ఉస్మానియాలో ఆ‘పరేషాన్‌’!

ABN , First Publish Date - 2020-08-11T08:41:02+05:30 IST

ఉస్మానియా ఆస్పత్రిలో ప్రాణవాయువు అందక ఆపరేషన్లు వాయిదా పడుతున్నాయి. మూడు నెలలుగా అతి ముఖ్యమైన విభాగాల్లో శస్త్రచికిత్సలు వాయిదా వేస్తున్నారు.

ఉస్మానియాలో ఆ‘పరేషాన్‌’!

ఆక్సిజన్‌ అందక శస్త్ర చికిత్సలు వాయిదా

మరో 3 నెలలు రోగులకు ఇబ్బందులే!


మంగళ్‌హాట్‌, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): ఉస్మానియా ఆస్పత్రిలో ప్రాణవాయువు అందక ఆపరేషన్లు వాయిదా పడుతున్నాయి. మూడు నెలలుగా అతి ముఖ్యమైన విభాగాల్లో శస్త్రచికిత్సలు వాయిదా వేస్తున్నారు. వార్డుల్లో చికిత్సలు పొందుతున్న రోగులకు ఆక్సిజన్‌ సరిగా అందడం లేదు. ప్రత్యామ్నాయం చూపకుండానే ఉస్మానియా పాత భవనాన్ని ఖాళీ చేయించడంతో శస్త్రచికిత్సల కోసం రోగులు వేచిచూడాల్సిన దుస్థితి నెలకొంది. సాధారణ రోజుల్లో ఇక్కడ 110-120 వరకు సర్జరీలు జరుగుతుంటాయి. అలాంటిది ఇప్పుడు వారంలో 3-5 ఎలక్టివ్‌ శస్త్రచికిత్సలు, 20-35 అత్యవసర శస్త్రచికిత్సలు చేస్తున్నారు. ఈ స్థాయిలో సర్జరీలు పడిపోవడానికి ముఖ్య కారణం మూడు థియేటర్లు మూతపడడం, ఆక్సిజన్‌ అందక పోవడం, సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగానికి థియేటరే లేకపోవడం. ఇక కార్డియో థొరాసిక్‌ విభాగానికి థియేటర్‌ ఉన్నా టెక్నీషియన్‌ లేకపోవడంతో ఆపరేషన్లను ఆపేశారు. యూరాలజీ థియేటర్‌లో లీకేజీలు ఏర్పడడంతో శస్త్రచికిత్సలు వాయిదా పడ్డాయి. ఉస్మానియాలో మొత్తం 11 ఆపరేషన్‌ థియేటర్లు ఉన్నాయి. ఇందులో అత్యవసర ఆపరేషన్‌ థియేటర్‌తో పాటు ఎంవోటీలో ఐదు టేబుల్స్‌(ఆపరేషన్‌) అందుబాటులో ఉన్నాయి. ప్రమాదాల్లో గాయపడిన వారికి, అత్యవసర సర్జరీలు అవసరమైన వారికి 24 గంటల పాటు ఈ థియేటర్లలో రోజూ 24-25 ఆపరేషన్లు చేస్తున్నారు. కొవిడ్‌ కారణంగా ఎలక్టివ్‌ ఆపరేషన్లు చేయడం లేదు. గత నెల 15న ఉస్మానియా పాత భవనంలోకి మురుగు నీరు చేరడంతో అధికారుల ఆదేశాల మేరకు జనరల్‌ సర్జరీ, ఆర్థోపెడిక్‌ విభాగాలకు చెందిన మూడు థియేటర్లను పూర్తిగా మూసివేశారు. ఇక అత్యవసర శస్త్రచికిత్సలు చేస్తున్నప్పటికీ రోగులకు అవసరమైన ఆక్సిజన్‌ అందకపోవడం మరింత ఇబ్బందికరంగా మారింది.  


అందని ప్రాణవాయువు..

ఉస్మానియాలోని అన్ని అత్యవసర విభాగాలకు 6కేఎల్‌ ఆక్సిజన్‌ ప్లాంట్‌ ద్వారా ప్రాణావాయువును అందిస్తున్నారు. ఆస్పత్రి పాత భవనంలోని వార్డులు, మూడు థియేటర్లు, పేయింగ్‌ బ్లాక్‌లోని లివర్‌ కేర్‌ యూనిట్‌ మీదుగా క్యూక్యూడీసీ భవనంలోని వార్డులు, థియేటర్లకు ఆక్సిజన్‌ పైప్‌లైన్‌ కనెక్షన్‌ ఇచ్చారు. అక్కడి నుంచి ఓపీ బ్లాక్‌లోని ప్లాస్టిక్‌ సర్జరీ, ఎంవోటీ, ఈవోటీ, అత్యవసర విభాగంతో పాటు పలు విభాగాల్లోని వార్డులకు పైప్‌లైన్‌ ద్వారా రోగులకు ప్రాణవాయువును అందిస్తున్నారు. దశాబ్దాల నాటి పైప్‌లైన్‌ కావడంతో పాటు చుట్టూ తిరిగి వస్తుండడంతో ఇప్పటికే వార్డుల్లోని రోగులకు అవసరమైనంత ఆక్సిజన్‌ అందడం లేదు. కరోనా వార్డులో పడకల సంఖ్యను 100కు పెంచారు. ఫలితంగా అన్ని అత్యవసర విభాగాల్లో ఆక్సిజన్‌ ప్రెషర్‌ లెవెల్స్‌ మరింత తగ్గాయి. దీంతో సర్జరీలు వాయిదా వేయాల్సి వస్తోందని వైద్యులు అంటున్నారు. 


మరో 3 నెలల వరకు ఇంతే..!

మరో 3 నెలల వరకు ఇదే పరిస్థితి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మరో 2కేఎల్‌ ఆక్సిజన్‌ ప్లాంటును ఉస్మానియాలో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది. అది అందుబాటులోకి వచ్చేందుకు 3 నెలలు పడుతుంది.


అనాలోచిత నిర్ణయాల వల్లే..

ఉస్మానియా పాత భవనాన్ని వెంటనే ఖాళీ చేసి సీల్‌ వేయాలంటూ గత నెల 22న డీఎంఈ రమేశ్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కనీసం థియేటర్లు ఎక్కడ ఏర్పాటు చేయాలి? ఆక్సిజన్‌ అందించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ప్రత్యామ్నాయం చూపకుండానే పాత భవనంలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించరాదని ఆదేశించారు. దీంతో ఆస్పత్రి పాలకవర్గం థియేటర్లను తరలించేందుకు స్థలం లేక అలాగే వదిలేసి ఆస్పత్రికి సీల్‌ వేసింది. థియేటర్లు మాత్రం మొదటి, రెండో అంతస్తులో ఉన్నాయి. వీటిని వాడుకోవడం వల్ల ఎలాంటి ప్రమాదం లేదు. కానీ, డీఎంఈ ఆదేశాల కారణంగా మూడు థియేటర్లు అందుబాటులో లేకుండా పోయాయి.

Updated Date - 2020-08-11T08:41:02+05:30 IST