పేటలో ఓపెన్‌బార్లు!

ABN , First Publish Date - 2022-05-24T06:49:15+05:30 IST

పట్టణంలో మందుబాబుల ఆగడాలు నానాటికీ శ్రుతిమించుతున్నాయి. రాత్రిపూట జనసంచారం లేని ప్రదేశాలను ఓపెన్‌ బార్లుగా మార్చేస్తున్నారు.

పేటలో ఓపెన్‌బార్లు!
జూనియర్‌ కళాశాల ఆవరణలో పేరుకుపోయి ఖాళీ మద్యం సీసాలు, వాటర్‌ ప్యాకెట్లు

మందుబాబులకు అడ్డాగా మారిన ఖాళీ ప్రదేశాలు 

విద్యా సంస్థల ఆవరణలను బార్లుగా మార్చేస్తున్న ప్రబుద్ధులు

పేరుకుపోయిన ఖాళీ సీసాలు, వ్యర్థాలు


పాయకరావుపేట, మే 23: పట్టణంలో మందుబాబుల ఆగడాలు నానాటికీ శ్రుతిమించుతున్నాయి. రాత్రిపూట జనసంచారం లేని ప్రదేశాలను ఓపెన్‌ బార్లుగా మార్చేస్తున్నారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణ, ఆట స్థలం, రక్షిత మంచినీటి పథకం పంపు హౌస్‌, తదితర ప్రాంతాలు రాత్రిపూట మందుబాబులకు అడ్డాలుగా మారాయి. ఆయా ప్రదేశాల్లో ఖాళీ మద్యం సీసాలు, వాటర్‌ బాటిళ్లు, ఫుడ్‌ ప్యాకింగ్‌ వ్యర్థాలు పేరుకుపోయాయి. గతంలో ప్రైవేటు మద్యం దుకాణాలు ఉన్నప్పుడు మద్యం సేవించడానికి ‘పర్మిట్‌ రూమ్‌’లు వుండేవి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహిస్తున్నది. వీటిల్లో మద్యం కొనుగోలు చేయడమే తప్ప అక్కడ సేవించకూడదు. కొంతమంది సమీపంలోని పకోడీ, బజ్జీల బళ్ల వద్ద మద్యం సేవిస్తున్నారు. మరికొంత జనసంచారం లేని ఖాళీ ప్రదేశాలకు వెళ్లి బార్‌ తరహాలో ఎంజాయ్‌ చేస్తున్నారు. పోలీసుల నిఘా కొరవడడం, ఈ ప్రాంతాల వైపు కన్నెత్తి అయినా చూడకపోవడంతో నానాటికీ మందుబాబుల ఆగడాలు పెరిగిపోతున్నాయి.


Updated Date - 2022-05-24T06:49:15+05:30 IST