చలో బెజవాడ పుణ్యమే!

ABN , First Publish Date - 2022-02-28T09:04:44+05:30 IST

చలో బెజవాడ పుణ్యమే!

చలో బెజవాడ  పుణ్యమే!

ఆ ఆందోళనతో మాకు పునరుజ్జీవం.. జరిగిన డ్యామేజ్‌ సీఎంకు అర్థమైంది

పోగొట్టుకున్నవి సాధించుకున్నాం.. పదేళ్ల పీఆర్‌సీని ఐదేళ్లకు తగ్గించగలిగాం

మా విజయమని చెప్పుకోవడం లేదు.. ప్రభుత్వం కొత్తగా ఇచ్చిందేం లేదు

గతంలో పొందినవీ కోల్పోయాం.. హెచ్‌ఆర్‌ఏలో కోతలు ఊహించలేదు 

జీతాలు తగ్గలేదు.. పెరిగాయి.. కాకుంటే  ఒకేసారి 5 డీఏలు కలపడం వల్లే

ఉద్యోగులకు సర్కారుపై కాకుండా మాపై కోపమెందుకో?


ఉద్యమం కొత్తవాటి కోసం కాదు.. మా హక్కులను కాపాడుకోవడం కోసం. జీతాలు కూడా ఇవ్వలేని ప్రస్తుత పరిస్థితుల్లో కొత్తవి ఎక్కడ అడుగుతాం?

- ఉద్యోగ సంఘాల నేతలు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు


‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’లో ఉద్యోగ నేతలు బండి, బొప్పరాజు




పీఆర్‌సీకి సంబంధించి రాష్ట్రప్రభుత్వంతో జరిగిన చర్చల్లో తాము కొత్తగా సాధించిందేమీ లేదని ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్లు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు అంగీకరించారు. అయితే పోగొట్టుకున్నవి ఉద్యమించి సాధించుకున్నామని.. ఇది ‘చలో విజయవాడ’ కార్యక్రమం విజయవంతం పుణ్యమేనని స్పష్టం చేశారు. సీఎం జగన్‌ ప్రకటించిన 23 శాతం ఫిట్‌మెంట్‌పై సంతృప్తిగా లేకున్నా.. 2023లో ఎక్కువ సాధిస్తామని ధీమా వ్యక్తంచేశారు. కొత్త వేతన సవరణ కమిషన్‌ను ఆ ఏడాది వేస్తారని తెలిపారు. రెండు ఇంక్రిమెంట్లు కోల్పోవలసి వస్తోందనే ఉపాధ్యాయ నేతలు వ్యతిరేకించారని వెల్లడించారు. పీఆర్‌సీపై సీఎం జగన్మోహన్‌రెడ్డిని అధికారులు తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. ఆయనకు తాము క్షమాపణలు చెప్పలేదన్నారు. ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వేమూరి రాధాకృష్ణ నిర్వహించిన ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’ కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల నేతలు బండి, బొప్పరాజు పాల్గొన్నారు.


పోగొట్టుకున్నవి ఉద్యమించి సాధించుకున్నాం.. ప్రభుత్వం కొత్తగా ఇచ్చిందేం లేదు.. ఇవ్వని సర్కారుపై కాకుండా మాపై కోపమెందుకో?  సీఎంకు మేం క్షమాపణలు చెప్పలేదు..  హెచ్‌ఆర్‌ఏలో కోతలు ఊహించనేలేదు..  ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’లో బండి, బొప్పరాజు



మీ రాజధాని ఏదీ? అప్పుడు సమైక్య ఉద్యమం చేశారు కదా? ఇప్పుడు పట్టించుకోరేం?

బొప్పరాజు: మాకైతే అమరావతే. గతంలో అమరావతి అన్నారు. ఇప్పుడేమో అన్ని ప్రాంతాల అభివృద్ధి అని చెబుతున్నారు. అల్టిమేట్‌గా ప్రజలు నిర్ణయిస్తారు. 

ఆ రోజు హైదరాబాద్‌ నుంచి రమ్మంటే గొంతెమ్మ కోర్కెలు కోరారు కదా? ఇప్పుడేమో వైజాగ్‌ అందరూ తలలూపి వెళ్తామన్నారు కదా?

బొప్పరాజు: మేమెవరం చెప్పలేదు. ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నాక ఫలాన చోటుకు వెళ్లాలని వస్తే మాకు ఇవ్వాల్సినవన్నీ ఇస్తామని పెద్దలు అన్నారు. అయితే ఇదేం చెప్పకుండా మూడు రాజధానుల బిల్లు పెట్టేశారు.  

బండి: గచ్చిబౌలిలో ఉద్యోగులకు స్థలాలు ఇచ్చారు. మా దాకా వచ్చేసరికి రాలేదు. చంద్రబాబు వచ్చిన తర్వాత రాజధానిలో స్థలాలు అని జీవో ఇచ్చారు. మాకు హ్యాండిచ్చారు. ఇప్పుడేమో మూడు రాజధానులు అంటున్నారు. రాజధాని ఎక్కడైనా పెట్టుకోండి.. మాకైతే ఇల్లు ఇవ్వమని సగటు ఉద్యోగి అడుగుతున్నారు. అమరావతిలో రాజధానికి శంకుస్థాపన చేసింది ప్రధాని మోదీ. ఇప్పుడేమో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజధాని రాష్ట్రం ఇష్టమని చెబుతోంది.


బొప్పరాజు గారూ, బండి గారూ వెల్‌కమ్‌ టూ ఓపెన్‌ హార్ట్‌. ఎలా ఉన్నారు..? రిలాక్స్‌ అయ్యారా..?

బొప్పరాజు: ఉద్యోగుల్లో ఉండే సహజమైన బాధ, ఆవేదన నుంచి వచ్చిన మాటల దాడే. దానిని కూడా పాజిటివ్‌గానే తీసుకున్నాం. కలిసి పనిచేసిన నాయకులే తప్పుబట్టి వెళ్లారనే బాధ ఉంది. అందులో కూడా వారిదేం లేదు. వారి అనుబంధ పార్టీల ఒత్తిడి వల్లే ఉపాధ్యాయ నేతలు అలా మాట్లాడారు. వారితో మాకేం విభేదాలు లేవు. 

ఆర్కే: అదేంటి.. సీపీఎం ఏపీలో ప్రభుత్వంతో కొంచెం సాఫ్ట్‌గానే ఉంటుంది కదా! ఉపాధ్యాయుల్లో ప్రధాన సంఘం యూటీఎఫ్‌ వాళ్లదే కదా! వాళ్లు ఒత్తిడి తెస్తారని అనుకోనే! కింది స్థాయిలో ఒత్తిడి ఉందేమో?

బొప్పరాజు: కింది నుంచి ఒత్తిడి లేదండీ. ఒక్క ఫిట్‌మెంట్‌ తగ్గిపోవడం వల్ల ఒక్కొక్కరూ రెండు ఇంక్రిమెంట్లు కోల్పోతున్నారు. ఎందుకు నష్టపోవాలనే వ్యతిరేకించారు. 

ఈ ఒప్పందం వల్ల మీరు ఏం సాధించినట్లు? 

బొప్పరాజు: ఈ పోరాటంలో మేం చాలా సక్సెస్‌ అయ్యాం. మొదటి జీవోలో పదేళ్ల పీఆర్‌సీ అని నిర్ణయించారు. దానిని ఐదేళ్లకు తగ్గించుకోగలిగాం. 

ఐదేళ్ల పీఆర్‌సీ తిరిగి తెచ్చుకుంటే అచీవ్‌మెంటా?

బొప్పరాజు: అవునండీ. అది అచీవ్‌మెంట్‌ కాదు.

బండి: కొత్తగా ఇచ్చింది ఏమీ లేదు. మేం పోగొట్టుకున్నవి సాధించాం. అంతేగానీ కొత్తగా సాధించామనలేదు. 

చర్చల్లో మీరంతా క్షమాపణలు కూడా చెప్పారట కదా?

బండి: క్షమాపణలేం కాదు. ఉద్యమంలో కొంతమంది ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. దానికి మీరు అన్యధా భావి స్తే బాధపడవద్దని కోరాం. 

ఆర్కే: ఎన్టీఆర్‌ హయాంలో ఉద్యోగ నాయకులు ఎన్ని మాటలన్నారు? ఆ రోజు ఉద్యోగ నాయకుల కోసం సీఎం ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచి ఉండేవి కదా!

బండి: అవును సర్‌. పాలు, పెరుగు తిన్న పిల్లి మాదిరి సీఎం పారిపోతున్నాడని అప్పట్లో కాశీవిశ్వనాథ్‌ అనే ఉద్యోగ నేత వ్యాఖ్యానించారు. 

చర్చల తర్వాత ఏం వచ్చిందని జగన్‌కు థ్యాంక్స్‌ చెప్పారు?

బొప్పరాజు: పీఆర్‌సీ వేసిన తర్వాత దాని నివేదిక కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. కరోనా కారణంగా ప్రభు త్వం ఆర్థికంగా దెబ్బతిన్నదన్న మాట మనమూ చెప్పిందే. 

ఆర్థికంగా ఎవరు దెబ్బతిన్నారు? 

బొప్పరాజు: రాష్ట్రం విడిపోతే ఆర్థికంగా దెబ్బతింటామ ని అందరూ చెప్పారు. మీకు రావలసిన డీఏలు కూడా ఇ చ్చే పరిస్థితి లేదని సీఎం పిలిచి చెప్పినప్పుడు మేం సహకరించాం. అయితే పీఆర్‌సీ నివేదిక బయట పెట్టమని అడిగితే అధికారులు సెంట్రల్‌ పే కమిషన్‌కు తీసుకెళ్దామని సీఎంకు పదేపదే చెప్పి డైవర్షన్‌ చేశారు. 

మీరు ఎంతకాలం నుంచి ఉద్యమంలో ఉన్నారు?

బండి: 30 ఏళ్ల నుంచి ఉద్యోగ నేతగా ఉన్నాను. నేను ఇరిగేషన్‌లో సూపరింటెండెంట్‌. 

బొప్పరాజు: నేను ఒంగోలులో కలెక్టరు పీఏగా చేశాను. 

30 ఏళ్ల ఉద్యమ అనుభవం ఉన్న మీకు మూడేళ్లు కూడా సీఎంగా అనుభవం లేని ఆయన చుక్కలు చూపించారు కదా!

బొప్పరాజు: లేదండి. నేనొప్పుకోను.

ఎన్నికలకు ముందు ఈ ప్రభుత్వంలో ఏం తెచ్చుకోగలరు?

బండి: కమిటీ వేస్తారు. దాని నివేదిక ఎన్నికల్లోపు వస్తుంది. ఈ ప్రభుత్వం కాకున్నా ఏ ప్రభుత్వం అయినా ఇవ్వాల్సిందే కదా! సెక్రటేరియట్‌లో ఒక ఉద్యోగి వచ్చి  మాకు మీరు ఏం చేస్తున్నారు.. మీరెందుకు సార్‌ నాయకులుగా అని అడిగితే తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాలే దు. అప్పుడు ప్రభుత్వాన్ని అడిగాం. అప్పుడు మాకు ఇవ్వాల్సినవి 16 వేల కోట్లని చెప్పారు. ఇప్పుడు 21 వేలకోట్లకు చేరింది. మార్చిలో 2,100 కోట్లు ఇస్తామన్నారు. 

జీతాలు టైంకు రాని పరిస్థితుల్లో బ్యాంకులు కూడా ఉద్యోగులకు లోన్లు ఇవ్వడం లేదని చెబుతున్నారు? జీతం అయినా ఇవ్వండని పోరాటం చేశారా?

బండి: ఇప్పుడు జరిగింది ఇదే. 

బొప్పరాజు: ఫిట్‌మెంట్‌ ఎంత అనేది సీఎం ఇష్టం. ఎంత ఇస్తే అంత రిటర్న్‌ వస్తుంది. సీఎంతో సమావేశంలో కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలు, సీపీఎస్‌ వారంలో చేస్తామన్నారు. వార్డు సచివాలయ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఇలాంటి అంశాలన్నీ అడ్రస్‌ చేయమని ఆయన్ని అడిగాం. 

బండి: సీఎం కాగానే 27ు ఇచ్చారు. ఆశాలకు జీతాలు పెంచారు. గతంలో అడిగితేనే 20ు ఇచ్చారు. వైఎస్‌ 45 శాతం ఇచ్చారు. చంద్రబాబు 43ు ఇచ్చారు. ఈయన అడక్కుండానే 27ు ఇచ్చారు కదా.. ఇంకెంతో ఇస్తారని మా ఆలోచన. ఫిట్‌మెంట్‌ చాలా ముఖ్యం. ఇప్పుడు ఇచ్చినదాంతో ఉద్యోగికి నష్టమే. ఆ బాధ మాకూ ఉంది.  

సమ్మెతో లాభంలేదని వెంకట్రామిరెడ్డి అన్నారు కదా?

బొప్పరాజు: అలా అనకూడదు. చర్చలు ఫలప్రదమైన తర్వాత ఆయనామాట అన్నారు. ఆయన ఉద్దేశం వేరు.

బండి: మేం సాధించిందేమీ లేదని ఒప్పుకొంటాం. మా ముందున్న నేతలు సాధించిపెట్టిన హక్కులు, రాయితీలను పోగొట్టుకోకుండా నిలబెట్టుకోగలిగాం. అది కూడా 3వ తేదీన ఉద్యోగులు చేసిన పోరాట ఫలితమే. 

మిమ్మల్ని మంత్రులు ఏమైనా భయపెట్టారా?

బొప్పరాజు: లేదండీ. మంత్రులను ముందుగానే కూర్చోబెట్టి పద్ధతి ప్రకారం చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. అంతిమంగా ప్రభుత్వానికే నష్టం కదా! అది తెలుసుకోవాలి. తెలంగాణకు, మాకు హెచ్‌ఆర్‌ఏలో 1ు తేడా.

అయినా తెలంగాణ కంటే మీకు జీతాలు తగ్గాయి కదా?

బొప్పరాజు: తగ్గలేదు సర్‌. పెరిగాయి. ఐదు డీఏలు రావడంతో మా జీతాలు వాళ్ల కంటే ఎక్కువే అయ్యాయి. డీఏలు ఎప్పుడైనా ఇవ్వాలి కాబట్టే ఒకేసారి ఐదు డీఏలు ఇచ్చేసి వీటిని తగ్గించాలని నిర్ణయించారు. 

నల్ల బ్యాడ్జీలతో సీఎం దగ్గరకు రావద్దన్నారు కదా! 

బొప్పరాజు: తొలిరోజు ఆ మాట చెప్పారు. నిరసనగా ఎందుకు? ఎలాగూ సెటిల్‌ చేస్తాం కాబట్టి తీసేయమన్నారు. 

బండి: మేం అక్కడ కూడా రాజీ పడలేదు. మీరు సెటిల్‌ చేయండి. థాంక్స్‌ చెప్పడానికి నల్ల బ్యాడ్జీలు లేకుండా వస్తామని చెప్పాం. మేం ఇద్దరం వినలేదని మా స్టీరింగ్‌ కమిటీ లో ఉన్న అందరినీ రిక్వెస్ట్‌ చేశారు. సుప్రీంకోర్టులో కేసు వే స్తామన్నారు కదా.. కాబట్టి ఒకసారి నమ్ముదాం అని చెప్పడంతో ఆపాం. నమ్మినా మోసం చేశారు. 

ఉద్యోగ సంఘాల పాత్ర శూన్యమని తేలినట్లు ఉంది?

బొప్పరాజు: అదేం లేదు. చలో విజయవాడ తర్వాత మాకు పునరుజ్జీవం వచ్చింది. ఇక, జరిగిన డ్యామేజ్‌ సీఎం కు అర్థమైంది. తాజాగా ఇచ్చిన జీవోలు మాకు చూపించే విడుదల చేశారు. ఇకపై నెలనెలా మాట్లాడి చేస్తామన్నారు.

మున్ముందు జీతం కోసం సమ్మె చేయాల్సి వస్తుందేమో?

బొప్పరాజు: చెప్పలేం సర్‌. 

బండి: మాకు జీతాలు కొంచెం లేటయినా.. పెన్షనర్లకు మాత్రం ముందు ఇవ్వాలని మేం అడుగుతున్నాం.

మీ నాయకులపై ఏమైనా కేసులున్నాయా?  

బొప్పరాజు: ఏ కేసులూ లేవు. కావాలనుకుంటే పెట్టొచ్చు. 

మీకు వ్యాపారాలు, భూములు ఉన్నాయని ప్రచారం కదా!

బండి, బొప్పరాజు: ఎక్కడున్నాయో చెబితే చూసుకుంటాం. 

మొన్న మిమ్మల్ని ట్రోలింగ్‌ చేసినప్పుడు మీ ఇంట్లో వాళ్లు బాధపడ్డారా?

బొప్పరాజు: టీచర్లు పిండం పెట్టారు... పాడెలు మోశారు కదా.. అప్పుడు చాలా బాధపడ్డారు. 

బండి: కుటుంబసభ్యులను కించపరుస్తూ మాట్లాడారు.

ఇప్పుడు ఉద్యోగ నేతలంతా రాజకీయాల్లోకి వస్తున్నారు కదా! మీకూ ఆ ఆలోచన ఉందా?

బొప్పరాజు: నాకైతే ఆ ఆలోచన లేదు.

బండి: ఇప్పటి వరకూ లేదు. నాకు ఇంత పేరు రావడం కూడా ఇదే. భవిష్యత్‌ గురించి చెప్పలేను. 

నిజాయితీగా చెప్పండి. జగన్‌ మీతో మాట్లాడారా? మీరు చెప్పింది విన్నారా?

బొప్పరాజు: ఆయన సమక్షంలో మేం చెప్పాల్సింది చెప్పాం. ఆయన విన్నారు. మీడియాతో మాట్లాడిందే.. మాతో ఏమీ మాట్లాడలేదు.

బండి: సీఎం దగ్గరకు వెళ్లే సరికి ఒప్పందం జరిగిపోయింది. సంతకాలు జరిగిపోయాయి. 

శుభం కార్డు పడినప్పుడు మీ ముఖంలో కళ లేదే!

బండి, బొప్పరాజు: అంటే ఫిట్‌మెంట్‌ తగ్గింది కదా..! మీరు సంతృప్తికరంగా ఉన్నారని నేను అనుకోవడం లేదని సీఎం కూడా చెప్పారు. అలాగే మాతో కలిసి పని చేసిన వాళ్లే విభేదించి వెళ్లిపోతే సంతృ ప్తి ఎక్కడ ఉంటుంది?

ఉద్యోగులను ఎలా లొంగదీసుకోవచ్చో భవిష్యత్‌ ప్రభుత్వాలకు ఒక స్పష్టత వచ్చిందా?

బొప్పరాజు: అదేం లేదు. ఉద్యోగుల ఉద్యమం చూసిన తర్వాత వీళ్లతో పెట్టుకోవద్దనే వాతావరణం వచ్చింది. 

బండి: ఎన్టీఆర్‌ హయాంలో 53 రోజులు సమ్మె చేశాం. సమ్మె ఫెయిలయింది. ఆ తర్వాత అదే ప్రభుత్వం దగ్గర గతంలో పోగొట్టుకున్నవి కొత్తవి తెచ్చుకోగలిగాం. 

వచ్చే ఉద్యోగ సంఘ ఎన్నికల్లో మిమ్మల్ని ఓడిస్తే?

బండి: ఉద్యోగం చేసుకుంటాం.

చర్చల తర్వాత ఉద్యమం.. చరిత్రలోనే లేదు!

ఈ ముఖ్యమంత్రిని ఎవరైనా ప్రభావితం చేసే పరిస్థితి ఉంటుందా?

బండి: ఉండదు.

బొప్పరాజు: ఉంటుంది సర్‌. జనవరి 6న సీఎంతో సమావేశంలో ఐఆర్‌ గురించీ, అలాగే మా బాధలన్నీ చెప్పేశాం. అక్కడ చర్చలేం లేవు.. చెప్పాల్సింది చెప్పమన్నారు. చెప్పేశాం. రెండు మూడు రోజుల్లో చెబుతాన్నారు. కానీ మర్నాడే పిలిచారు. ఊహించనిది కూడా ఉంటుంది అనేసరికి అంతా బావుంటుందనుకున్నాం. అయితే లోపలకు వెళ్లిన తర్వాత సీఎంగారు రిటైర్‌మెంట్‌ 62 ఏళ్లకు పెంచుతున్నాం అనగానే మా బండి లేచి నమస్కారం పెట్టేశారు. అది మేం ఊహించనిది. 

బండి: నాకేదో 62 ఏళ్లకు రిటైర్‌మెంట్‌ వచ్చిందని కాదు. స్మార్ట్‌ సిటీస్‌ అని, మాతోపాటే ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ప్రయోజనాలు ఇస్తామని చెప్పడంతో అలా స్పందించాం. 

స్మార్ట్‌ సిటీస్‌ అంటే ఎక్కడ? 

బండి: వాటిని ఎక్కడ కడుతున్నారో మాకూ తెలియదు. స్మార్ట్‌ సిటీ్‌సలో ఉద్యోగులకు 10 శాతం ఇళ్లు కేటాయిస్తామన్నారు. అయితే సీసీఏ, హెచ్‌ఆర్‌ఏ తదితరాల గురించి అడిగితే... సీఎ్‌సతో మాట్లాడి సెటిల్‌ చేసుకోండని సీఎం అన్నారు. మర్నాడే ఇచ్చిన ఆదేశాల్లో హెచ్‌ఆర్‌ఏలో కోతలు పెట్టారు. అది మేం ఊహించనేలేదు. గత ప్రభుత్వాల హయాంలో పొందిన వాటిని కూడా కోల్పోవలసి వచ్చింది.

బొప్పరాజు: కేంద్ర ప్రభుత్వం అమలు చేసే వాటిని తెచ్చి ఇక్కడ పెడదామని అధికారులు ఫీడ్‌బ్యాక్‌ చేశారు. ఎందుకంటే ఆ అధికారుల్లో సెంట్రల్‌ పీఆర్‌సీ రాసినవాళ్లు కూడా ఉన్నారు. ఏ ప్రభుత్వం ఉన్నా కూడా సీఎం స్వయంగా ఫిట్‌మెంట్‌ ప్రకటిస్తారు. మిగిలినవి అధికారులతోనే పరిష్కారమైపోతాయి. ఇప్పుడు మాత్రం పీఆర్‌సీ నివేదిక కోసం గంటల తరబడి వేచిచూడాల్సి వచ్చింది. నివేదిక ఇవ్వనక్కర్లేదని, కేంద్రంలో మాకూ ఇవ్వడం లేదని అధికారులు సీఎంని తప్పుదోవ పట్టించారు. 

బండి: ఇలా అధికారులు తప్పుదోవ పట్టించడంతో పీఆర్‌సీ నివేదిక కోసమే ఉద్యమం చేయాల్సి వచ్చింది. ఇలా ఎప్పుడూ జరగలేదు. గతంలో ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండేది. ఇప్పుడు మాత్రం మేం వేరు, ప్రభుత్వం వేరనే భావన అధికారులు కల్పించారు. గతంలో పీఆర్‌సీ నివేదిక ఇచ్చిన అనుభవం ఉన్న ప్రస్తుత సీఎస్‌ సమీర్‌ శర్మ కూడా ఇలాగే వ్యవహరించారు. 

మీరిద్దరూ ఉద్యమం మొదలుపెట్టారు. మీతో వెంకట్రామిరెడ్డి, సూర్యనారాయణ కలిశారు. మరి వాళ్లిద్దరూ ఇప్పుడు రమ్మన్నా రాలేదు.. ఎందుకు?

బొప్పరాజు: ఏమో తెలియదు సర్‌.  

బండి: నేను అధ్యక్షుడినయ్యాక తిరుపతిలో ఒక మాటన్నా ను. పాలవాడి దగ్గర, కూరగాయల వాళ్ల దగ్గర కూడా మాటలు పడుతున్నాం.. మా జీతాలు టైంకు ఇవ్వండి.. మా ఉద్యోగులకు ఇవ్వాల్సిన మా సొమ్ము 16,000 కోట్లు ఇవ్వాలంటూ ఉద్యమం మొదలు పెట్టాం. సీఎంతో చర్చల తర్వాత కూడా మళ్లీ ఉద్యమించాం. అలాంటి చరిత్ర ఎప్పుడూ లేదు.  

ఉద్యోగులకు, నేతలకు లింకు తెగిపోయిందేమో కదా!

బొప్పరాజు: అదేం లేదు. ఉద్యమంలోకి వచ్చిన తర్వాత ఫ్యామిలీ లైఫ్‌ సహా మేం చాలా కోల్పోతాం. ఉద్యోగ నేతగా ఉన్నంత వరకూ ఉద్యోగులందరికీ న్యాయం చేయాలన్నదే మా అభిమతం. అలాగే వాళ్లు కూడా మమ్మల్ని అర్థం చేసుకోవాలి. ఈ స్థానంలో నేనే కాదు.. ఎవరున్నా బ్యాలెన్స్‌గానే వ్యవహరించాలి. అలాగే వ్యవహరించాం. ఉద్యమం సందర్భంగా కొత్తవాటి కోసం కాదు.. మా హక్కులు కాపాడుకోవడం కోసం పోరాడాం. జీతాలు కూడా ఇవ్వలేని ప్రస్తుత పరిస్థితుల్లో కొత్తవి ఎక్కడ అడుగుతాం? ఈ నేపథ్యంలో చేసిన పోరాటంలో మాకు తోడుగా వెంకట్రామిరెడ్డి, సూర్యనారాయణ వచ్చి నిలబడ్డారు. నలుగురం కలవడంతోనే ఉద్యోగుల్లో కూడా నమ్మకం ఏర్పడింది. 

బండి: సమ్మెకు వెళ్లే సమయంలో మాకు వచ్చే లాభాలు, కలిగే నష్టాలు ఏమిటో కూడా బేరీజు వేసుకోవాలి. తొమ్మిది రాయుతీలు పొంది, ఒకదాని మీద సమ్మెకు వెళ్లడం కరెక్టు కాదన్నది స్టీరింగ్‌ కమిటీలో అందరి ఏకాభిప్రాయం. ఈ ప్రభుత్వ హయాంలోనే అంటే 2023కి పోగొట్టుకున్న ఫిట్‌మెంట్‌ను తెచ్చుకుందామని అనుకున్నాం. 


వారి మాయలో పడ్డారా?

ఒప్పందం తర్వాత సీఎంకు ధన్యవాదాలు చెప్పి, సజ్జలకు క్షమాపణలు చెప్పి స్వేచ్ఛగా తిరగ్గలుగుతున్నారా? ప్రభుత్వం రక్షణ కల్పించింది కదా!

బండి: ఫిట్‌మెంట్‌ రాలేదన్న బాధే కానీ.. మాపైన ఎవరికీ కోపం లేదు. ఇక భద్రత అంటారా.. ప్రభుత్వం ఎందుకు ఇచ్చిందో మాకు తెలియదు. మాకు రక్షణ అక్కర్లేదు. ఎక్కడికైనా స్వేచ్ఛగా తిరుగుతున్నాం. 

బొప్పరాజు: స్టీరింగ్‌ కమిటీలో చర్చించుకుని, ఏ అంశాలపై ఒత్తిడి చేయాలి, దేనిపై తగ్గాలి అన్నది రాసుకుని ముందుకెళ్లాం. అయినా ఉపాధ్యాయ నేత లు అలా మాట్లాడడం బాధ కలిగించింది. చర్చల ముగిసిన తర్వాత ఈ ఒప్పందానికి వారే ఒప్పుకొన్నారని, తాము ఒప్పుకోలేదని వారు మాపై చెప్పడం ఆవేదన కలిగిస్తోంది.

ఈ ఉద్యమంలో మీ ఇద్దరినీ ప్రభుత్వ అనుకూలురైన వెంకట్రామిరెడ్డి, సూర్యనారాయణ మాయ చేశారని చెబుతున్నారు?

బండి: సీఎంగా అంజయ్య ఉన్నప్పటి నుంచీ నేను ఉద్యోగం చేస్తున్నా. అప్పటి నుంచీ సమ్మెలు జరిగా యి. అప్పట్లో ఒంగోలుకు చెందిన బొర్రా పూర్ణచంద్రరావు నాయకత్వంలో ఏపీఎన్జీవో సంఘం ప్రతిపక్షం గా పని చేసింది. ఆ రోజుల్లో ఆయన బాగా సంపాదించారని, ప్రభుత్వానికి అనుకూలంగా పని చేశారని ప్రచారం జరిగింది. కానీ చివరకు చనిపోయే సమయానికి ఏమీ లేకపోవడంతో వృద్ధాశ్రమంలో అంత్యక్రియలు చేశారు. కాబట్టి అదేం ఉండదు.

బొప్పరాజు: ఉద్యమం అనివార్యమైన పరిస్థితు ల్లో, మాతో మాట్లాడేవారు ఎవరూ లేరనే సమయం లో సజ్జల రామకృష్ణారెడ్డి ఒక్కరే మాకున్న హోప్‌. ఉద్యోగుల్లో కూడా ఆవేశం, ఆవేదన వస్తోందని తెలిసిన తర్వాత.. మాలో భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ మీరు భావిస్తున్నట్లు ప్రభుత్వంతో అనుకూలంగా ఉం డే ఆ ఇద్దరూ కూడా మాతో కలిశారు. వాళ్లు కూడా ఉద్యోగుల సెగ తగిలే బయటకు వచ్చారు. మేం ఉద్యమం చేస్తున్నప్పుడు మేం ఇద్దరం ఒంగోలు వాళ్లమని వెంకట్రామిరెడ్డి ఒంగోలు వెళ్లి ర్యాలీ చేశాడు. ఆ తర్వాత ఆయనకు సెగ తగిలేసరికి ఆయనా ముందు కు వచ్చారు. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్లి ఉద్య మం చేస్తామని ఎవరైనా అనుకున్నారా? కానీ ఉద్యోగుల శక్తిని తీసుకుని చర్చలకు వెళ్లి నిలబెట్టుకున్నాం. 

మీ పోరాటానికి సమాజం నుంచి కూడా మద్దతు వచ్చింది. దాన్ని ఎన్‌క్యాష్‌ చేసుకోవడంలో విఫలమవలేదా?

బండి: పాలిచ్చే ఆవును వచ్చినంత వరకే పీక్కోగలం. తర్వాత ఇంకా లాగితే వచ్చేదేముంది? ఫలితా లు ఎంతవరకూ రాబట్టగలమో అంతవరకూ రాబ ట్టాం. నేను ఓపెన్‌ హార్ట్‌తో చెబుతా. ప్రభుత్వాల పరిస్థితి ఎలా ఉందంటే నెలకు 5 వేల కోట్లు జీతాల ఖర్చు ఉంది. 3 నెలలు సమ్మె చేస్తే 15 వేల కోట్లు మిగులుతాయన్న వాతావరణం ఉంది. 

బొప్పరాజు: ఇంకా సాగదీస్తే మద్దతు పలికిన సాధారణ సమాజం నుంచి ఏహ్య భావం వస్తుంది. 

చంద్రబాబు 43 శాతం ఇచ్చినా థాంక్స్‌ చెప్పాల్సింది కేసీఆర్‌కి అని మీ నలుగురిలో ఒకరైన సూర్యనారాయణ అన్నారు కదా!

బండి: కేసీఆర్‌ ముందు ఇచ్చారు కాబట్టి ఆరోజు ఆ పరిస్థితి ఉంది. ఇప్పుడు తెలంగాణలో 30ు ఇచ్చారు. ఇక్కడ 23 శాతమే ఇచ్చారు. 

బొప్పరాజు: ఐదు డీఏలు ఒకేసారి ఇస్తారని మేం ఊహించలేదు. హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ, క్వాంటమ్‌ పెన్షన్‌ తగ్గడంతో జీతం తగ్గిపోతుంది. ఆ తగ్గుదల కనబడకుండా మేకప్‌ చేసినట్లు 5 డీఏలు ఒకేసారి ఇచ్చారు. ఈ సమయంలో ఐదు డీఏలు ఒకేసారి ఇచ్చేసి అ క్కడ మిగిల్చుకుందామని సీఎంకు అధికారులు చెప్పా రు. అలా బ్యాలెన్స్‌ చేశారు. మేమేదైనా సాధించామని చెప్పినా అది చలో విజయవాడ ఉద్యమం ఫలితమే.

Updated Date - 2022-02-28T09:04:44+05:30 IST