విజిలెన్స పనిలో ఆపరేషన్స్..

ABN , First Publish Date - 2021-10-13T04:47:17+05:30 IST

అప్పటివరకు వారికి అక్కడ మీటర్ల మార్పిడి జరిగిన సంగతి తెలియదా? ఏళ్ల తరబడి కనీస చార్జీలు వసూలు చేస్తున్న విషయం వారి దృష్టికి రాలేదా? క

విజిలెన్స పనిలో ఆపరేషన్స్..

ఒకే పనికి రెండు బృందాల విచారణ 

లోగుట్టు దాచేందుకే వారికి అప్పగించారన్న విమర్శలు

ఏళ్ల తరబడి జరుగుతున్న తంతు అధికారులకు తెలియదా?

మీటర్ల మార్పిడిలో స్పాట్‌ బిల్లర్లనే బలిచేస్తూ వస్తున్న వైనం

ఖమ్మం, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): అప్పటివరకు వారికి అక్కడ మీటర్ల మార్పిడి జరిగిన సంగతి తెలియదా? ఏళ్ల తరబడి కనీస చార్జీలు వసూలు చేస్తున్న విషయం వారి దృష్టికి రాలేదా? కమర్షియల్‌ మీటర్‌కు కనీస చార్జి కింద రూ.వెయ్యిలోపే బిల్లులు విధిస్తున్న విషయం వారి నోటీసులో లేదా? ఇటీవల ఖమ్మం నగరంలోని పాండురంగాపురం ప్రాంతంలో వెలుగులోకి వచ్చిన మీటర్ల మార్పిడి విషయంలో వినిపిస్తున్న ప్రశ్నలివి. అయితే విజిలెన్స్‌ అధికారులు.. ఎక్కడి నుంచి తెచ్చారో కూడా తెలియని మీటర్లను పట్టుకోగా.. ప్రస్తుతం దానికి సంబంధించి ఆపరేషన్స అధికారులు కూడా విచారణ చేయడం విమర్శలకు తావిస్తోంది. ఒకే ప్రాంతంలో ఒకే తీరులో జరిగిన మీటర్ల మార్పిడి విషయంలో రెండు బృందాలు వేర్వేరుగా విచారణ చేస్తుండటంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

విజిలెన్స విచారణలో ఆపరేషన్సకు పనేంటి?

పాండురంగాపురంలో వెలుగులోకి వచ్చిన మీటర్ల మార్పిడి సంఘటనలో మొదట విజిలెన్స అధికారులు గతంలో బార్‌గా ఉండి ప్రస్తుతం బేకరీగా ఉన్న దుకాణంలోని కమర్షియల్‌ మీటర్‌ను పరిశీలించేందుకు వెళ్లగా.. అక్కడ మీటర్‌ మార్పిడి జరిగినట్టు ఆ తర్వాత అదే దుకాణంలో మరో రెండు మీటర్లు కూడా మార్చారని, అది కమర్షియల్‌ మీటరు కాగా 2015 నుంచి మినిమం బిల్లునే చెల్లిస్తున్నట్టు గుర్తించారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. దీనికి సంబంధించి విచారణ జరుగుతున్న సందర్భంలోనే... కేవలం రెండు నుంచి మూడు గంటల వ్యవధిలోనే విద్యుత శాఖ అధికారులే మరో మీటరు మార్పిడి జరిగినట్టు గుర్తించి.. దాని విచారణను ట్రాన్సకో ఆపరేషన్సకు అప్పగించారు. కాగా అప్పటి వరకు దొరకని మీటర్లు విజిలెన్స అధికారులు ఒక మీటరును పట్టుకున్నట్టు తెలియగానే రెండో మీటరును విద్యుత శాఖ అధికారులు ఎలా గుర్తించారనే విషయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇన్నాళ్లు వారికి తెలిసే ఆయా అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేనా ఒకే ప్రాంతంలో ఒకే రకమైన అక్రమం జరిగినప్పుడు రెండు బృందాలు విచారణ ఎలా చేస్తారనేది ప్రశ్నగా మారింది. విజిలెన్స అధికారులు విచారణ చేసే సమయంలో ఆపరేషన్స వారికి అక్కడ పనేంటన్న వాదన వినిపిస్తోంది. శాఖలోని పెద్దస్థాయి అధికారులను ఈ వ్యవహారం నుంచి తప్పించేందుకు విజిలెన్స, ఆపరేషన్స వారు ములాఖత అయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

ఏళ్ల తరబడి జరుగుతున్నా తెలియదా?

ఏళ్లుగా ఈ మీటర్ల మార్పిడి చేసి అందినకాడికి దండుకుంటున్నారన్న విషయం ఆ ప్రాంతంలోని ఉన్నతాధికారులకు తెలియకుండా ఎలా ఉంటుందన్న ప్రశ్న తలెత్తుతుండగా... పాండురంగాపురంలో దొరికిన ఓ మీటరు అడ్రస్‌ జయనగర్‌ కాలనీలో ఉండటం.. తీరా అక్కడకు వెళ్లి పరిశీలిస్తే అక్కడ కొత్త మీటరు ఉండటం అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. వాస్తవానికి ఎక్కడైనా ఒక మీటరు ఇవ్వాలి అంటే సంబంధిత ప్రాంతానికి చెందిన ఏఈ మీటర్‌ రిజిస్టర్‌లో ఎంట్రీ చేసుకున్న తర్వాత లైన ఇనస్పెక్టర్‌కు ఇచ్చి పంపిస్తారు. కాగా అక్కడకు కొత్త మీటరు సంబంధిత ప్రాంతానికి చెందిన ఏఈ తెలియకుండా ఎలా జరుగుతోందన్న వాదన వినిపిస్తోంది. ఆ విషయం పక్కన పెడితే.. ఏళ్ల తరబడి సాగుతున్న తంతులో 2015 నుంచి ఆ ప్రాంతంలో పలువురు ఏఈలు, లైన ఇనస్పెక్టర్లు, లైనమెనలు చాలామంది మారారు. వారందరికీ తెలిసే ఈ అక్రమాలు జరిగాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో జరగాల్సిన పనులను పర్యవేక్షించాల్సిన బాధ్యత ఏఈలకు ఉండగా.. వారు ఎందుకు వాటిని పట్టించుకోలేదన్న ప్రశ్న తలెత్తుతోంది. దానికి కారణం ముడుపులు ముట్టడమేనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ఇటీవల వెలుగులోకి వచ్చిన పాండురంగాపురంలో ప్రాంతానికి ఏఈగా పనిచేస్తున్న అధికారి కూడా అక్కడకు వచ్చి యేడాదికి పైగా కావస్తుండగా.. ఇన్నాళ్లు దొరకని మీటరు... విజిలెన్స అధికారులు ఒక మీటరు పట్టుకున్న రెండు గంటల వ్యవధిలోనే రెండో మీటరును విద్యుత శాఖ అధికారులు ఎలా గుర్తించారన్న విషయం పై ప్రస్తుతం జోరుగా చర్చ సాగుతోంది. అంతేనా సంబంధిత ఘటనలో బాధ్యుడిగా ఉన్న స్పాట్‌ బిల్లరు ఏళ్ల తరబడి ప్రైవేటు వ్యక్తిని అసిస్టెంట్‌గా పెట్టుకోగా.. ఆ విషయం సదరు అధికారికి తెలియకుండానే ఉందా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. అంతేకాదు గతంలో ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చిన సమయంలో ట్రాన్సకో సీఎండీ నుంచి ఎవరి వద్ద మీటర్లు ఉండటానికి వీల్లేదని.. అన్నీ మీటర్లను స్వాధీనం చేసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. అయినప్పటకీ ఇలాంటి అక్రమాలు జరగుతున్నాయంటే... అధికారులు హస్తం ఉందన్న ఆరోపణలు లేకపోలేదు. 

బలవుతోంది స్పాట్‌ బిల్లర్లే.. 

విద్యుత శాఖ అధికారుల తీరు దొరికితేనే దొంగలు అన్న చందంగా ఉండగా.. ఇలాంటి అక్రమాలు వెలుగులోకి వచ్చిన ప్రతిసారి ఉన్నతాధికారులు కిందిస్థాయి సిబ్బందినే బలిచేస్తున్నారన్న విషయం స్పష్టమవుతోంది. మీటర్ల మార్పిడి విషయానికి సంబంధించిన ఏ కేసులోనూ లోతైన విచారణ జరిపినట్టుగాని, పెద్దస్థాయి అధికారులను బాధ్యులను చేసిన సంఘటనలు కానీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో లేవు. నగరంలోని ఓ ఏడీ ఇంట్లో దొరికిన మీటరు మార్పిడి మొదలు  భద్రాచలంలో, ఎర్రుపాలెం, చింతకాని, కొదుమూరు, పండితాపురం, వేంసూరు మండలంలో జరిగిన ఘటనల్లో ప్రతిచోటా స్పాట్‌ బిల్లర్లనే బలిచేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే దానికి సంబంధించిన సూత్రధారుల విషయంలో ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం వెనుక విమర్శలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ప్రతి మూడు నెలలకు ఒకసారి జరిగే బిల్లింగ్‌కు సంబంధించి శాఖలోని లైన ఇనస్పెక్టర్‌ స్థాయి వ్యక్తులు వెళ్లాల్సి ఉండగా.. వారికి మీటర్ల మార్పిడి జరిగిన విషయం తెలియకుండా ఎలా ఉంది? మీటర్లు మార్పిడి చేసిన స్థానంలో కొత్త మీటర్లు ఎక్కడ నుంచి వచ్చాయి? ఆయా మీటర్లు ఈబీఎస్‌(ఎనర్జీ బిల్లింగ్‌ సిస్టం)లో కూడా దొరకకపోవడంతో వాటికి సూత్రధారులు ఎవరు అన్న కోణంలో విచారణ జరగాల్సి ఉంది. కాగా ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఇలాంటి అక్రమాల విషయంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా విచారణ జరిగేలా చర్యలు తీసుకుని, ఆయా అక్రమాల్లో ఉన్న సంబంధిత అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 

 మీటర్ల మార్పిడిలో ముగ్గురిపై కేసు

మీటర్ల మార్పిడికి సంబంధించి ఖమ్మం నగరంలో రెండు ఘటనలు జరగ్గా.. అందులో గతంలో బార్‌ ఉండి ప్రస్తుతం బేకరీ ఉన్న బిల్లింగ్‌కు సంబంధించి మీటరు మార్పిడి చేసిన ఘటనలో  ముగ్గురిపై అధికారులు కేసులు నమోదు చేశారు. అయితే ఆ ముగ్గురిలో కేవలం ఒక్కరు మాత్రమే ఉద్యోగి కాగా..  మిగిలిన ఇద్దరిలో ఒకరు బేకరీ యజమాని.. మరొకరు బిల్లింగ్‌కు సంబంధించిన ప్రైవేటు వ్యక్తి ఉండటం గమనార్హం. కాగా మీటర్ల మార్పిడి విషయానికి సంబంధించి ఖమ్మం నగరంలోని పాండురంగాపురం, బల్లేపల్లి ప్రాంతాల్లో జరిగిన సంఘటనలు ఉదహరిస్తూ ‘మీటర్ల మాయగాళ్లు’ శీర్షికన సోమవారం ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైన విషయం విధితమే. కాగా ఆ ఘటనకు సంబంధించి మీటరు వాడకాన్ని పరిశీలిస్తే సుమారు రూ.6 లక్షల వరకు బిల్లులు చెల్లించకుండా అక్రమాలకు పాల్పడినట్టు తెలుస్తోంది. 

Updated Date - 2021-10-13T04:47:17+05:30 IST