Abn logo
May 8 2021 @ 01:06AM

ఆపరేషన్‌ కరోనా

నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని ఓ ఆస్పత్రిలో తనిఖీచేస్తున్న టాస్క్‌ఫోర్స్‌ బృందం

పోలీ్‌సశాఖ ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్‌, హెల్ప్‌డె్‌స్కలు

ఆక్సిజన్‌, మందుల బ్లాక్‌, ఫీజుల వసూలుపై నిఘా

మిర్యాలగూడ నుంచి హైదరాబాద్‌ వరకు కొనసాగుతున్న విచారణ

నేడో, రేపో పెద్ద సంఖ్యలో అరెస్టులు


నల్లగొండ, మే 7 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కరోనా చికిత్స పేరుతో ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీ, మందులు, రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్ల బ్లాక్‌పై నల్లగొండ జిల్లా పోలీస్‌ శాఖ నిఘాపెట్టింది. అందులో భాగంగా అఽధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్న మిర్యాలగూడలోని ఓ ఆస్పత్రిపై వారం రోజుల క్రితమే టాస్క్‌ఫోర్స్‌ దాడి చేసి ల్యాబ్‌ను సీజ్‌ చేసి నిర్వాహకులపై కేసు నమోదు చేసింది. అదేవిధంగా దేవరకొండ పట్టణంలో స్థానికంగా ఆక్సిజన్‌ సరఫరా చేసే ఒకరు అధిక చార్జీలు వసూలు చేస్తుండటంతో కేసు నమోదు చేశారు. ఆరు వాయిల్స్‌ రెమ్‌ డెసివిర్‌ వాస్తవ ధర రూ.18వేలు కాగా, బ్లాక్‌లో రూ.2.50 లక్షల వరకు విక్రయిస్తున్నారు. ఈ వ్యవహారం పై ఫిర్యాదులు అందడంతో స్పెషల్‌ బ్రాంచ్‌ సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది ఈనెల 6న దాడి చేసి బ్లాక్‌ చేసిన 36 ఇంజక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు ఎక్కడి నుంచి రవాణా అవుతున్నాయి, మిర్యాలగూడ, నల్లగొండ వంటి పట్టణాల్లోని కొన్ని ఏజెన్సీలకే ఎక్కువ స్టాక్‌ అందుబాటులోకి రావడం, అందులో వైద్యశాఖ అధికారుల పాత్ర ఎంత అనే కోణంలో పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. మిర్యాలగూడలో రెమ్‌డెసివిర్‌ బ్లాక్‌లో విక్రయానికి సంబంధించి పక్కా ఆధారాలు సేకరించాకే పలువురిని అదుపులోకి తీసుకున్నారు. వారి ద్వారా హైదరాబాద్‌ కేంద్రంగా ఈ బ్లాక్‌ దందా కొనసాగిస్తున్న వారిని అదుపులోకి తీసుకునే చర్యలు వేగవంతమయ్యాయి. నేడో, రేపో ఈ కేసుకు సంబంధించి పెద్ద సంఖ్యలో అరెస్టులు చూపే అవకాశముంది. 


ప్రభుత్వం నిర్ణయించిన ధరలే వసూలు చేయాలి

కరోనా కష్టకాలంలో ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సలు, ఇతర అంశాలకు సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని ఇప్పటికే ఆస్పత్రుల నిర్వాహకులను ఎస్పీ ఏవీ.రంగనాథ్‌ హెచ్చరించారు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం సాధారణ వార్డు, ఐసోలేషన్‌, నిర్దేశించిన పరీక్షలకు రూ.4వేలు, ఐసీయూ చికిత్సతో కూడిన ఐసోలేషన్‌, ఇసీజీ, ఎక్స్‌రే, మందులు ప్యాకేజీకి రూ.7,500, వెంటిలేటర్‌తో కూడిన ఐసీయూ చికిత్స, రోగికి భోజనం, నిర్దేశించిన వైద్య పరీక్షలకు రూ.9వేలు వసూలు చేయాలి. అదే విధంగా కొవిడ్‌ నిర్దారణ కోసం చేసే ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష శాంపిల్స్‌ ఆసుపత్రి, ల్యాబ్‌లో నేరుగా స్వీకరిస్తే రూ.2,200, ఇంటి వద్దకు వెళ్లి శాంపిల్స్‌ సేకరిస్తే రూ.2,800 వసూలు చేయాలి. వీటికి విరుద్ధంగా ఎవరైనా అధిక ఫీజులు వసూలు చేస్తే వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు సంబంధిత పోలీస్‌ అధికారులకు ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటారు.


ఆస్పత్రుల్లో చార్జీల పట్టిక తప్పని సరి

ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నిర్దేశించిన ప్యాకేజీ లు, అందులో ఏ చికిత్సలు చేస్తారు, ఏ ప్యాకేజీకి ఎంత చార్జ్‌ చేస్తారనే విషయాలను ప్రజలందరికీ అర్థమయ్యే లా ప్రతి ఆస్పత్రిలో బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉం టుంది. ఈ వివరాలను ప్రదర్శించకుంటే ఆస్పత్రులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. ఆస్పత్రుల్లో చార్జీల పట్టిక, అందుబాటులో ఉన్న బెడ్ల వివరాలన్నింటిపై టాస్క్‌ఫోర్స్‌ బృందం నిరంతరం పర్యవేక్షణ ఉంటుంది. ఎక్కడైనా ఈ వివరాలను వెల్లడించని పక్షంలో డయల్‌ 100 ద్వారా సైతం సమాచారం ఇస్తే సంబంధిత ఆస్పత్రులపై పోలీసులు చర్యలు తీసుకుంటారు.


ఆక్సిజన్‌, మందుల లభ్యతపై ప్రత్యేక నిఘా

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉన్న కొవిడ్‌ రోగులు, వారి వివరాల ప్రకారం అవసరమైన మందులు, రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లు, ఆక్సిజన్‌ లభ్యత గురించి నిరంతరం నిఘా ఏర్పాటు చేసి రోగులు ఇబ్బందిపడకుండా ప్రతీ మండలంలో పోలీస్‌ సిబ్బందిని అలర్ట్‌ చేశారు. ఆక్సిజన్‌ అత్యధిక ధరలకు విక్రయిస్తున్న విషయంలో దేవరకొండ పట్టణానికి చెందిన వ్యాపారిపై కేసు నమోదు చేశారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులు బహిరంగంగా తిరగకుండా చర్యలు తీసుకోవడం, తిరుగుతున్నారని తెలిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా మండలస్థాయి వరకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని ఆక్సిజన్‌ తయారీ కేంద్రాలు, స్టాక్‌ వివరాలను తెప్పించారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆక్సిజన్‌ పారిశ్రామిక అవసరాలకు వినియోగించకుండా కేవలం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులకే వినియోగించాలని ఆదేశాలు జారీ చేశారు. వైన్స్‌, మందు సిట్టింగ్‌ల్లో పరిమితికి మించి ఉంటే మద్యంప్రియులు, దుకాణదారులపై చర్యలు తీసుకుంటామని నిర్వాహకులకు ఎస్పీ సమాచారం ఇచ్చారు. మాస్క్‌లు పెట్టుకోకుండా, భౌతికదూరం పాటించకుండా సంచరించే వారిపై భారీగా కేసులు నమోదు చేయాలని కింది స్థాయి సిబ్బందిని సైతం ఆదేశించారు. 


నల్లగొండ ఆస్పత్రిలో కొవిడ్‌ సహాయ కేంద్రం

ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా నల్లగొండలోని జిల్లా కేంద్ర ఆస్పత్రి వద్ద కొవిడ్‌ సహాయ కేంద్రాన్ని ఏర్పా టు చేస్తున్నారు. దీని ద్వారా ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగుల ఆరోగ్య పరిస్థితి, వారికి మెరుగైన చికిత్స అందించాల్సి వచ్చిన పక్షంలో వారిని ఇతర ఆస్పత్రులకు తరలించే విధంగా ఎస్‌ఐ స్థాయి అధికారి నేతృత్వంలో 24గంటలు పనిచేసేలా ఏర్పాట్లు చేశారు. రోగులకు ఇబ్బంది, సమాచారం కోసం ఎస్‌ఐ సెల్‌ నంబర్‌ 9440795657, సీఐ 9440795656, డీఎస్పీ 9440795655, ఎస్పీ సెల్‌ నంబర్‌ 94407956000లో సంప్రదించవచ్చని నల్లగొండ టూ టౌన్‌ పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు.

Advertisement