ఓపెన్‌ సెల్లార్లతో ప్రమాదాలు..

ABN , First Publish Date - 2020-10-24T12:15:57+05:30 IST

భారీ వర్షాలకు ఇళ్లలోకి వరద నీరు.. సెల్లార్లలో నీటి ఊటలు మాత్రమే ఇప్పటి వరకు చూశాం. కానీ తవ్వి.. రక్షణ చర్యలు లేకుండా, కాపలా లేకుండా, సెట్‌బ్యాక్‌లు వదలకుండా ఉన్న ఓపెన్‌ సెల్లార్లు కొందరిని వణికిస్తున్నాయి. తాము నిబంధనల ప్రకారం ఇళ్లు నిర్మించుకున్నా/కొనుగోలు చేసినా పక్క...

ఓపెన్‌ సెల్లార్లతో ప్రమాదాలు..

హైదరాబాద్‌ : భారీ వర్షాలకు ఇళ్లలోకి వరద నీరు.. సెల్లార్లలో నీటి ఊటలు మాత్రమే ఇప్పటి వరకు చూశాం. కానీ తవ్వి.. రక్షణ చర్యలు లేకుండా, కాపలా లేకుండా, సెట్‌బ్యాక్‌లు వదలకుండా ఉన్న ఓపెన్‌ సెల్లార్లు కొందరిని వణికిస్తున్నాయి. తాము నిబంధనల ప్రకారం ఇళ్లు నిర్మించుకున్నా/కొనుగోలు చేసినా పక్క ప్లాట్‌ యజమాని నిర్లక్ష్యం పొరుగు వారికి ముప్పుగా మారుతోంది. నాలుగేళ్ల క్రితం నానక్‌రాంగూడలో పక్కన తవ్విన సెల్లార్‌ వల్ల ఆరంతస్తుల భవనం కూలింది. ఈ ఘటనలో 13 మంది దుర్మరణం చెందారు. పక్కన ఉండే సెల్లార్ల వల్ల భవనాలకు ముప్పు ఉంటుందనడానికి ఇదో నిదర్శనం. 112 యేళ్ల అనంతరం రికార్డు స్థాయిలో నగరంలో వర్షపాతం నమోదైన నేపథ్యంలో చెరువు, కాలనీ ఏకమై మహానగరాన్ని అతలాకుతలం చేశాయి. పక్కన ఉన్న సెల్లార్లతో కొన్ని భవనాలు ప్రమాదపుటంచున ఉన్నాయి. ‘మా బిల్డింగ్‌ పక్కన ఓపెన్‌ సెల్లార్‌లో భారీగా నీరు నిలిచింది. ప్రహరీతో పాటు మా భవనంపైనా ప్రభావం పడేలా ఉంది’ అని కొందరు అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో ఈ సమస్యలపై ఏం చేయాలన్న దానిపై అధికారులు సమాలోచనలు చేస్తున్నారు. దసరా అనంతరం ఓపెన్‌ సెల్లార్లలో నిలిచిన నీటి తొలగింపుపై దృష్టి సారించాలని భావిస్తున్నారు.


పూడ్చివేయడంలో విఫలం...

గ్రేటర్‌లోని పలు ప్రాంతాల్లో పదుల సంఖ్యలో ఓపెన్‌ సెల్లార్లు ఉన్నాయి. గతంలోనే వీటిని గుర్తించిన జీహెచ్‌ఎంసీ పూడ్చివేయిస్తామని ప్రకటించింది. యజమానులు స్పందించకుంటే తామే నిర్మాణ రంగ వ్యర్థాలు డంప్‌ చేస్తామని పేర్కొంది. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో తవ్వి వదిలేసిన సెల్లార్లు కనిపిస్తూనే ఉన్నాయి. తాజాగా కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ఓపెన్‌ సెల్లార్ల విషయం చర్చనీయాంశమైంది. పట్టణ ప్రణాళికా విభాగం నిబంధనల ప్రకారం సెల్లార్‌ల సంఖ్యను బట్టి మీటరున్నర నుంచి మూడు, నాలుగు మీటర్ల మేర సెట్‌ బ్యాక్‌ వదలాలి. నలువైపులా నిర్ణీత స్థాయి స్థలం వదిలి సెల్లార్‌ తవ్వాలి. కానీ నగరంలో ప్రస్తుతం తవ్వి వదిలేసిన 80 శాతానికిపైగా సెల్లార్ల వద్ద చుట్టూ కనీస సెట్‌ బ్యాక్‌లు లేవు. పక్కన ఉన్న భవనాలు, ప్రహరీ గోడల వరకు సెల్లార్‌ తవ్వారు. దీంతో రోజుల తరబడి సెల్లార్లలో నీరు నిలవడం వల్ల తమ భవనాలకు ముప్పు పొంచి ఉందని పొరుగువారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమీర్‌పేట, రామంతాపూర్‌ ప్రధాన రహదారిలో భారీ బహుళ అంతస్తుల భవనాల పక్కన సెట్‌ బ్యాక్‌లు లేని సెల్లార్‌లు ఉన్నాయి. మాదాపూర్‌, కూకట్‌పల్లి, ఎల్‌బీనగర్‌, చందానగర్‌ తదితర ప్రాంతాల్లోనూ ఈ తరహా ముప్పు పొంచి ఉంది. నిబంధనల ప్రకారం 860 చదరపు మీటర్లు, అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న ప్లాట్లలో మాత్రమే సెల్లార్లకు అనుమతి ఉంటుంది. కానీ నగరంలో 400-500 చదరపు గజాల స్థలంలోనూ నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్లు తవ్వుతున్నారు. ఇవి అత్యంత ప్రమాదకరమని స్ట్రక్చరల్‌ ఇంజనీర్లు చెబుతున్నారు.


సెల్లార్‌లోకి నీరు రాకుండా తీసుకోవాల్సిన చర్యలు...

సెల్లార్‌లోకి ఏయే మార్గాల ద్వారా వర్షపు నీరు వస్తుందో గుర్తించి నివారణ చర్యలు తీసుకోవాలి.

అపార్ట్‌మెంట్‌ ముందు వర్షపు నీరు రాకుండా ఇసుకతో నింపిన బస్తాలను అడ్డుగా వేయాలి.

సెల్లార్‌ మార్గంలో వర్షం పడకుండా పై కప్పు ఉండేలా చూసుకోవాలి. 

అపార్ట్‌మెంట్‌ సమీపంలోనే ఇంకుడు గుంత ఏర్పాటు చేసి సెల్లార్‌ వైపు వచ్చే నీరంతా అటువైపుగా మళ్ళించాలి.

సెల్లార్‌లో విద్యుత్‌ మీటర్లు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

సెల్లార్‌లో ఉండే బోర్ల విద్యుత్‌ కనెక్షన్లు పంపు కింది భాగంలో ఉండకుండా నీళ్లకు తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

Updated Date - 2020-10-24T12:15:57+05:30 IST