. ధనబలం, అంగబలం, రాజకీయ పలుకుబడి ఉన్నవారు అమాయక పేదల నుంచి అసైన్డ్‌   భూములను బలవంతంగా లాక్కున్నారు. మరికొన్ని చోట్ల రియల్‌ ఏస్టేట్‌ వ్యాపారులు వీరికి డబ్బు ఆశ చూపి అందులో వెంచర్లు చేసి సొమ్ము చేసుకున్నారు. ఈ భూముల్లోని నిర్మాణాలకు చట్టబద్ధత లేకపోవడంతో తెలిసోతెలియకో కొన్నవారు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ భూములపై ఏర్పడిన వివాదాలు సంవత్సరాలు గడుస్తున్న పరిష్కారాలు కావడం లేదు. ఈ సమస్యకు క్రమబద్ధీకరణే పరిష్కారమని సర్కారు భావిస్తోంది. 


ఇదివరకే వివరాల సేకరణ..

రాష్ట్రంలోని అసైన్డ్‌ భూముల లెక్కలను ప్రభుత్వం ఇది వరకే తేల్చింది. భూ రికార్డుల ప్రక్షాళన పూర్తవడంతో అసైన్డ్‌ భూముల వివరాలపై కాస్త స్పష్టత వచ్చింది. పేదల వద్ద ఎన్ని అసైన్డ్‌ భూములు ఉన్నాయి? ధనికుల చేతుల్లోకి వెళ్ళిన భూములు ఎన్ని? వివరాలను సేకరించింది. వాస్తవానికి అసైన్డ్‌ భూముల చట్టం -1977 ప్రకారం పేదలకు అసైన్‌ చేసిన భూములను మరొకరికి అమ్మడానికి, కొనడానికి వీళ్ళేదు. ఈ విషయం తెలియని అనేక మంది రైతులు ప్రభుత్వం ఇచ్చిన భూములను అమ్మేసుకున్నారు. భూరికార్డుల ప్రక్షాళన (ఎల్‌ఆర్‌యూపీ) సందర్భంగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలోనే ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో సుమారు 60వేల ఎకరాల భూములు చేతులు మారినట్టు అధికారులు గుర్తించారు. ఆ భూములకు పట్టాదారు పాస్‌పుస్తకాలు ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టారు. కొనుగోలు చేసినవారిలోనూ చాలా వరకు పేదలే ఉండడంతో వారికి న్యాయం చేసేందుకు ప్రభుత్వం 2018 మార్చిలో అసైన్డ్‌ భూముల చట్టానికి సవరణ చేసింది. దాని ప్రకారం అర్హులైన పేదలకు రెవెన్యూ శాఖ పట్టాదారు పాస్‌ బుక్కులు జారీ చేసింది.


అన్యాక్రాంతం..

పేదలకు ఇచ్చిన భూములు పోగా మిగిలిఇన కొన్ని వేల ఎకరాల అసైన్డ్‌ భూములు డబ్బున్నవాళ్ళ చేతుల్లో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఆరు జిల్లా కేంద్రాలకు సమీపంలో విలువైన భూములు ఉన్నట్టు తేల్చారు. ఈ భూములను తిరిగి స్వాధీనం చేసుకునే ఉద్దేశంతో వాటి వివరాలను కూడా ప్రభుత్వం సేకరించింది. ప్రాంతాన్ని బట్టి మార్కెట్‌ ధర ప్రకారం సంబంధిత వ్యక్తులకు రెగ్యులర్‌ చేయనున్నట్టు సమాచారం. 


అసైన్డ్‌ భూమి అంటే?

భూమిలేని పేదలకు ప్రభుత్వం పంపిణీ చేసిన సీలింగ్‌, భూదాన్‌, ప్రభుత్వ భూములను అసైన్డ్‌ భూములు అంటారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో గత 60 సంవత్సరాల్లో లక్షా 30 వేల  ఎకరాలకుపైగా భూమిని అసైన్డ్‌ భూమిగా వ్యవసాయం, ఇంటి స్థలాల కోసం పేదలకు ప్రభుత్వాలు పంపిణీ చేశాయి. ఈ భూములను సాగు చేసుకొని పేదరికం నుంచి బయటకు రావాలన్నది ప్రభుత్వ లక్ష్యం. కానీ ఆచరణలో ఇందుకు భిన్నంగా జరుగుతోంది. ఈ అసైన్డ్‌ భూములను పేదలు తమ ఆర్థిక అవసరాల కోసం అమ్ముకున్నారు. చాలా చోట్ల పేదల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని సంపన్నులు, రాజకీయ పలుకుబడి కలిగినవారు లాక్కున్నారు.  దీనిని నిరోధించేందుకు 1977లో అప్పటి ప్రభుత్వం అసైన్డ్‌ భూముల బదలాయింపు నిషేధం చట్టాన్ని (1977) (పివోటి) తీసుకువచ్చింది.


తరతరాలుగా వారసత్వంగా వచ్చిన ఈ భూమిని సాగు చేసుకోవలసిందే కానీ అమ్మరాదు, దానం, లీజుకు ఇవ్వరాదని స్పష్టం చేసింది. ఒకవేళ  మొదటిసారి బదలాయింపు జరిగితే తహసిల్దార్‌ ఆ భూమిని స్వాధీనం చేసుకొని సదరు వ్యక్తికే తిరిగి అప్పగించాలి. రెండోసారి కూడా భూమి బదలాయింపు జరిగితే ఆ భూమిని స్వాధీనం చేసుకొని మొదటి వ్యక్తికి ఇవ్వకుండా మరో నిరుపేదకు  ఇవ్వాలి. అసైన్డ్‌ భూములు కొనుగోలు చేస్తే చెల్లకపోవడమే కాదు.. కొనడం నేరమని కూడా చట్టం చెబుతోంది. ఇందులో కొన్ని మినహాయింపులు కూడా ఇచ్చారు. 1977 కన్నా ముందు ఎవరైనా అసైన్డ్‌ భూమి కొనుగోలు చేసి సాగుచేసుకున్నట్లయితే దానికి పీవోటి చట్టం వర్తించదు. దీనిని ఆసరా చేసుకొని కొందరు అసైన్డ్‌ భూములను అడ్డదారిన సొంతం చేసుకున్నారు.

Updated Date - 2020-09-12T09:16:32+05:30 IST