అయ్యో.. దేవుడా!

ABN , First Publish Date - 2022-04-13T08:21:31+05:30 IST

భక్తులకు సులభంగా ఆ దేవదేవుడి దర్శనం చేయించాల్సిన టీటీడీ.... పట్టపగలే చుక్కలు చూపించింది.

అయ్యో.. దేవుడా!

  • వెంకన్న భక్తులకు ‘సర్వ’ కష్టాలు..
  • తిరుపతిలో కనీవినీఎరుగని దృశ్యాలు
  • టోకెన్ల కోసం వేల మంది భక్తులు..
  • శనివారం నుంచి ఎదురుచూపులు
  • మంగళవారం భారీగా జారీ కేంద్రాల వద్దకు..
  • రద్దీకి తగ్గ ఏర్పాట్లు కరువు
  • గోవిందరాజస్వామి సత్రాల కేంద్రంలో తోపులాట..
  • పిల్లలు ఉక్కిరిబిక్కిరి
  • ముగ్గురికి గాయాలు..
  • అలిపిరి కేంద్రం వద్ద ఎండలో భక్తుల విలవిల
  • కంచెదాటి బయటికి వచ్చేసిన భక్తులు..
  • రద్దీ అంచనాలో టీటీడీ విఫలం
  • టోకెన్లు లేకుండానే తిరుమలకు..
  • రెండేళ్ల తర్వాత కంపార్ట్‌మెంట్లు, షెడ్లు ఫుల్‌


(తిరుపతి, తిరుమల - ఆంధ్రజ్యోతి): భక్తులకు సులభంగా ఆ దేవదేవుడి దర్శనం చేయించాల్సిన టీటీడీ.... పట్టపగలే చుక్కలు చూపించింది. ‘సర్వదర్శనం’ టోకెన్ల జారీలో ఘోరంగా విఫలమైంది. దీని ఫలితంగా... క్యూలైన్లలో తొక్కిసలాట జరిగి భక్తులు నానా కష్టాలు పడ్డారు. మాడు పగలగొడుతున్న ఎండలో మండిపోయారు. పిల్లలు గుక్కపట్టి ఏడ్చారు. మహిళలు ఉక్కిరిబిక్కిరయ్యారు. ‘దేవుడా... కాపాడు’ అని వేడుకున్నారు. ‘బతుకు జీవుడా’ అంటూ కంచెల నుంచి దూరి క్యూలైన్ల బయటికి వచ్చి... ఊపిరి పీల్చుకున్నారు. ఆ దేవుడి దయ వల్ల... ఎవరికీ ప్రాణహాని కలుగలేదు. కానీ... ముగ్గురు గాయాలపాలయ్యారు. దశాబ్దాలుగా శ్రీవారి దర్శనానికి వస్తున్నామని... ఇంతఘోరమైన పరిస్థితులు ఎప్పుడూ చూడలేదని భక్తులు టీటీడీపై మండిపడ్డారు. వందల మంది భక్తులు కనీసం కొండపైకి కూడా వెళ్లలేక... తిరుపతిలోనే దేవుడికి దండం పెట్టుకుని స్వస్థలాలకు తిరుగు ప్రయాణమయ్యారు.


కొవిడ్‌ నేపథ్యంలో తిరుమలకు అనుమతించే భక్తుల సంఖ్యను బాగా నియంత్రించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు... మెల్లమెల్లగా పూర్వ పరిస్థితులు నెలకొంటున్నాయి. ‘సర్వ దర్శనం’పై మాత్రం నియంత్రణ కొనసాగుతూనే ఉంది. వీటి జారీపై టీటీడీ అధికారులు స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడంలేదు. ఒకరోజు ఇస్తూ... మరోరోజు నిలిపివేస్తూ భక్తులకు పరీక్ష పెడుతున్నారు. ఈ క్రమంలో   శనివారం మధ్యాహ్నం నుంచి టోకెన్ల జారీని నిలిపివేశారు. తిరిగి మంగళవారం తెల్లవారుజాము నుంచి టోకెన్లు ఇస్తామని ప్రకటించారు. దీంతో... సర్వదర్శనం కోసం తెలుగు రాష్ట్రాలతోపాటు వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తుల్లో కొందరు దర్శనం చేసుకోకుండానే వెనుతిరిగారు. పెద్దసంఖ్యలో భక్తులు తిరుపతిలోనే ఉండిపోయారు. గోవిందరాజస్వామి సత్రాల ఆవరణ, శ్రీనివాసంతోపాటు అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌ వద్ద టోకెన్ల జారీకి టీటీడీ అధికారులు  ఏర్పాట్లు చేశారు. గోవిందరాజస్వామి సత్రాల ఆవరణ సువిశాలంగా ఉన్నా... టోకెన్ల జారీ కేంద్రాన్ని మాత్రం ఇరుకైన చోట పెట్టారు. సోమవారం సాయంత్రం నుంచే భక్తులు క్యూలైన్లలోకి ప్రవేశించి అక్కడే నిద్రించారు. మిగిలిన వారు ఆవరణలోనే నిద్రించారు. 


మంగళవారం వేకువజామున 4 గంటలకు టోకెన్ల జారీ మొదలైంది. 6 గంటలయ్యే సరికి విష్ణునివాసంలో బస చేసిన భక్తులు, రైల్వే స్టేషన్‌ నుంచి వచ్చిన వారు, గత శనివారం నుంచి ఆ చుట్టుపక్కలే ఉంటూ టోకెన్ల కోసం నిరీక్షిస్తున్న వారు ఒక్కసారిగా సత్రాల ఆవరణలోకి చేరుకున్నారు. దీంతో... రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. క్యూ లైన్ల బయట భక్తులు గుంపులు గుంపులుగా గుమికూడిన వారంతా క్యూలైన్లలోకి వెళ్లడానికి ప్రయత్నించడంతో తోపులాట మొదలైంది. సమయం గడిచేకొద్దీ... రద్దీ మరింత పెరిగింది. భక్తులను ఒక క్రమపద్ధతిలో  పంపేందుకు తగిన స్థాయిలో ఏర్పాట్లు లేకపోవడంతో పరిస్థితి క్లిష్టంగా మారింది. తోపులాటలో చిక్కుకుని పలువురు భక్తులు సొమ్మసిల్లిపడిపోయారు.  వృద్ధులు, మహిళలు, పిల్లలు, చంటి పిల్లలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి... క్యూలైన్ల వెలుపల గుంపులుగా ఉన్న వారిని నియంత్రించారు. వారందరినీ ఒక పద్ధతిలో నిలబెట్టారు. గాయపడ్డ వారిని రుయా ఆస్పత్రికి తరలించారు. సొమ్మసిల్లిన వారికి పోలీసులు, స్థానికులు అక్కడే సపర్యలు చేశారు. 


భూదేవి కాంప్లెక్స్‌లోనూ...

తిరుపతిలోని భూదేవి కాంప్లెక్సులో టోకెన్ల జారీ కేంద్రం వద్ద మంగళవారం ఉదయం 9-10 గంటల నడుమ భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. మండే ఎండలో గంటలకొద్దీ నిరీక్షించలేక భక్తులు విసిగిపోయారు. ఎండవేడిని తాళలేక నీరసించి పోయారు. క్యూలైన్లకు ఇరువైపులా ఇనుప కంచెను నెట్టేసి మరీ బయటికి వచ్చేశారు. శ్రీనివాసం వద్ద కూడా భారీ రద్దీ ఉన్నప్పటికీ తోపులాటలు చోటు చేసుకోలేదు.


అనుభవం, సమర్థత ఏమైంది?

తిరుమలకు వారాంతపు సెలవుల్లో, ప్రత్యేక దినాల్లో లక్షకు మించి భక్తులు వస్తుంటారు. వైకుంఠ ఏకాదశి, బ్రహ్మోత్సవాల సమయంలో 2-3 లక్షల మంది భక్తులు వస్తారు. కొండపైన అంత రద్దీ ఉన్నప్పటికీ... సక్రమంగా నియంత్రించగలిగే అనుభవం, సామర్థ్యం టీటీడీ సొంతం. అలాంటిది... తిరుపతిలో మూడు టోకెన్ల జారీ కేంద్రాల్లో కలిపి పాతిక వేల మంది భక్తులకు తగిన ఏర్పాట్లు చేయలేకపోయింది. గత శనివారం అప్పటికప్పుడు టోకెన్ల జారీని ఆపడమే తప్పని పలువురు భావిస్తున్నారు. ‘తిరుమలలో సర్వదర్శనాలు ప్రారంభమయ్యాయి’ అని తెలుసుకుని దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అప్పటికే తిరుపతికి బయలుదేరారు. తీరా తిరుపతికి చేరుకునే సరికి టోకెన్ల జారీ ఆగిపోయింది. తిరిగి స్వస్థలాలకు వెళ్లలేని భక్తులు తిరుపతిలోనే ఆగిపోయారు. 


తాజా పరిస్థితుల నేపథ్యంలో.. టీటీడీ కొన్ని సత్వర చర్యలు తీసుకుంది. ఐదు రోజులపాటు వీఐపీ బ్రేక్‌ దర్శనాలను రద్దు చేసింది. టోకెన్లతో నిమిత్తం లేకుండా భక్తులను తిరుమలకు అనుమతించింది. గోవిందరాజస్వామి సత్రాలు, భూదేవి కాంప్లెక్సుల వద్ద భక్తుల రద్దీ విపరీతంగా వున్నందున ఆయాచోట్లకు ఆర్టీసీ బస్సులను ప్రత్యేకంగా పంపింది. మంగళవారం ఉదయం నుంచీ మధ్యాహ్నం వరకూ ఈ రెండు కేంద్రాల నుంచి సుమారు 15 వేల మంది భక్తులు బస్సుల్లో తిరుమలకు చేరుకున్నారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని అన్ని కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని నూతన షెడ్లు భక్తులతో నిండిపోయాయి. వీటితో పాటు అళ్వార్‌ ట్యాంక్‌ వరకు(కిలోమీటరు మేర) క్యూలైన్‌లో భక్తులు నిండిపోయారు. మంగళవారం రాత్రి 8గంటల సమయానికి 45 వేల మంది భక్తులు దర్శనం కోసం వేచి చూస్తున్నారు. వీరు దర్శనం కోసం 25 గంటల నుంచి 30 గంటలు వేచి చూడాలని టీటీడీ చెబుతోంది.


ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు: ధర్మారెడ్డి

శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. మంగళవారం రాత్రి ఆయన వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోపల, వెలుపలున్న భక్తుల క్యూలైన్లను అధికారులతో కలిసి తనిఖీలు చేశారు. భక్తుల రద్దీ పెరిగిన నేపథ్యంలో... టైమ్‌స్లాట్‌ సర్వదర్శనాన్ని రద్దు చేశామన్నారు. గతంలోలాగానే... ‘ఫిజికల్‌ వెయిటింగ్‌’ దర్శనాలను మొదలుపెట్టి భక్తులందరినీ క్యూలైన్‌లోకి అనుమతించామన్నారు. మరోవైపు... ఎలాంటి దర్శనం టికెట్లు లేకుండానే తిరుమల చేరుకున్న భక్తులకు బుధవారం ఉదయం నుంచి దర్శ నం కల్పిస్తామని టీటీడీ విజిలెన్స్‌ వీజీవో బాలిరెడ్డి తెలిపారు. 


అర్ధరాత్రి 2 గంటల వరకూ వెంకన్న దర్శనం

అధిక రద్దీ నేపథ్యంలో మంగళవారం అర్ధరాత్రి రెండు గంటల వరకు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులను అనుమతించారు. సాధారణంగా ప్రస్తుతం రాత్రి 12.30 గంటల వరకే భక్తులను దర్శనానికి అనుమతిస్తున్న విషయం తెలిసిందే. అయితే మంగళవారం రద్దీ పెరిగిన క్రమంలో టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. భక్తులకు వేగంగా దర్శనం కల్పించే దిశగా అధికారులు తీసుకున్న చర్యలో భాగంగా రెండు గంటల వరకు దర్శనాలను కొనసాగించి.. ఆతర్వాత ఏకాంత సేవను నిర్వహించారు. 


అంచనా వేయలేని అధికారులు

సర్వ దర్శనం టోకెన్ల జారీ కేంద్రాల వద్ద పరిస్థితిని టీటీడీ అధికారులు అంచనా వేయలేకపోయారు. శనివారం మధ్యాహ్నం నుంచి సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపివేసినప్పటికీ.. వేలకొద్దీ భక్తులు తిరుపతిలోనే ఉండిపోయారు. ఆది, సోమవారం మరికొన్ని వేల మంది వచ్చారు. మంగళవారం టోకెన్ల జారీకి తగిన ఏర్పాట్లు చేయాల్సిన టీటీడీ.. ఆ విషయంలో విఫలమైంది. పైగా... గోవిందరాజ సత్రాల వద్ద 12 కౌంటర్లు ఉండగా అందులో 6 కౌంటర్లలోనే టోకెన్లు జారీ చేశారు. దానికి తోడు అక్కడ సెక్యూరిటీ సిబ్బంది లేరు. తోపులాట జరిగాకే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఇక... భూదేవి కాంప్లెక్సులో టోకెన్ల జారీ కేంద్రాల వద్ద పందిళ్లు కూడా వేయలేదు.


భక్తుల ఘోష...

బ్లాక్‌లో అమ్ముకుంటున్నారు  

శ్రీవారి దర్శనం కోసం నాలుగురోజుల క్రితం పదిమందితో తిరుపతికి వచ్చాం. మంగళవారం ఉదయం సత్రాల కౌంటర్‌ వద్దకు వస్తే పోలీసులు గెంటేశారు. బస్టాండు ఎదురుగా ఉన్న శ్రీనివాసం వద్దకు వెళ్లాం. అక్కడ కౌంటర్‌లో పనిచేసే ఆన్‌లైన్‌ సిబ్బంది బ్లాక్‌లో డబ్బులు డిమాండ్‌ చేశారు. మా ఎదురుగానే అడ్డదారిలో ఎవరెవరో వెళ్లి టోకెన్లు తీసుకుంటున్నారు. ఇవన్నీ చూస్తుంటే కడుపు మండిపోతోంది.

- కల్యాణ్‌, నిజమాబాద్‌


వెనక్కి వెళ్లిపోతున్నాం   

బళ్లారి నుంచి ఆదివారం ఉదయం తిరుపతికి వచ్చాం. 9మంది కుటుంబ సభ్యులున్నాం. విష్ణునివాసంలో వసతి తీసుకుని టోకెన్లు కోసం వేచిచూశాం. మంగళవారం టోకెన్లు ఇస్తారని తెలుసుకుని వేకువజామున 4గంటలకు సత్రాల వద్దకు వచ్చాం. అప్పటికే క్యూనిండా జనాలు, లోపలికి వెళ్లాలంటే భయమేసింది. బయటనే ఉండిపోయాం. టోకెన్లు దొరకలేదు. చిన్నపిల్లలతో కొండకు వెళ్లలేమని అర్థమైపోయింది. దేవుడు ఎప్పుడు పిలిపించుకుంటాడో అప్పుడే వస్తాం అనుకుని వెనక్కి వెళ్లిపోతున్నాం. 

  • - గోవిందరాజులు, బళ్లారి

దేవుడి దయతో బయటపడ్డాను

రెండు రోజుల ముందు సింగారం నుంచి శ్రీవారి దర్శనం కోసం తిరుపతికి వచ్చా. క్యూలైన్లో వెళ్లి చిక్కుకుపోయా. అటు టోకెను తీసుకోలేక, ఇటు బయటపడలేక సొమ్మసిల్లి క్యూలైన్లో కుప్పకూలిపోయా. లేచిచూసేసరికి ఆస్పత్రిలో ఉన్నా. దేవుడిదయతో బతికి బయటపడ్డా. నా బ్యాగు, మాత్రలు, డబ్బులు అన్నీ పోయాయి. ఆకలి తీర్చుకునేందుకు కూడా నా దగ్గర డబ్బుల్లేవు.  

- వెంకయ్య, సింగారం గ్రామం, సూర్యాపేట, తెలంగాణ


Updated Date - 2022-04-13T08:21:31+05:30 IST