ఓపెన్‌ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

ABN , First Publish Date - 2022-05-28T05:38:50+05:30 IST

ఓపెన్‌ స్కూల్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి అధికారులను ఆదేశించారు.

ఓపెన్‌ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి

సంగారెడ్డి అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి

 సంగారెడ్డి రూరల్‌, మే. 27: ఓపెన్‌ స్కూల్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 31వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఓపెన్‌ స్కూల్‌ పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షల నిర్వహణలో ఎలాంటి సమస్యలు ఎదురవకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో పదో తరగతి పరీక్షలకు 11కేంద్రాలు, ఇంటర్మీడియట్‌కు 11 కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ పరీక్షలు ఉదయం 8.30 నుంచి 11.30గంటల వరకు నిర్వహిస్తామని వీరారెడ్డి పేర్కొన్నారు. పదో తరగతి పరీక్షలకు 2,142 మంది అఽభ్యర్థులు, ఇంటర్మీడియేట్‌కు 2,744 మంది మొత్తం 4,886 మంది హాజరు కానున్నారని వెల్లడించారు. పరీక్ష పేపర్లను భద్రపరిచేందుకు ఆరు స్టోరేజి పాయింట్లను ఏర్పాటు చేశామని, పరీక్షా కేంద్రాలను పర్యవేక్షించేందుకు ఫ్లయింగ్‌ స్వ్కాడ్‌ బృందాలను ఏర్పాటు చేశామని చెప్పారు. 


 కేంద్రాల్లోకి ఎలక్ర్టానిక్‌ పరికరాలు నిషేధం

ఓపెన్‌ పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్‌ ఫోన్లు, ఎలక్ర్టానిక్‌ పరికరాలకు అనుమతి లేదని, ఇన్విజిలేటర్‌లకు కూడా సెల్‌ఫోన్లకు అనుమతి లేదని అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి స్పష్టం చేశారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలు జరగకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మంచి నీరు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులకు సూచించారు. విద్యుత్‌ అంతరాయం కలగకుండా చూడాలని విద్యుత్‌ శాఖాధికారులకు, సమయానుకూలంగా బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల సమీపంలో 144 సెక్షన్‌ అమలు ఉంటుందని, జిరాక్స్‌ కేంద్రాలను మూసి వేయించాలని అధికారులకు సూచించారు. ఆయా శాఖల అధికారులు సమన్వయ సహకారాలతో ఓపెన్‌ స్కూల్‌ పరీక్షలు సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి అధికారులను కోరారు.  సమావేశంలో డీఈవో రాజేష్‌, ఓపెన్‌ స్కూల్‌ జిల్లా కోఆర్డినేటర్‌ వెంకటస్వామి, లింబాజీ, విశ్వనాథన్‌ గుప్తా, డీఆర్‌డీసీ అధికారులు శ్రవణ్‌కుమార్‌, లక్ష్మారెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.  పకడ్బందీగా నిర్వహించాలి 

Updated Date - 2022-05-28T05:38:50+05:30 IST