ఒపీనియన్ పోల్స్‌పై అఖిలేష్ తీవ్ర విమర్శలు

ABN , First Publish Date - 2022-01-24T23:02:51+05:30 IST

నిజానికి బీజేపీకి ప్రజల్లో ఆదరణ లేదు. కానీ ఒపీనియన్ పోల్స్‌లో బీజేపీ గెలుస్తుందని చెప్తున్నారు. దీనిని బట్టి ఒపీనియన్ పోల్స్‌తో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. అన్ని ఒపీనియన్ పోల్స్ బీజేపీకి అనుకూలంగా తమ ఫలితాలను వెల్లడించాయి..

ఒపీనియన్ పోల్స్‌పై అఖిలేష్ తీవ్ర విమర్శలు

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై వివిధ సర్వే సంస్థలు ‘ఒపీనియన్ పోల్స్’ విడుదల చేశాయి. చాలా సర్వేల్లో భారతీయ జనతా పార్టీ మరోసారి అధికారంలోకి వస్తుందని వెల్లడైంది. అయితే ఇవి భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా నిర్వహించిన సర్వేలని, ప్రజలను తప్పుదోవ పట్టించడానికే బీజేపీకి అనుకూలంగా ఒపీనియన్ పోల్స్ విడుదల చేస్తున్నారని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అంతే కాకుండా ఒపీనియన్ పోల్స్‌ని ‘ఓపియమ్ పోల్స్’(మత్తునిచ్చే పోల్స్) అంటూ అఖిలేష్ విమర్శించారు.


సోమవారం ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ ‘‘నిజానికి బీజేపీకి ప్రజల్లో ఆదరణ లేదు. కానీ ఒపీనియన్ పోల్స్‌లో బీజేపీ గెలుస్తుందని చెప్తున్నారు. దీనిని బట్టి ఒపీనియన్ పోల్స్‌తో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. అన్ని ఒపీనియన్ పోల్స్ బీజేపీకి అనుకూలంగా తమ ఫలితాలను వెల్లడించాయి. ఇది ముందుగా అనుకుని వెల్లించిన సంఖ్యలే. ఇవి ఒపీనియన్ పోల్స్‌ కాదు, ‘ఓపియమ్ పోల్స్’(మత్తునిచ్చే పోల్స్)’’ అని అఖిలేష్ అన్నారు.


గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే బీజేపీ గ్రాఫ్ తగ్గినప్పటికీ ఉత్తరప్రదేశ్‌లో మరోసారి అధికారం ఏర్పాటు చేస్తుందని దాదాపుగా అన్ని సర్వే సంస్థల ఒపినీయన్ పోల్స్ చెబుతున్నాయి. ఇక సమాజ్‌వాదీ పార్టీ అధిక స్థానాలే గెలుచుకున్నప్పటికీ ప్రతిపక్షానికే పరిమితమవుతుందని అంటున్నారు. రాష్ట్రంలో మరో ప్రధాన పార్టీ అయిన బహుజన్ సమాజ్‌ పార్టీ గత ఎన్నికల్లో కంటే మరింత ఘోర పరాజయం పాలవుతుందని ఒపీనియన్ పోల్స్ చెబుతున్నాయి.

Updated Date - 2022-01-24T23:02:51+05:30 IST