దిగ్భంధంలోనే నగరం

ABN , First Publish Date - 2020-05-23T09:43:32+05:30 IST

కరోనా మహమ్మారి విజృంభణతో మూతపడ్డ దుకాణాలు తెరుచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌

దిగ్భంధంలోనే నగరం

ప్రకటనలకే పరిమితమైన షాపుల ఓపెన్‌

కంటైన్మెంట్‌ మిగతా ప్రాంతాలను విభజించని అధికారులు


నెల్లూరు ( జడ్పీ ), మే 22 : కరోనా మహమ్మారి విజృంభణతో మూతపడ్డ దుకాణాలు తెరుచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినా నగరంలో మాత్రం అమలు కావడం లేదు. అధికారులు విధివిధానాలు ఖరారు చేయకపోవడంతో నెల్లూరు నగరం ఇప్పటికీ పోలీసుల అష్ట దిగ్బంధనంలోనే కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు, రైలు రవాణా ప్రారంభం కావడంతో నగరంలో ఇకపై నిబంధనలు పూర్తి సడలిస్తారని ప్రజలతోపాటు అటు వ్యాపారులు భావించారు. ఆ పరిస్థితి లేకపోవడంతో వ్యాపారులు, వినియోగదారులు నిరాశకు గురవుతున్నారు. 


నెల్లూరు నగరంలో శుక్రవారం నుంచి వ్యాపార సంస్ధలు, దుకాణాలు ప్రారంభమౌవుతాయని జాయింట్‌ కలెక్టర్‌, నగరపాలక సంస్ధ కమిషనర్‌ ప్రకటించారు. అందుకు అనుగుణంగా గురువారం సాయంత్రం  ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేసింది. దీంతో కేసులు నమోదైన ప్రాంతాల నుంచి 200 మీటర్ల వరకు కంటైన్మెంట్‌ జోన్లు చేసి మిగతా ప్రాంతాల్లో వ్యాపార లావాదేవీలు కొనసాగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. దీంతో ట్రంకు రోడ్డు ప్రాంతంలో ఎలక్ర్టికల్‌ దుకాణాలు తెరచిని పలువురు వ్యాపారులను  పోలీసులు అరెస్టు చేశారు. దీంతో నగరంలో శుక్రవారం కూడా లాక్‌డౌన్‌ కొనసాగింది


ప్రజల అవస్థలు

ఎండలు ముదరడంతో ఉక్కపోతకు అల్లాడిపోతున్న జనం ఫ్యాన్లు, ఏసీలు, కూలర్ల  తీవ్ర నిరాశకు గురయ్యారు.  అలాగే భవన నిర్మాణ రంగానికి సంబంధించి ఇసుక, సిమెంట్‌ అందుబాటులో ఉంటూ ఉండగా మిగతా వస్తువులు దొరకటం లేదు.  దీంతో కార్మికులకు ఉపాధి లేక పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది


విధివిధానాలపై నిర్లక్ష్యం

కంటైన్మెంట్‌ ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి, మిగతా ప్రాంతాల్లో వ్యాపారాలు చేసుకునేందుకు వీలుగా పోలీసులు, కార్పొరేషన్‌, రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టాల్సి ఉంది. అయితే నగరంలో 19 ప్రాంతాలను కంటైన్మెంట్‌ జోన్లుగా ప్రకటించడం తప్ప, వాటిని ప్రత్యేకం చేసి, మిగతా ప్రాంతాల్లో జన జీవనం పూర్వ స్థితికి తెచ్చేందుకు చర్యలు చేపట్టలేదు. దీని పై కార్పొరేషన్‌, రెవెన్యూ, పోలీసు అధికారుల మధ్య సమన్వయం ఉండటం లేదు.. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి వ్యాపారాలు ప్రారంభమయ్యేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2020-05-23T09:43:32+05:30 IST