Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Mon, 27 Jun 2022 00:38:22 IST

ఎంపీ అనుకుంటే... రోడ్డు మీదకి తీసుకొచ్చారు

twitter-iconwatsapp-iconfb-icon
ఎంపీ అనుకుంటే... రోడ్డు మీదకి తీసుకొచ్చారు

అమరావతి రైతులకు కూడా మీ ద్వారా క్షమాపణలు. నన్ను క్షమించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటిదాకా నేను మాట్లాడింది రైతులు వినే ఉంటారు. కొవ్వుతో మీ గురించి మాట్లాడాను. నన్ను క్షమించండి.


ఏ రోజూ నేను కులం గురించి మాట్లాడలేదు. ఇండస్ట్రీలో కూడా ఎవరూ క్యాస్ట్‌ ఫీలింగ్‌తో మాట్లాడలేదు. కానీ, కాపులంటే వివక్ష ఉందనీ, దానికి నేను బలైపోయాననీ అనుకుంటున్నాను. మా ఇంటి పేరు బలిరెడ్డి. నా పేరు చివర అది వేసుకొని ... ‘పృథ్వీరాజ్‌ బలిరెడ్డి’ అని పెట్టుకుంటే నేనెక్కడికీ కదిలేవాణ్ణి కాదేమో. 


ప్రజలు తీర్పు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మేం చూపిస్తాం తీర్పనేది ఏంటో. చంద్రబాబుగారు అసెంబ్లీలో కన్నీళ్ళు పెట్టినప్పుడు... గ్రామాల్లోని మండువా లోగిళ్ళలో టీవీల ముందు కూర్చున్న మహిళలు... ‘అదేంటి చంద్రబాబునాయుణ్ణి ఏడిపించారు?’ అనుకున్నారు. ఆ వయసులో ఆయన వెక్కివెక్కి ఏడవడంతో జనాల్లోకి బాగా వెళ్ళిపోయింది. ‘ఒక్క ఛాన్స్‌’ అని అడిగిన ప్రతిపక్ష నేతను ఇప్పుడు కూర్చోబెట్టారు. ఎవరికైనా ఒక్క అవకాశం ఇస్తారు. 


‘థర్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ’గా ప్రేక్షకులకు ఆయన సుపరిచితుడు. రాజకీయాల్లోనూ ఆయన వ్యాఖ్యలు సంచలనమే. ఉవ్వెత్తున పైకెగసి... అవమానకరంగా కిందపడి... మొత్తానికి ‘తత్త్వాన్ని’ తెలుసుకున్నానంటున్నారు ప్రముఖ నటుడు పృథ్వీరాజ్‌. ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’లో ఆయన పంచుకున్న విశేషాలివి.

ఆర్కే: వెల్కమ్‌ టు ఓపెన్‌ హార్ట్‌ నమస్కారం పృఽథ్వీ గారు.

పృథ్వీ: నమస్కారం గురువుగారూ.

ఆర్కే: ఎలా ఉన్నారు?

పృథ్వీ: బాగున్నా.

ఆర్కే: సో... ‘థర్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ’ అంటే తప్ప పృఽథ్వీ అంటే గుర్తుకు రారేమో?

పృథ్వీ: ఇక్కడికి రావాలని నేను రోజూ కోరుకుంటూ ఉంటానండీ... శ్రీహరిగారితో కలిసి ఒక ఫంక్షన్‌కి నేను వచ్చినప్పుడు మీరు అక్కడ గెస్ట్‌గా ఉన్నారు. ఆ రోజు శ్రీహరిని అడిగాను... ‘‘అన్నా! గురువుగారితో ఒకసారి (ఇంటర్వ్యూ)...’’ అని. ‘‘అరే... ఏమిరా? దానికి చాలా ఉంది. నువ్వు ఎదగాలి. అప్పుడు ఆయనే పిలుస్తారు’’ అన్నారు శ్రీహరి. ఇప్పుడు నిజంగా నాకు హ్యాపీగా ఉంది. 


ఆర్కే: నిజంగా థర్టీ ఇయర్స్‌ అయిందా మీరు ఇండస్ట్రీలోకి వచ్చి...

పృథ్వీ:  కరెక్ట్‌గా 28 ఇయర్స్‌ అయింది. 

ఆర్కే: మీదీ వెస్ట్‌ గోదావరే కదా...

పృథ్వీ: అవును. తాడేపల్లిగూడెం. 

ఆర్కే: అష్టకష్టాలూ పడ్డారా?

పృథ్వీ: మూమాలు కష్టాలు కాదు. కృష్ణానగర్‌ కష్టాలంటారు కదా...

ఆర్కే: మంచి నీళ్ళు తాగి కడుపు నింపుకోవడం...

పృథ్వీ: అంతే... ‘మద్రాసు ఆంధ్రా క్లబ్‌కు వెళ్ళి ట్రై చేద్దాం’ అనుకున్నాను. అక్కడ డాక్టర్‌ ఎం.ప్రభాకరరెడ్డిగారు చెట్టుకింద కూర్చొని ఉన్నారు. ‘‘ఏవయ్యా... ఏ ఊరు మనది?’’ అని అడిగారు. తాడేపల్లిగూడెం నుంచి వచ్చానన్నాను. ఆయన ఎందుకు కనెక్టయ్యారో తెలీదు... హైదరాబాద్‌లోని తన ఇంట్లో రెండేళ్ళపాటు నన్ను పెట్టుకున్నారు. అందరూ నన్ను ‘రెడ్డిగారి అబ్బాయ్‌’ అనేవాళ్ళు. నేను కొంచెం బిజీ అయ్యేసరికి ఆయన లేకపోవడం నా దురదృష్టం. 


ఆర్కే: మరి మీరు సుఖంగా ఉన్న ప్రాణాన్ని ఎందుకు కష్టాలపాలు చేసుకున్నారు? ఎక్కడ పురుగు తొలిచింది? 

పృథ్వీ: అనవసరంగానండి. పద్మాలయా స్టూడియోలో ఒక సినిమా చేస్తున్నామన్నారు. నేనేదో చిన్న క్యారెక్టర్‌ అనుకున్నాను. వెళ్లాక ‘నువ్వు రామారావుగారి వేషం వెయ్యాల’న్నారు. పక్కన ఉన్నవాళ్ళు ‘‘నువ్వు వెయ్యకపోయినా వేరేవాళ్ళు వేస్తారు. వాళ్ళకి పేరొస్తుంది. నువ్వు చెయ్యాలి’’ అన్నారు. అది ‘గండిపేట రహస్యం’ సినిమా. కొంచెం ప్యాడింగ్‌ అవీ పెట్టి చేయించారు. నా లైఫ్‌కి అది అండమాన్‌ జైలు అవుతుందని నేననుకోలేదు. పద్మాలయా స్టూడియోలోంచి బయటికి రాలేం, లోపలికి వెళ్ళలేం. ‘’ఏంటండీ ఇలా చేశారు?’’అన్నాను.


ఆర్కే: ఎవరూ చెప్పలేదా?

పృథ్వీ: నాకు మొదట ఏమీ తెలీదు. ఏదో చేసేశాను. చేసిన తరువాత... పెద్దాయనను ప్రసాద్‌ ల్యాబ్‌లో కలిసి కాళ్ళకు దండం పెట్టాను. క్యారెక్టర్‌ ఇలా ఇచ్చారని చెప్పాను. ‘‘ఎప్పుడూ అలాంటివి చెయ్యకండి మీరు’’ అన్నారాయన. నాకు నిజంగా ఆయన దేవుడనిపించింది. 


ఆర్కే: బ్యాన్‌ ఎవరు చేశారు? ఇండస్ట్రీలో చేశారా?

పృథ్వీ: ఇండస్ట్రీలో చెయ్యలేదు. బయట తెలుగుదేశం మామూలుగా లేదు. ఎన్టీఆర్‌ నాకు బొట్టు పెట్టి, పది రూపాయల కాగితం మీద ‘‘గౌరవనీయులు తమ్ముడికి అభినందనలతో, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి’’ అని రాసి ఇచ్చారు. అలా ఇచ్చే సమయానికి ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు. ఆ పదిరూపాయలు ఫ్రేమ్‌ కట్టించాను. ఆయన, నేను దిగిన పెద్ద ఫొటో కూడా తాడేపల్లిగూడెంలో ఉంది. 


ఆర్కే: మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌ ఏమిటి?

పృథ్వీ: నాన్నగారు బలిరెడ్డి సుబ్బారావుగారు. రామారావుగారితోనే ‘శ్రీకృష్ణావతారం’లో కర్ణుడిగా వేశారు. కైకాల సత్యనారాయణగారు ఆయనకు ఫ్రెండ్‌. నాన్నగారు కూడా దాదాపు 17 సినిమాలు చేశారు.


ఆర్కే: వైసీపీలోకి వెళ్ళాలనే ఆలోచన మీకు వచ్చిందా? ఎవరైనా కల్పించారా?

పృథ్వీ: ప్రజారాజ్యం పార్టీ పెట్టకముందు నాగబాబుగారు బాగా తిరిగి, జనాన్ని మొబలైజ్‌ చేసి, మీటింగ్‌లు పెట్టారు. అప్పుడు నేను ఆయన వెంట ఉండేవాణ్ణి. ఇక చిరంజీవిగారు మితభాషి. ఆత్మాభిమానం ఎక్కువ. ఎవర్నీ విమర్శించొద్దనేవారు. తరువాత కాంగ్రె్‌సలోకి వెళ్ళిపోయారు. అప్పుడు ఒకాయన నన్ను కూర్చోబెట్టి, ‘‘నువ్వు అటు(వైకాపా) వెళ్తే బ్రహ్మాండంగా ఉంటుంది. అక్కడ గట్టిగా మాట్లాడేవాళ్ళు లేరు. నువ్వు అటు వెళ్లిపో’’ అని చెప్పారు. 


ఆర్కే: ఇంతకీ శిక్షణ ఎవరిచ్చారు?

పృథ్వీ:ఇండస్ట్రీకి చెందిన వ్యక్తే. 

ఎంపీ అనుకుంటే... రోడ్డు మీదకి తీసుకొచ్చారు

ఆర్కే: జగన్‌ను ఎప్పుడైనా కలిశారా? 

పృథ్వీ: ఎక్కువగానే కలిశాను. కూర్చొని మాట్లాడేవాణ్ణి. టీ, కాఫీ తాగమనేవారు. పాదయాత్రలో కూడా పాల్గొన్నాను. ఎవరెస్ట్‌ శిఖరం ఎక్కిన హిల్లరీ కన్నా గొప్పవాణ్ణనే ఫీలింగ్‌ ఉండేది నాకు. ఆ ఉగ్రవాద శిక్షణ శిబిరం ప్రభావం అది. దాంతో నా స్థాయిని మరచిపోయి, పవన్‌ కల్యాణ్‌ గారినీ, ఆయన పార్టీనీ, నాగబాబుగారిని, జన సైనికుల్నీ, టీడీపీ మీద ఏది పడితే అది మాట్లాడేను. వాళ్ళందరూ దాన్ని చాలా సహృదయతతో తీసుకొని వదిలేశారు. లేకపోతే ఈ పాటికి పృఽథ్వీరాజ్‌ వెళ్ళిపోయి మూడేళ్ళై ఉండేది. 2020లో నన్ను పలకరించిన వాళ్ళు ఎవరూ లేరు. అప్పుడు లాక్‌ డౌన్‌. సినిమాలు లేవు. ఉగ్రవాద శిబిరాల నుంచి నాకు కోట్లు వచ్చేశాయని బయట టాక్‌. సెంటర్లో ఒక ఇస్కాన్‌ టెంపుల్‌ ఉండేది. దాంట్లోకి వెళ్ళి టిఫిన్‌ తినేవాళ్ళం. భోజనం అక్కడే. మిగతావాళ్ళు ఎలా సంపాదించుకున్నారో నాకు తెలీదు. ‘లౌక్యం’ సినిమాలో నటించాను కానీ నాకు లౌక్యం లేదు. హైదరాబాద్‌లో ఒకామె... నేను ప్రయత్నాలు చేస్తున్నప్పుడు డబ్బు ఇచ్చేవారు. ఆమె ఇరవయ్యేళ్ళుగా నన్ను తన బిడ్డలతో సమానంగా ఆదరిస్తున్నారు. నేను బతికి ఉన్నానంటే కారణం ఆమే. కొవిడ్‌ సమయంలో కూడా నా దగ్గరున్నారు. అప్పుడు ఎన్నో పుకార్లు వచ్చాయి. దీనంతటికీ 2023లో సమాధానమిస్తానని చెప్పాను. త్వరలోనే ఆమె గురించి వెల్లడిస్తాను. 


ఆర్కే: సందర్భం వచ్చింది కాబట్టి... పేరు ఇప్పుడే చెప్పొచ్చుగా? 

పృథ్వీ: దాసరి పద్మరేఖ. వరంగల్‌ నుంచి చెన్నైకి మైగ్రేట్‌ అయ్యారు. నేను చెన్నైలో ఉన్నప్పటి నుంచీ తెలుసు. సినిమా రంగంలో డ్యాన్సర్‌ గా చేశారు. తరువాత హైదరాబాద్‌ వచ్చేశారు. వాళ్ళ తాతగారు నాకు బాగా తెలుసు. వాళ్ళకి ఏ సమస్య వచ్చినా నేను వెళ్ళాను. నాకు ఏ సమస్య వచ్చినా వాళ్ళు సాయం చేస్తారు. లొకేషన్‌కు భోజనం కూడా పంపిస్తారు. ప్రస్తుతం నా పక్కన ఉన్నది దాసరి పద్మరేఖగారు. నా ఆలనా పాలనా ఆవిడే చూసుకుంటారు. 


ఆర్కే: మరి మీ ఇంట్లో గొడవలు రాలేదా?

పృథ్వీ:జరిగేయి. చాలా కేసులు పెట్టారు. నేను దాదాపు ఎనిమిదేళ్ళ నుంచీ ఫ్యామిలీ లైఫ్‌కి దూరంగా ఉన్నాను. 


ఆర్కే: ఈవిడ కారణంగానేనా?

పృథ్వీ: ఈవిడ కారణం కావచ్చు లేదా ఇతరత్రా వాళ్ళని ప్రభావితం చేసినవాళ్ళు కావచ్చు. నా పిల్లల్ని బాగా చూశాను. వాళ్ళు సెటిల్‌ అయిపోయారు. నా భార్య విజయవాడలో ఉంటుంది. గొడవలు ఇప్పటికీ జరుగుతున్నాయి. కోర్టులో ఉన్నాయి. మా అబ్బాయి అర్థం చేసుకున్నాడు. నేను ఇప్పుడు సెపరేట్‌గానే ఉంటున్నాను. 


ఆర్కే: అమరావతి రైతులను పెయిడ్‌ ఆర్టిస్టులనీ, అంతకన్నా నీచంగా కూడా అన్నారు. ఎందుకనిపించింది అలా..

పృథ్వీ: శిబిరం వల్లే. ‘‘నువ్వు మాట్లాడింది కరక్టే, సూపర్‌’’ అన్నారు. 


ఆర్కే: ఎదుటి వ్యక్తిని కించపరిచే హక్కు మనకు లేదు కదా. 

పృథ్వీ: మూర్ఖుడిగా ఉండిపోయాను. లేకపోతే చంద్రబాబుగారెక్కడ? నేనెక్కడ? చిరంజీవిగారు, పవన్‌ కళ్యాణ్‌ గారు ఎక్కడ? నేనెక్కడ? 


ఆర్కే: పైగా ఇండస్ట్రీలో ఉండి చిరంజీవినీ, పవన్‌ 

కళ్యాణ్‌నీ తిట్టడం...

పృథ్వీ: సినిమా ఉన్నా లేకపోయినా... వాళ్ళను అన్న మాటలు తప్పుగా భావిస్తున్నాను. ‘‘నేను చాలా తప్పు చేశాను. అవసరమైతే మీ కాళ్ళకి దండం పెడతాను’’ అని  చిరంజీవి గారికీ, పవన్‌ కళ్యాణ్‌ గారికీ, నాగబాబు గారికీ చెప్పాను. వాళ్ళు నవ్వుతూ స్పందించారు. ‘‘మాకు శత్రుత్వం లేదు. మేము ఎప్పుడూ ఎవర్నీ అలా చూడలేదు. నీ దార్లో నువ్వు వెళిపోయావ్‌. ఏదో మాట్లాడావ్‌. అదంతా అయిపోయింది. ఇక ఆరోగ్యంగా, హ్యాపీగా ఉండు. సినిమాలు ట్రై చెయ్‌. నీకు ఏదైనా చెయ్యాలనిపిస్తే... 2024లో... ఉగ్రవాద సంస్థల వైపు వెళ్ళకుండా... ఓ మంచి బస్సెక్కి, ఆ బస్సుకి సపోర్ట్‌ చెయ్యి’’ అన్నారు. 

 ఆర్కే: సినీ రంగం నుంచి చాలామంది రాజకీయాల్లోకి వెళ్ళారు. వాళ్ళు మీకన్నా పెద్దపెద్ద వాళ్ళు. కానీ ఎవరూ నోరు పారేసుకోలేదు. నోరు పారేసుకొనేది మీ బ్యాచే... మీరు, మోహన్‌బాబు, పోసాని. మీ ముగ్గురికీ మూడు రకాల నష్టాలు జరిగాయి. మీ క్యారెక్టర్‌ను బ్యాడ్‌ చేశారు...


పృథ్వీ: తిరుపతిలో రాజకీయం ఎలా ఉంటుందంటే... మామూలుగా మాట్లాడతారు, మన బట్టలు విప్పేస్తారు. ప్రతీదీ ఛైర్మన్‌ వై.వీ.సుబ్బారెడ్డికి రిపోర్ట్‌ చెయ్యాలి. ‘నీ బాంచన్‌ దొరా కాల్మొక్తా’ అన్నట్టుండాలి. ‘ఎంఏ చదివి ఈ పరిస్థితేంటి?’ అనిపించింది. బ్రహ్మోత్సవాల సమయంలో... అంతకుముందు అక్కడ పని చేసిన రాఘవేంద్రరావుగారిలా మనం ఏదో అద్భుతంగా చెయ్యాలనే ఆలోచనతో... ఒక డైరెక్టర్‌ని పెట్టుకున్నాం. కొందరిని కలిసి, బ్రహ్మోత్సవాల్లో వాహన సేవల విశిష్టత గురించి మాట్లాడాలని చెప్పాం. ‘‘మినిమం వన్‌ లాక్‌ ఉండాలి కదా! ఊరకనే ఎలా చెబుతాం?’’ అన్నారు. దాంతో ఆ కార్యక్రమం నేనే చేశాను. చాలా తక్కువ ఖర్చుతో చేశాను. పెద్ద పెద్ద ఎల్‌ఇడిల్లో ఎక్కడ చూసినా నేనే కనిపించాను. జల్లికట్టు ఎద్దులా ముందుకు దూసుకుపోయి, జగన్మోహనరెడ్డి గారి అభిమానాన్ని సంపాదించుకోవచ్చని నేననుకున్నాను. ‘నెక్ట్స్‌ ఎంపీయే’ అన్నారందరూ. దెబ్బ తినడానికి కారణం అదే. ‘ఏది నిజం, ఏది అబద్ధం’ అనే ఆలోచన కూడా లేకుండా పోయింది. అసోం గవర్నరో ఎవరో వచ్చారు. బ్రహ్మోత్సవాలకి. ఆయనను పలకరించి మాట్లాడాను. బ్రహ్మోత్సవాలను ఆయన అభినందించారు. ఆయన వెళ్ళాక ఒక జర్నలిస్ట్‌ అన్నారు... ‘‘ఆయన మీకు చెప్పి వెళ్తున్నారు. ఓసారి వెనక్కి చూడండి’’ అని. వెనక్కి చూశాను. ఛైర్మన్‌ వస్తూ కనిపించారు. ‘ఇదేంట్రా లేనిపోనిది’ అనుకున్నా. ఎందుకంటే అక్కడ భజనగాళ్ళున్నారు... వాళ్ళందరూ చెడగొట్టేశారు. ఆఖరిరోజు అక్కడ గరుడ వాహనం. లక్షలమంది జనం ఉన్నారు. నేను మైక్‌ పట్టుకొని రాగానే.... ‘‘ఏయ్‌ థర్టీ ఇయర్స్‌’’ అని అరుస్తున్నారు. ‘‘బాబూ... ఇక్కడ ‘గోవిందా’ అని అరవండి. ‘థర్టీ ఇయర్స్‌’ అని కాదు అని చెప్పాను. కొందరు ఛైర్మన్‌ దగ్గరకి వెళ్ళి ఈ సంగతి చెప్పారు. వాళ్ళంతా అరుస్తూ ఉంటే నేనేం చేసేది? ఇక్కడ మన పనైపోయిందని అర్థమైంది. నేను వెళ్ళి విజయసాయిరెడ్డి గారికి లెటర్‌ కూడా ఇచ్చేశాను. మొత్తం జరిగిందంతా చెప్పాను. అక్కడ ఉద్యోగుల పరిస్థితి వివరించాను. ఛైర్మన్‌కు విజయసాయిరెడ్డి ఒక లెటర్‌ రాశారు. దానికి ఆయన ఫీలై, నన్ను కట్‌ చేసి పారేసి ఉండొచ్చు. నాకు మూలస్తంభాల గురించి తెలీదు. మనం అందరితో మాట్లాడాం. అవసరమైతే సిఎం గారి దగ్గిరికి కూడా వెళిపోతున్నాం. ‘నెక్స్ట్‌ ఎంపీ’ అనుకున్నాను. ‘కాబోయే సినిమాటోగ్రఫీ మంత్రి’ అనే భ్రమలు కూడా చుట్టూ ఉన్నవాళ్ళు కల్పించారు. చివరికుభార్యాపిల్లలు వదిలేస్తే రోడ్డు మీద కట్టుబట్టల్తో రోడ్డున పడేవాడి స్థితికి తీసుకొచ్చారు. 


ఆర్కే: కానీ ఆ ఆడియో వల్లే కదా మీకీ కష్టాలు వచ్చాయి? ఆ అమ్మాయితో మీరు నిజంగా మాట్లాడారా?

పృథ్వీ: అసలా అమ్మాయెవరో కూడా నాకు తెలీదు. 

ఆర్కే: తెలియకుండా ఎలా మాట్లాడారు?

పృథ్వీ: సాధారణంగా నేను మాట్లాడే మాట అరవయ్యేళ్ళుగా సినిమా ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. 

ఆర్కే: సో... జనసేనలో చేరుతారు.

పృథ్వీ: అవును. జనసేనలోకి వెళ్తాను.

ఆర్కే: మరి చెప్పారా పవన్‌ కళ్యాణ్‌ గారితో?

పృథ్వీ: చెప్పానండీ. ‘‘సినిమాలు చేసుకోండి. నేను తప్పకుండా పిలుస్తాను’’ అన్నారు. నా గురించి నేను అంచనా వేసుకున్నాక... నేను సైలెంట్‌గా ఉండి, పదిమంది పెద్దల ఆశీర్వాదం తీసుకొని, ఇండస్ట్రీలో తిరుగుతూ, ఎవరికైనా వీలైతే హెల్ప్‌ చెయ్యడం, ఎవరినీ నొప్పించకుండా ఉండడం... ‘ఇది చాలు జీవితానికి’ అనుకుంటున్నా. 

ఆర్కే:అలాగే కొనసాగాలని కోరుకుంటూ... థాంక్యూ.

పృథ్వీ: థాంక్యూ సార్‌. 


ఆర్కే: మీ అనుభవంతో చెప్పండి... ఏపీలో మూడేళ్ళ జగన్‌ పాలన ఎలా ఉంది?

పృథ్వీ: నేను ఈ మధ్యే కోనసీమకు వెళ్ళొచ్చాను. ఫ్రస్టేషన్‌ ఉంది. ‘‘తొంభై శాతం అన్నీ అద్భుతంగా చేశారంటే ప్రజల్లో వ్యతిరేకత ఎందుకుంటుంది? తొంభై శాతం లబ్ధి పొందారంంటే ప్రజల్లో వ్యతిరేకత ఎందుకుంటుంది?’’ అన్నాడు ఒకతను. చంద్రబాబుగారు ఉన్నప్పుడు... ఒక ట్రాక్టర్‌ డ్రైవర్‌కు సాయంత్రానికి రూ.2,500 వరకూ వచ్చేది. వాడు రూ.500 అట్టేపెట్టుకొనేవాడు... డ్రింక్‌ కోసం. రెండు వేలు ఇంట్లో ఇచ్చేవాడు.. ఈ మధ్య వాడ్ని అడిగితే ‘‘ఏ బ్రాండ్‌ తాగాలో నాకు అర్థం కావడం లేదు. మందు మట్టుకు నేను మానలేను సార్‌’’ అన్నాడు. ఆ 2500 మందుకే పోతున్నాయట. ఎవరూ హ్యాపీగా లేరు. నొక్కుడు మీదే ఉన్నారు వాళ్ళు. ఏసీ రూముల్లో కూర్చొని మాట్లాడొచ్చు కానీ... గ్రౌండ్‌ లెవెల్లో చూస్తే అద్భుతంగా ఏం లేదు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.