సమావేశంలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్
- ఈ నెల 31న రెస్క్యూ ఆపరేషన్
- అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్
కరీంనగర్, జూలై 4 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్-8ను సమర్థవంతంగా నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈ నెల 31 వరకు జరగనున్న రెస్క్యూ ఆపరేషన్‌పై జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రమాదకర ప్రదేశాల్లో పని చేసే 18 సంవత్సరాల్లోపు పిల్లలను గుర్తించి రక్షించాలని, పని చేయిస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పిల్లలు ఎవరైనా ప్రమాదకర ప్రదేశాల్లో కూలీలుగా పనిచేస్తున్నట్లయితే 1098 టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్‌చేసి సమాచారం అందించాలని ఆమె సూచించారు. ఆపరేషన్ ముస్కాన్‌లో భాగంగా ఎన్నిక కేసులు వచ్చాయి, ఎన్ని గుర్తించారు, ఎంతమందిని వసతిగృహాల్లోకి పంపించారు అనే విషయాలను తమ దృష్టికి తీసుకురావాలని అధికారులను అదనపు కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జిల్లా సంక్షేమాధికారి పద్మావతి, ఏసీపీ మదన్‌లాల్, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి నతానియేలు, డిప్యూటీ లేబర్ కమిషనర్ రమేశ్‌బాబు, డీఎంహెచ్‌వో డాక్టర్ జువైరియా, డీఈవో జనార్దన్‌రావు, సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్ ధనలక్ష్మి పాల్గొన్నారు.