Abn logo
Sep 25 2021 @ 23:18PM

అయ్యో.. అన్న క్యాంటీన్‌

గోపాలపట్నంలోని అన్న క్యాంటీన్‌ భవనం

పేదల ఆకలి తీర్చిన క్యాంటీన్‌ నాడు కళకళ.. నేడు వెలవెల

మూతపడడంతో రూపురేఖలు మారిపోయిన భవనం

చోరీకి గురవుతున్న సామగ్రి

చెత్తాచెదారంతో నిండిన ప్రాంగణం


టీడీపీ హయాంలో పేదల ఆకలి తీర్చిన అన్న క్యాంటీన్లు ఇప్పుడు దుర్భరంగా మారాయి. రూ.15కు మూడు పూటలా ఆహారం అందించిన ఈ క్యాంటీన్లు మూతపడి ప్రస్తుతం రూపురేఖలు మారిపోయాయి. నిత్యం జనంతో కళకళలాడే వాటి ప్రాంగణాలు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. లక్షలాది రూపాయలతో నిర్మించిన భవనాలు నిరుపయోగంగా ఉన్నాయి.


గోపాలపట్నం, సెప్టెంబరు 25: టీడీపీ హయాంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లు పేదలను ఎంతో ఆదుకున్నాయి. రోజువారీ కూలీలు, పిల్లల ఆదరణకు నోచుకోని వృద్ధులు.. ఇలా ఎందరికో ఆకలి తీర్చాయి. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇవి మూతపడడంతో పేదలకు కష్టాలు మొదలయ్యాయి. ఎంతో వైభవంగా ఉండే అన్న క్యాంటీన్లు ఇప్పుడు అధ్వానంగా తయారయ్యాయి. వీటిని ఎవరూ పట్టించుకోకపోవడంతో అందులోని సామగ్రి అపహరణకు గురయ్యాయి. 

వినియోగంలో లేకపోవడంతో..

స్థానిక రైతుబజారుకు చెందిన స్థలంలో బీఆర్‌టీఎస్‌ రహదారికి ఆనుకుని నిర్మించిన అన్న క్యాంటీన్‌ భవనాన్ని ఏడాది క్రితం తాత్కాలిక సచివాలయంగా కొద్ది రోజుల పాటు వినియోగించారు. తరువాత ఏ కారణం చేతనో సచివాలయాన్ని మరో భవనంలోకి మార్చారు. అప్పటి నుంచి ఈ అన్న క్యాంటీన్‌ భవనం దుర్భరంగా మారింది. భవనం చుట్టూ పిచ్చి మొక్కలు పెరగడంతో పాటు ఫ్లోరింగ్‌ దెబ్బతింది. గోడలు కూడా బీటలు వారాయి. ఈ భవనానికి తాళాలు లేకపోవడంతో రాత్రి వేళల్లో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. 

గేటుకు తాళాలు వేయకపోవడం వల్ల..

అన్న క్యాంటీన్‌ భవనానికి గాని, భవనం వెలుపల ఉన్న గేటుకు గానీ తాళాలు వేయకపోవడంతో ఈ భవనంలో ఉన్న సామగ్రి చోరీకి గురవుతున్నాయి. ఇందులో ఏర్పాటు చేసిన ఎనిమిది ఫ్యాన్లలో ప్రస్తుతం ఒక ఫ్యాన్‌ మాత్రమే ఉంది. ఇందులో భద్రపరిచిన సామగ్రి ఉందో?, లేక చోరీకి గురైందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. నిరుపయోగంగా ఉన్న ఈ భవనాన్ని ఇతర సామాజిక అవసరాలకు వినియోగించడానికి అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.