ఊరు మనదే తోసేయ్‌...

ABN , First Publish Date - 2022-04-22T05:13:53+05:30 IST

మండలంలోని మైసూరివారిపల్లె పంచాయతీ పరిధిలో ఉన్న సర్వే నెంబరు 2085లో 17.54 ఎకరాల ఏటి పొరంబోకు స్థలం ఉంది.

ఊరు మనదే తోసేయ్‌...
కబ్జాదారుల కన్ను పడ్డ ఏటి పొరంబోకు స్థలం

ఏటి పొరంబోకు స్థలంపై కబ్జాదారుల కన్ను

సుప్రీంకోర్టు ఆదేశాలు గాలికి


స్థలం కనిపిస్తే చాలు ఊరు మనదే తోసేయ్‌ అన్న చందంగా కబ్జాదారులు వాలిపోతున్నారు. ఏటి, వంక పొరంబోకు ఏదైనా సరే కబ్జా చేస్తున్నారు. వాటిని ఆక్రమించినా, అందులో ఎటువంటి పనులు చేపట్టినా సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఏటి పొరంబోకు స్థలంలో కట్టడాలు కడుతున్నా ఎటువంటి చర్యలు లేవు. అడ్డుకునే వారిపైనే అధికారులు చర్యలు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ఎవరైనా ఆక్రమించినా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించినా ఎవరూ పట్టించుకోకుండా వారి పని కానిచ్చేస్తున్నారు.


రైల్వేకోడూరు, ఏప్రిల్‌ 21: మండలంలోని మైసూరివారిపల్లె పంచాయతీ పరిధిలో ఉన్న సర్వే నెంబరు 2085లో 17.54 ఎకరాల ఏటి పొరంబోకు స్థలం ఉంది. దానిని ఆక్రమించుకోవాలని కొందరు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. ఈ స్థలం ప్రస్తుత ధర ప్రకారం రూ.10 కోట్లు పైమాటే. ఏడాది మునుపు కొందరు ఈ స్థలంలో ప్రార్థనలు చేశారు. అప్పుడు ఏ అధికారి చర్యలు తీసుకోలేదని మైసూరివారిపల్లె ప్రజలు అంటున్నారు. కట్టడాలు కడుతున్నా పట్టించుకోలేదు. మైసూరివారిపల్లె గ్రామస్థులు అడ్డుకుంటే వారిపైనే చర్యలు తీసుకుంటున్నారని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ రికార్డుల్లో మాత్రం ఏటి పొరంబోకు అనే ఉందని రెవెన్యూ శాఖాధికారులు చెబుతున్నారు. మైసూరివారిపల్లె ఏరియాలో 1974లో ఏపీఐసీసీకి 65 ఎకరాలు అప్పటి ప్రభుత్వం ఇచ్చింది. ఇందులో 35 ఎకరాలు మాత్రం ఏపీఐసీసీ వారు ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేశారు. మళ్లీ 17.54 ఎకరాలను తిరిగి ఇచ్చారు. ప్రస్తుతం ఈ భూమి రెవెన్యూ శాఖ పరిధిలో ఉంది. గతంలో పేదల ఇళ్ల కోసం ఓ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రయత్నిస్తే అప్పటి రెవెన్యూ శాఖాధికారులు పోలీసు బందోబస్తు పెట్టి అరెస్టులు చేయించారు. ఇటీవల ఈ స్థలంలో ఓ పార్టీకి చెందిన వ్యక్తులు అక్రమంగా కట్టడాలు చేస్తుంటే మరో పార్టీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. ఇలా చాలాసార్లు ఈ తంతు జరిగింది. ఇదిలా ఉంటే గతంలో ఏకంగా ఒక వ్యక్తి ఇదే భూమిలో సుమారు 5 ఎకరాలను ఆన్‌లైన్‌ చేయించుకున్నాడు. ఈ విషయం తెలిసిన కమ్యూనిస్టు పార్టీ నేతలు ఆందోళన చేయడంతో రెవెన్యూ శాఖాధికారులు ఆన్‌లైన్‌ రద్దు చేశారు. ఇలా రకరకాలుగా ఈ స్థలంలో వివాదాలు జరిగాయి. ఇటీవల కట్టడాలు జరుగుతుంటే మైసూరివారిపల్లె గ్రామస్థులు అడ్డుకోవడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. రాజంపేట ఆర్డీవోకు మైసూరివారిపల్లె ప్రజలు వినతిపత్రం సమర్పించారు. స్పందించిన రెవెన్యూ శాఖాధికారులు ఇరిగేషన్‌ అధికారులు, పోలీసు అధికారులకు ఏటిపొరంబోకు స్థలాన్ని రక్షించాలని లెటర్‌ ద్వారా పంపారు. పోలీసులు ఇరువర్గాలకు 145 సీఆర్‌పీసీ నోటీసులు జారీ చేశారు. ఇరు వర్గాలు ఎవరూ కూడా స్థలం జోలికి రాకుండా ఉండాలని, వస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ప్రస్తుతం ఈ స్థలం వివాదాస్పదంగానే ఉంది. ఇటు ఖద్దరు, అటు మైసూరివారిపల్లె గ్రామస్థుల మధ్య వివాదం సాగుతూనే ఉండడం కొసమెరుపు.

సమగ్రంగా రికార్డులు పరిశీలిస్తాం

మైసూరివారిపల్లె గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ఏటి పొరంబోకు భూమికి సంబంధించిన రికార్డులు సమగ్రంగా పరిశీలిస్తాము. ఏపీఐసీసీకి ఇచ్చిన 65 ఎకరాల్లో మొదటిగా 35 ఎకరాలు, తర్వాత 17.54 ఎకరాల భూమి తిరిగి ఇచ్చారు. ఆ స్థలంలోకి ఎవరు వెళ్లినా చర్యలు తీసుకుంటామని గతంలో బోర్డు కూడా ఏర్పాటు చేశారు. రికార్డుల్లో ఏటి పొరంబోకు భూమిగానే ఉంది. అయితే రికార్డులు పూర్తి స్థాయిలో పరిశీలించాల్సి ఉంది.

- బి.రామమోహన్‌, తహసీల్దార్‌, రైల్వేకోడూరు


చట్టరీత్యా చర్యలు తీసుకున్నాము

మైసూరివారిపల్లె ఏటి పొరంబోకు స్థలంలో వివాదాలు జరుగుతున్నాయని సమాచారం తెలుసుకుని అక్కడి వెళ్లాము. రెండు వర్గాల మధ్య ఉన్న సమస్యను పరిశీలించాము. రెవెన్యూ శాఖాధికారుల దగ్గర పరిష్కారం చేసుకోవాలని వివరించాము. శాంతి భద్రతలకు విఘాతం కల్గించకుండా ఉండాలని ఇరువర్గాలకు విన్నవించాము. ఎలాంటి సమస్య ఎదురు కాకుండా ఉండడానికి 145 సీఆర్‌పీసీ నోటీసులు ఇరువర్గాలకు పంపాము. ఎలాంటి పనులు చేసినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించాము.

-కె.విశ్వనాథరెడ్డి, సీఐ, రైల్వేకోడూరు


న్యాయం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించాము

న్యాయం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించాము. మైసూరివారిపల్లె పరిధిలో ఉన్న ఏటిపొరంబోకు స్థలాన్ని ఆక్రమించడానికి వచ్చిన వారిని ప్రతిసారి అడ్డుకుంటూనే ఉన్నాము. ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో చిచ్చుపెడుతున్నారు. పంచాయతీ అప్రూవల్‌ లేకుండా ఎలా చేస్తారని అడిగాము. పంచాయతీ తరపున స్థలాన్ని కాపాడుకునేందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయించాము. చివరకు మాదే గెలుపు ఉంటుందని ఆశిస్తున్నాము.

- కారుమంచి సంయుక్త, మైసూరివారిపల్లె, సర్పంచ్‌

Updated Date - 2022-04-22T05:13:53+05:30 IST