వాహనదారులూ త్వరపడండి.. మరో పది రోజులే.. ఆలస్యమైతే చెల్లించక తప్పదు భారీ మూల్యం..!

ABN , First Publish Date - 2022-03-22T18:52:38+05:30 IST

‘వాహనదారులూ త్వరపడండి. రాయితీ గడువు మరో పది రోజులు మాత్రమే.

వాహనదారులూ త్వరపడండి.. మరో పది రోజులే.. ఆలస్యమైతే చెల్లించక తప్పదు భారీ మూల్యం..!

  • ‘చలో’నా..!
  • చలానా రాయితీకి చెల్లింపులకు పది రోజులే గడవు.. 
  • 20 రోజుల్లో 1.18 కోట్ల కేసులు క్లియర్‌
  • రూ. 112.68 కోట్ల ఆదాయం
  • మరో కోటి కేసుల వరకూ పెండింగ్‌
  • మార్చి 31 తర్వాత పూర్తిస్థాయిలో వసూళ్లు

హైదరాబాద్‌ సిటీ : ‘వాహనదారులూ త్వరపడండి. రాయితీ గడువు మరో పది రోజులు మాత్రమే. ఆలస్యమైతే చెల్లించక తప్పదు భారీ మూల్యం’ అంటూ ట్రాఫిక్‌ పోలీసులు సోషల్‌ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు. మార్చి 1 నుంచి 20 వరకు ట్రై కమిషనరేట్‌ పరిధిలోనే 1,18,41,129 పెండింగ్‌ చలానా కేసులు క్లియర్‌ అయ్యాయి. రూ. 112. 68 కోట్లకు పైగా ప్రభుత్వ ఖజానాకు జమ అయ్యాయి. ఈ ఉత్సాహంతో మిగిలిన చలానాలను క్లియర్‌ చేసుకోవాలని విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్‌ చలానాలను చెల్లించడానికి వాహనదారులకు ప్రభుత్వం భారీ రాయితీలను ప్రకటించిన విషయం తెలిసిందే.


ఇందుకు మార్చి 31 వరకు గడువు నిర్ణయించారు. చెల్లించాల్సిన మొత్తంలో ద్విచక్ర వాహనదారులకు, ఆటోలకు 75 శాతం, బస్సులకు 70 శాతం, తోపుడు బళ్లకు 80శాతం, కార్లకు 50శాతం, మాస్కులు ధరించని కేసుల్లో 90 శాతం రాయితీ ప్రకటించారు. మీ సేవతో పాటు, ఈ వ్యాలెట్ల ద్వారా చెల్లించే అవకాశం కల్పించారు. దాంతో లక్షల సంఖ్యలో వాహనదారులు పెండింగ్‌ కేసులు క్లియర్‌ చేసుకున్నారు. ఇంకా సగానికి పైగా చెల్లింపులు జరగాల్సి ఉందని ట్రాఫిక్‌ పోలీసులు అంటున్నారు. వాహనదారులు త్వరపడి పెండింగ్‌ చలానాలు చెల్లించాలని సూచిస్తున్నారు. గడువు ముగిసిన తర్వాత రాయితీల ను ఎత్తివేస్తున్నట్లు ట్రాఫిక్‌ ఉన్నతాధికారులు వెల్లడించారు. 

Updated Date - 2022-03-22T18:52:38+05:30 IST