ఊ.. అంటేనే..!

ABN , First Publish Date - 2022-06-11T06:30:37+05:30 IST

అనంతపురం తహసీల్దారు కార్యాలయంలో పనిచేయాలంటే ఏ అధికారైనా బెదిరిపోవాల్సిందే.

ఊ.. అంటేనే..!

లేదంటే బదిలీ ఖాయం

తహసీల్దారు కార్యాలయంలో తలనొప్పి

ఓ అధికారి బదిలీ కోసం ప్రయత్నాలు

అధికార పార్టీవారి తీరుపై చర్చోపచర్చలు

అనంతపురం రూరల్‌ : అనంతపురం తహసీల్దారు కార్యాలయంలో పనిచేయాలంటే ఏ అధికారైనా బెదిరిపోవాల్సిందే. ఇక్కడి పరిస్థితులు అలా ఉన్నాయి. ఇక్కడ పనిచేయడం కత్తిమీద సామే అని కొందరు అధికారులు అంటున్నారు. ‘ఇద్దరు ప్రజాప్రతినిధులు మెప్పుపొందాలి. వారి అనుచర వర్గాలకు అనుకూలంగా ఉండాలి. ఎక్కడా తేడా కొట్టినా తట్టాబుట్టా సర్దుకోవాల్సిందే..’ అని చెబుతున్నారు. ఇదే పరిస్థితి కార్యాలయంలోని ఓ ఉన్నతాధికారి ఎదుర్కొంటున్నారు. ఆయన కొద్దికాలం క్రితమే బాధ్యతలు చేపట్టారు. అయినా బదిలీ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాదని భీష్మించుకున్నా.. అధికార పార్టీలోని కొందరు ఉండనివ్వరని ప్రచారం జరుగుతోంది. ఆ అధికారిని బదిలీ చేయాలని అధికార పార్టీకి చెందిన కొందరు పెద్దలు పట్టుబట్టినట్లు తెలుస్తోంది. వారు చెప్పిన పనులను చేయకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ‘నిబంధనల ప్రకారం ఆ పనులు చేయడానికి వీలుకాదు’ అని ఆయన స్పష్టంగా చెప్పకపోయినా, దాటవేత ధోరణి అవలంభిస్తున్నారని, దీంతో ఆ పనులు జరగవన్న అభిప్రాయానికి అధికార పార్టీ నాయకులు వచ్చినట్లు తెలుస్తోంది. ఆ పనులు జరగాలంటే.. ఆయన్ను కదిలించడం ఒక్కటే మార్గమని అధికారపార్టీవారు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. దీన్ని గ్రహించిన ఆ అధికారి.. వ్యక్తిగత సెలవుపై వెళ్లారు. ఈ నెల 15 వతేది వరకు సెలవు పెట్టారు. సెలవు గడువు పూర్తయ్యేలోగా బదిలీ ప్రక్రియ పూర్తి చేయించాలని ప్రయత్నాలు జోరుగా జరుగుతున్నాయి.


డబుల్‌ టార్చర్‌..

- అనంతపురం తహసీల్దార్‌ కార్యాలయం అనంతపురం, రాప్తాడు నియోజకవర్గాలకు అనుసంధానంగా ఉంటోంది. అనంత అర్బన పరిధిలోని 50 డివిజన్లు, నాలుగు పంచాయతీలు, రాప్తాడు నియోజకవర్గంలోని (అనంతపురం రూరల్‌ మండలం) 21 పంచాయతీలు దీని పరిధిలోకి వస్తాయి. ఈ కారణంగా కార్యాలయానికి ప్రజల తాకిడి ఎక్కువగా ఉంటుంది. దీనికితోడు ప్రొటోకాల్‌, సమావేశాలు నిత్యం ఉంటాయి. ఇలా విధుల ఒత్తిడిని భరిస్తూనే.. రెండు నియోజకవర్గాలోని అధికార పార్టీ నాయకులు చెప్పినదానికి తలాడిస్తూ పనిచేయాల్సి వస్తోందని కొందరు అధికారులు వాపోతున్నారు. 

- రెండు నియోజకవర్గాల పరిధిలోని కొంతమంది అధికార పార్టీ నాయకులు నిబంధనలకు విరుద్ధంగా కొన్ని పనులు చేయాలని ఆ అధికారిని కోరినట్లు సమాచారం. దీనికి ఆయన నిరాకరించారని తెలిసింది. అయినా చేయాల్సిందేనని అధికారిపై అధికార పార్టీ నాయకులు నేతలద్వారా ఒత్తిడి చేయిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికితోడు అధికార పార్టీవారి భూ కబ్జాలు, ఆక్రమణలపై పత్రికల్లో కథనాలు వచ్చిన సందర్భాల్లో.. ఆ అధికారి నిబంధనల ప్రకారం నివేదికలు తయారు చేసి ఉన్నతాధికారులకు పంపుతున్నట్లు తెలుస్తోంది. ఇది స్థానిక నాయకులకు రుచించడం లేదని సమాచారం. ఈ క్రమంలోనే ఆ అధికారిని బదిలీ చేయాలని పట్టుబట్టినట్లు సమాచారం. 


తల ఊపేవారి కోసం..

సాధారణ బదిలీలకు ప్రభుత్వం సిగ్నల్‌ ఇచ్చింది. ఈ నేపథ్యంలో మాట వినని అధికారిని బదిలీ చేయించి, చెప్పిన పనులకు అడ్డు చెప్పకుండా తల ఊపే అధికారిని తెచ్చుకునేందుకు అధికారపార్టీకి చెందిన కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. తాడిపత్రి నియోజకవర్గంలో పనిచేసే ఓ అధికారికి ఇక్కడ పోస్టింగ్‌ ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. మరో ఇద్దరు అధికారులను కూడా ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఆ ముగ్గురిలో ఒకరు ఇక్కడకు వచ్చే అవకాశం ఉందని కార్యాలయ వర్గాలు అంటున్నాయి. 

Updated Date - 2022-06-11T06:30:37+05:30 IST