ఓహో గులాబి బాలి!

ABN , First Publish Date - 2022-08-09T09:39:02+05:30 IST

రాష్ట్రంలోని వివిధ రాజకీయ పార్టీల నేతలు ‘డెస్టినేషన్‌ పాలిటిక్స్‌’కు సిద్ధమవుతున్నారు.

ఓహో గులాబి బాలి!

రాజకీయ నేతల డెస్టినేషన్‌ పాలిటిక్స్‌!.. ఇండోనేషియాలో కలవనున్న నేతలు

వెళ్లేది ఇద్దరు మాజీ ఎంపీల వారసుల పెళ్లికి.. రాజకీయపరమైన చర్చలూ

టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ నేతలకు ఆహ్వానం.. అక్కడైతే నో ఫోన్‌ ట్యాపింగ్‌!


హైదరాబాద్‌, ఆగస్టు 8, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని వివిధ రాజకీయ పార్టీల నేతలు ‘డెస్టినేషన్‌ పాలిటిక్స్‌’కు సిద్ధమవుతున్నారు. ఇతర రాష్ట్రాలు, విదేశాలకు వెళ్లి వివాహం చేసుకునే ‘డెస్టినేషన్‌ వెడ్డింగ్‌’లా తెలంగాణకు చెందిన పలువురు నేతలు ఇతర దేశంలో కలుసుకోనున్నారు. వీరు వెళ్లేది కూడా ‘డెస్టినేషన్‌ వెడ్డింగ్‌’కే అయినా.. ఆ సందర్భంగా వీరి మధ్య రాజకీయ చర్చలు కూడా జరగనున్నట్లు విశ్వసనీయ సమాచారం. రాష్ట్రానికి చెందిన ఒక మాజీ ఎంపీ కుమార్తెకు, మరో మాజీ ఎంపీ మనవడితో ఈ నెలలో వివాహం జరగనుంది. ఈ రెండు కుటుంబాలకూ ఆర్థిక, అంగబలం దండిగా ఉండడంతో వివాహాన్ని ఇండోనేషియాలోని బాలిలో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌గా జరిపించాలని నిర్ణయించారు. ఈ మేరకు రెండు కుటుంబాలకు చెందిన పరిమిత అతిఽథులు, ప్రత్యేక విమానాలు, అదిరిపోయే ఏర్పాట్లతో ప్లాన్‌ చేసుకున్నారు. అయితే ఈ పెళ్లికి ఆహ్వాన ం అందిన కొందరు నేతలు, ‘‘వారి పెళ్లి హడావుడి  వారిదే.. మన రాజకీయం మనదే’’ అన్నట్లుగా వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ నుంచి ఇద్దరు కీలక నేతలు ఈ పెళ్లికి హాజరు కానున్నారు. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నుంచి కూడా కొందరు నేతలు, ఎమ్మెల్యేలు వెళ్లనున్నారు. దీంతో అక్కడ పెళ్లి సందర్భంగా వీరి మధ్య రాజకీయ చర్చలు కూడా జరిగే అవకాశాలున్నట్లు సమాచారం.


రాష్ట్రంలో నిఘా ఉండడం వల్లే..!

రాష్ట్రంలో తమ కదలికలు, ఫోన్లపై నిఘా ఉందన్న ఆందోళన రాజకీయ నేతల్లో అంతర్గతంగా ఉంది. ఇక్కడ ఏ ఇద్దరు నేతలు కలుసుకున్నా.. ఎందుకు కలిశారా? అంటూ ఆరా తీస్తారు. దీంతో స్వేచ్ఛగా కలుసుకోవడం, మాట్లాడుకోవడం వీలుకావడం లేదన్న భావన నేతల్లో ఉంది. ఇది అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిలోనూ ఉందన్నది బహిరంగ రహస్యమే. పార్టీల మార్పు, అంచనాలు చెప్పుకోవడం, అభిప్రాయాల మార్పిడి.. ఇలా ఏదైనా రాష్ట్రంలోనైతే స్వేచ్ఛగా చేసుకోవడానికి వీల్లేదనే ఆందోళన పలువురిలో నెలకొంది. తమను నిఘా నీడ అనుసరిస్తోందనే అనుమానం బలంగా పాతుకుపోయింది. ఈ నేపథ్యంలో నిఘా నీడకు ఆవల, ఫోన్లతో సంబంధం లేకుండా, నేరుగా కలిసి మాట్లాడుకునేందుకు డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ అవకాశం కల్పిస్తుందని వారు భావిస్తున్నారు. పెళ్లి పేరుతో సుదూరానికి వెళితే అక్కడ రాజకీయ దూరాలు చెరిపేసుకోవడం, రాజకీయ రహస్యాలు మాట్లాడుకోవడం సులభమవుతుందన్న భావనలో ఉన్నారు. రాష్ట్రంలో మాట్లాడుకోలేని అనేక విషయాలను స్వేచ్ఛగా పంచుకోవచ్చనే అభిప్రాయం  ఉంది. 


రాజకీయాలను మలుపుతిప్పిన ‘డెస్టినేషన్‌’..

వాస్తవానికి డెస్టినేషన్‌ పాలిటిక్స్‌ చోటుచేసుకోవడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా రాష్ట్రం బయటకు వెళ్లి మాట్లాడుకున్న సందర్భాలున్నాయి. ఒకే పార్టీకి చెందిన కొందరు నేతలు రాష్ట్ర సరిహద్దుగా ఉన్న పొరుగు రాష్ట్రానికి వెళ్లి చర్చించుకున్నారు. ఫోన్లపై నిఘా ఉండడంతో అక్కడికి వెళ్లి మనసువిప్పి మాట్లాడుకున్నారు. అయితే ఆ తర్వాతి కాలంలో అక్కడ జరిగిన విషయాలు బయటకు రావడం రాష్ట్రంలో కీలక పరిణామాలకు దారితీసింది. కొందరు నేతలను పార్టీనుంచి బయటకు పంపించేసేందుకు, ఆ తర్వాత అది ఉప ఎన్నికకు, రాష్ట్రంలో కొత్త రాజకీయ సమీకరణాలకు తెరతీసింది. ఆ పరిణామాలే రాజకీయ బలాబలాల తక్కెడలో ఒక్కసారిగా మార్పు వచ్చేందుకూ కారణమయ్యాయి.  ఇటీవల స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన సమావేశం కూడా ఈ డెస్టినేషన్‌ ప్రోగామ్‌ కిందకే వస్తుందన్న అభిప్రాయం ఉంది. ప్రధాని మోదీతో చంద్రబాబునాయుడుకు ఈ సందర్భంలోనే మాట కలిసింది. మీతో చాలా మాట్లాడాలని ప్రధాని, మీకు చాలా చెప్పాలని చంద్రబాబు అనుకోవడం.. చివరకు అది మరో సమావేశానికి పిలుస్తాను, మాట్లాడదాం అని మోదీ అనేంతవరకు వెళ్లింది. 

Updated Date - 2022-08-09T09:39:02+05:30 IST