అయ్యో.. రైతన్నా..

ABN , First Publish Date - 2022-05-23T07:26:40+05:30 IST

పంటలు చేతికందక చేసిన అప్పులు తీర్చలేక రైతులు బలవన్మరణానికి పాల్పడుతు న్నారు. ఆదివారం జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.

అయ్యో.. రైతన్నా..

వేర్వేరు చోట్ల ముగ్గురి ఆత్మహత్య


పంటలు చేతికందక చేసిన అప్పులు తీర్చలేక రైతులు బలవన్మరణానికి పాల్పడుతు న్నారు. ఆదివారం జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వజ్రకరూరు మండలం కమలపాడుకు చెందిన రైతు ఉప్పర గోపాల్‌ తనకున్న రూ. 8 లక్షలు తీర్చలేక ఉరివేసుకున్నాడు. కణేకల్లు మండలం తుంబిగనూరుకు చెందిన బండేగౌడ రూ. ఏడు లక్షలు అప్పులు తీర్చలేక విషద్రావకం  తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అలాగే కూడేరు మండలం పీ నారాయణపురం  గ్రామానికి చెందిన నారాయణ రెడ్డి విషద్రావకం తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 



కమలపాడులో...

వజ్రకరూరు, మే 22: మండలంలోని కమలపాడు గ్రామానికి చెందిన రైతు ఉప్పర గోపాల్‌ (51) అప్పుల బాధ భరించలేక ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. రైతు భార్య నాగలక్ష్మి, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉప్పర గోపాల్‌ తనకున్న 6.5 ఎకరాల పొలం సాగు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. పంటల సాగుకు కొనకొండ్లలోని కెనరా బ్యాంకు శాఖ, స్వగ్రామంలోని ప్రైవేటు వ్యక్తుల వద్ద రూ.8 లక్షల వరకూ అప్పులు చేశాడు. వరుసగా నాలుగేళ్ల పాటు పంటలు చేతికి రాక అప్పులు అధికమయ్యాయి. వాటిని ఎలా తీర్చాలోనని మదనపడేవాడు. ఈ నేపథ్యంలో ఆదివారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో ఇంటి నుంచి బయటికెళ్లాడు. గ్రామ శివారులోని ఓ చింతచెట్టుకు ఉరి వేసుకుని, మరణించాడు. ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల గాలించారు. చెట్టుకు విగతజీవిగా వేలాడుతుండడాన్ని చూసి, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని కిందకు దింపి, గుంతకల్లు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.



తుంబిగనూరులో...

కణేకల్లు, మే 22: మండలంలోని తుంబిగనూరు గ్రామానికి చెందిన బండేగౌడ (41) అనే రైతు అప్పుల బాధ తాళలేక ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నట్లు  గ్రామ సర్పంచ ఫణీంద్ర తెలిపాడు. వివరాల మేరకు బండేగౌడకు తనకున్న పొలంలో వివిధ రకాల పంటలు సాగు చేస్తూ వచ్చాడు. పెట్టిన పెట్టుబడి చేతికందక రూ. 7 లక్షలు అప్పులయ్యాయి. వాటిని తీర్చే మార్గం కానరాక పొలంలో పురుగుల మందు తాగి అపస్మారకస్థితిలో పడిపోయాడు. గమనిం చిన స్థానికులు కణేకల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.  మెరుగైన వైద్యం కోసం బళ్లారి విమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. అక్క డ చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడికి భార్య దీపమ్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 



పీ నారాయణపురంలో మరో రైతు...

కూడేరు, మే22: మండలంలోని పీ నారాయణపురం గ్రామానికి చెందిన రైతు నారాయణరెడ్డి (76) అప్పుల బాధ భరించలేక శనివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రైతుకు 12 ఎకరాల భూమి ఉంది. ఇందులో 2 ఎకరాల్లో ఉల్లి, 4 ఎకరాల్లో బ్యాడిగ మిరప సాగు చేశాడు. పంటలు చేతికి రాక నష్టపోయాడు. మూడు బోర్లు వేసినా చుక్కనీరు పడకపోవడంతో తీవ్ర ఆవేదన చెందాడు. ఈ నేపథ్యంలోనే శనివారం రాత్రి గడ్డిదొడ్డిలో విషం తీసుకుని, ఆపస్మారక స్థితిలో పడిపోయాడు. స్థానికులు గుర్తించి, అనంతపురం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.  రూ.7.75 లక్షల అప్పులు ఉన్నాయని అతడి భార్య లక్ష్మీదేవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2022-05-23T07:26:40+05:30 IST