భారత్ విజ్ఞప్తిని పట్టించుకోని చమురు ఎగుమతి దేశాలు

ABN , First Publish Date - 2021-03-05T21:17:17+05:30 IST

చమురు ఉత్పత్తిపై పరిమితులను సడలించాలని భారత దేశం

భారత్ విజ్ఞప్తిని పట్టించుకోని చమురు ఎగుమతి దేశాలు

న్యూఢిల్లీ : చమురు ఉత్పత్తిపై పరిమితులను సడలించాలని భారత దేశం చేసిన విజ్ఞప్తిని ఒపెక్ (పెట్రోలియం ఎగుమతి చేసే దేశాల సంస్థ) పట్టించుకోలేదు. మరోవైపు సౌదీ అరేబియా మన దేశానికి ఓ ఉచిత సలహా ఇచ్చింది. గత ఏడాది చౌక ధరలకు కొనుగోలు చేసిన చమురును ఉపయోగించుకోవాలని చెప్పింది. దీంతో అంతర్జాతీయ చమురు ధరలు పెరిగాయి. మన దేశంలో ఇప్పటికే వినియోగదారులకు భారంగా మారిన పెట్రోలు, డీజిల్ ధరలపై ఈ పెరుగుదల ప్రభావం ఉండవచ్చు. అయితే శాసన సభ ఎన్నికల దృష్ట్యా ప్రభుత్వం ధరలను పెంచే సాహసానికి తెగించకపోవచ్చుననే వాదన కూడా ఉంది.


ఒపెక్, దాని మిత్ర దేశాలను కలిపి ఒపెక్ ప్లస్‌ అని పిలుస్తారు. వీటి సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశానికి ముందే భారత దేశ పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ దేశాలకు ఓ విజ్ఞప్తి చేశారు. పెట్రోలియం ఉత్పత్తిపై విధించుకున్న ఆంక్షలను సడలించాలని, చమురు ధరల స్థిరీకరణకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. చమురు ధరలు అంతర్జాతీయంగా పెరుగుతుండటంతో ఆర్థిక వ్యవస్థ కోలుకోవడంపై దెబ్బపడుతోందని తెలిపారు. 


ఉచిత సలహా

ఒపెక్ ప్లస్ సమావేశం అనంతరం జరిగిన విలేకర్ల సమావేశంలో సౌదీ అరేబియా ఇంధన శాఖ మంత్రి ప్రిన్స్ అబ్దులజీజ్ బిన్ సల్మాన్ మాట్లాడారు. ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ, భారత దేశం గత ఏడాది చౌకగా కొన్న క్రూడ్‌ను తీసి, వాడుకోవాలని చెప్పారు. 


1 శాతం పెరిగిన అంతర్జాతీయ క్రూడ్ ధరలు

ఏప్రిల్‌లో చమురు సరఫరాలను పెంచకూడదని ఒపెక్ ప్లస్ దేశాలు నిర్ణయించడంతో బ్రెంట్ క్రూడ్ ధర శుక్రవారం దాదాపు 1 శాతం పెరిగింది. ఒక బ్యారెల్ ధర 67.44 డాలర్లకు చేరింది. 


ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటకల్లో చమురు నిల్వ

చమురు ధరలు తగ్గినపుడు గత ఏడాది మన దేశం వ్యూహాత్మకంగా కొంత చమురును కొని, నిల్వ చేసింది. 2020 ఏప్రిల్-మే నెలల్లో 16.71 మిలియన్ బ్యారెళ్ళ క్రూడ్‌ను కొని, ఆంధ్ర ప్రదేశ్‌లోని విశాఖపట్నం, కర్ణాటకలోని మంగళూరు, పాడూర్‌లలో నిల్వ చేసింది. ధర్మేంద్ర ప్రధాన్ 2020 సెప్టెంబరు 21న రాజ్యసభలో ఓ ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానమిస్తూ, ఈ చమురు సగటు ధర ఒక బ్యారెల్‌కు 19 డాలర్లని తెలిపారు. 


వ్యూహాత్మక నిల్వలు ఉన్నప్పటికీ...

తాజాగా అంతర్జాతీయ క్రూడ్ ధరలు పెరగడంతో మన దేశ ఆయిల్ కంపెనీలు తీసుకునే నిర్ణయంపై పెట్రోలు, డీజిల్ ధరలు ఆధారపడి ఉంటాయి. అంతర్జాతీయంగా ధరలు పెరిగినందువల్ల ఆ మేరకు భారాన్ని వినియోగదారులపై మోపాలని ఆయిల్ కంపెనీలు నిర్ణయించుకుంటే ఇప్పటికే భారీగా ఉన్న పెట్రోలు, డీజిల్ ధరలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అస్సాం శాసన సభల ఎన్నికలు జరుగుతుండటంతో ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ ధరలకు కళ్లెం వేసే అవకాశం ఉందని కూడా కొందరు చెప్తున్నారు. 


Updated Date - 2021-03-05T21:17:17+05:30 IST