తెరుచుకున్న సరిహద్దులు

ABN , First Publish Date - 2020-06-05T10:23:38+05:30 IST

తెలంగాణ-ఏపీ, తెలంగాణ-కర్ణాటక సరిహద్దులలో ఉన్న జోగుళాంబ గద్వాల జిల్లాలో అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులను పోలీసులు గురువారం ఎత్తి వేశారు.

తెరుచుకున్న సరిహద్దులు

జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల్లో అంతర్రాష్ట్ర చెక్‌పోస్టుల ఎత్తివేత

ఏపీ, కర్ణాటక రాష్ర్టాల్లో కొనసాగిస్తున్న అక్కడి పోలీస్‌ శాఖ

ఎలాంటి తనిఖీలు లేకుండానే రాష్ట్రంలోకి రాకపోకలు


(గద్వాల-ఆంధ్రజ్యోతి)/నారాయణపేట క్రైం, జూన్‌ 4 : తెలంగాణ-ఏపీ, తెలంగాణ-కర్ణాటక సరిహద్దులలో ఉన్న జోగుళాంబ గద్వాల జిల్లాలో అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులను పోలీసులు గురువారం ఎత్తి వేశారు. కానీ, ఏపీ, కర్ణాటక ప్రాంతాల్లో మాత్రం చెక్‌పోస్టులను అక్కడి అధికారులు కొనసాగిస్తున్నారు. జిల్లాలో ఎన్‌హెచ్‌-44పై పుల్లూరు, గట్టు మండలం బల్గెర, కేటీదొడ్డి మండలం నందిన్నె వద్ద అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులు ఉండగా, లాక్‌డౌన్‌ సమయంలో ఈ చెక్‌పోస్టులు వద్ద పోలీసులు నిఘా ఉంచి రాకపోకలకు నియంత్రించారు. సడలింపు తర్వాత పుల్లూరు చెక్‌పోస్టు నుంచి 62 వేల మంది, బల్గెర నుంచి 4,900 మంది, నందిన్నె నుంచి 7,659 మంది రాకపోకలు సాగించినట్లు పోలీసులు అన్‌లైన్‌లో నమోదు చేశారు. ఎక్కువగా హైరదాబాద్‌, బెంగూళూరు, ఏపీ, ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు, వలస కార్మికులు పుల్లూరు చెక్‌పోస్టు మీదుగా వివిధ జిల్లాలకు తరలి వెళ్లారు. ఇందులో గద్వాలకు మాత్రం 5,800 మంది వచ్చారు. వీరిని అధికారులు హోం క్వారంటైన్‌లో ఉంచారు. అయితే వీరిలో ఎవరికి కరోనా రాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 


నిన్న మొన్నటి వరకు ఏపీ-తెలంగాణ, కర్ణాటక-తెలంగాణ రాష్ట్రాల మధ్య రెండు వైపుల అయా రాష్ట్రాల పోలీసులు చెక్‌ పోస్టులను ఏర్పాటు చేసి రాకపోకలను అడ్డుకున్నారు. ప్రస్తుతం ఏపీ, కర్ణాటక సరిహద్దుల వద్ద మాత్రమే చెక్‌పోస్టులను కొనసాగిస్తున్నారు. తెలంగాణ నుంచి వెళ్లిన వారిని తనిఖీలు చేసి, హోం క్వారంటైన్‌ ముద్రలు వేసి ఆయా రాష్ర్టాల్లోకి అనుమతినిస్తున్నారు. తెలంగాణలో చెక్‌ పోస్టులకు ఎత్తివేయడంతో అంతర్రాష్ట్రాల సంగతి ఎలా ఉన్నా, అంతర్‌ జిల్లాల్లో మాత్రం ఎలాంటి తనిఖీలు లేకుండా తిరుగడానికి అనుమతులు ఇచ్చారు.


నారాయణపేట జిల్లా పరిధిలోని సరిహద్దు రాష్ట్ర చెక్‌పోస్టులను అధికారులు ఎత్తివేశారు. కరోనా వ్యాప్తి ప్రారంభంలో జిల్లాలో వైరస్‌ నివారణకై తెలంగాణ-కర్ణాటక సరిహద్దు ప్రాంతాలైన కృష్ణ, చేగుంట, గుడెబల్లూర్‌, ఎక్లాస్‌పూర్‌, జిల్లాల్‌పూర్‌, సజనాపూర్‌, కాన్‌కూర్తి వద్ద చెక్‌పోస్టులు ఉండేవి. గతంలో సరిహద్దు చెక్‌పోస్టుల మార్గం నుంచి కర్ణాటక వెళ్లాలంటే పాసులు జారీ చేసేవారు. స్ర్కీనింగ్‌ పరీక్షలను కూడా చేసేవారు. ప్రస్తుతం జిల్లాలో ఉన్న చెక్‌పోస్టులలో కొన్నింటిని ఎత్తివేశారు. దీంతో కర్ణాటక రాష్ట్రం గుండా రాకపోకలు సాగించేందుకు వెసులుబాటు లభించింది.

Updated Date - 2020-06-05T10:23:38+05:30 IST