ఇక ‘పది’ రోజులే

ABN , First Publish Date - 2022-04-18T04:40:24+05:30 IST

పదో తరగతి పరీక్షలు ఈ నెల 27వ తేదీ నుంచి మే 9వ తేదీ వరకు జరగనున్నాయి.

ఇక ‘పది’ రోజులే

వేధిస్తున్న ఫర్నీచర్‌ కొరత 

వెంటాడుతున్న విద్యుత్‌ కోతలు

అరకొరగా రవాణ సౌకర్యం

ఆందోళనలో విద్యార్థులు 


కర్నూలు(ఎడ్యుకేషన్‌), ఏప్రిల్‌ 17: పదో తరగతి పరీక్షలు ఈ నెల 27వ తేదీ నుంచి మే 9వ తేదీ వరకు జరగనున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు కొనసాగుతాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 943 ఉన్నత పాఠశాలల నుంచి 52,357 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. మొత్తం 272 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో ఏ సెంటరులో 129, బీ సెంటరులో 114, సీ సెంటర్లు 29గా గుర్తించారు. జిల్లాలో 88 జోన్లుగా, 21 రూట్లుగా విద్యాశాఖాధికారులు గుర్తించారు. కర్నూలు డివిజన్‌లో 15,455 మంది విద్యార్థులకు 76 పరీక్ష కేంద్రాలను, ఆదోని డివిజన్‌లో 14595 మంది విద్యార్థులకు 75 పరీక్ష కేంద్రాలు, డోన్‌ డివిజన్‌లో 8,791 మంది విద్యార్థులకు 50 పరీక్ష కేంద్రాలు, నంద్యాల డివిజన్‌లో 13,516 మంది విద్యార్థులకు 71 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.


పరీక్ష కేంద్రాల్లో వేధిస్తున్న ఫర్నీచర్‌ కొరత 


పది పరీక్ష కేంద్రాల్లో ఫర్నీచర్స్‌ కొరత వేధిస్తోంది. కటిక నేలపైనే విద్యార్థులను కూర్చోబెట్టి పరీక్షలను రాయించాల్సిన దుస్థితి నెలకొంది. మనబడి-నాడు-నేడు కింద కొన్ని పాఠశాలలకు బెంచీలు, డెస్కులను సమకూర్చారు. అది విద్యార్థుల సంఖ్యకు ఏ మాత్రం సరిపోవడం లేదు. ఫర్నీచర్లు ఉన్నా అవి విద్యార్థులు కూర్చుని పరీక్షలు రాసేందుకు వీలు పడడం లేదనే ఉపాధ్యాయులే చర్చించుకుంటున్నారు. పరీక్ష కేంద్రం పక్క పాఠశాలల నుంచి ఫర్నీచర్లను తెచ్చుకుందామంటే.. రవాణ, హమాలీ ఖర్చులు ఎవరు భరిస్తారో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా నంద్యాల, ఆదోని, డోన్‌ డివిజన్‌ కేంద్రాల్లోని పరీక్ష కేంద్రాల్లో ఫర్నీచర్ల కొరత ఎక్కువగా ఉంది.


రవాణ సౌకర్యం ఏదీ..? 


పది పరీక్షలు రాసే విద్యార్థులకు పరీక్ష కేంద్రాలకు రవాణా సౌకర్యాలు లేవు. రోడ్డు సౌకర్యాలు ఉన్నా.. ఆర్టీసీ బస్సు సౌకర్యాలు లేవు. మండల కేంద్రాల్లోని పది పరీక్షల కేంద్రాలకు సమీప గ్రామాల నుంచి ఆర్టీసీ బస్సు సౌకర్యాలు లేకపోవడంతో ఆటోలను, మోటారు సైకిళ్లను ఆశ్రయించాల్సి వస్తోంది. పరీక్షల వేళల్లో ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించడంలో విద్యాశాఖ అధికారులు, అటు ఆర్టీసీ అధికారులు ఘోరంగా విఫలం చెందుతున్నారు. దీంతో విద్యార్థులకు కష్టాలు తప్పడం లేదు. ఈ సారి ఏ మాత్రం రవాణ సౌకర్యం కల్పిస్తారో చూడాలి మరి.


వేధిస్తున్న విద్యుత్‌ కొరత


ఎడా పెడా విద్యుత్‌ కోతలు విధిస్తుండటంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కరెంటు ఎప్పుడు ఉంటుందో.. పోతుందో తెలియని పరిస్థితి ఉంది. దీంతో రాత్రివేళల్లో సెల్‌ చార్జీలు, కొవ్వొత్తుల వెలుగులో విద్యార్థులు చదువుకుంటున్నారు. ముఖ్యంగా పరీక్ష కేంద్రాల్లో విద్యుత్‌ సౌకర్యాలు ఉన్నప్పటికీ, కరెంటు కోతల కారణంగా లైట్లు, ఫ్యాన్లు తిరగవు. మరికొన్ని పాఠశాలల్లో కరెంటు ఉన్నా ఫ్యాన్లు, లైట్లు సౌకర్యాలు లేవు. దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడనున్నారు. 


విద్యార్థులకు అసౌకర్యం కలగనీయం


పదవ తరగతి పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. విద్యార్థులు నేలపై కూర్చుని పరీక్షలు రాయకుండా పూర్తి స్థాయిలో బెంచీలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చాం. నంద్యాల, ఆదోని, డోన్‌ డివిజన్లలో పది పరీక్ష కేంద్రాల్లో ఫర్నీచర్ల కొరత ఉందని మా దృష్టికి తీసుకువచ్చింది. వాటికి సమీప పాఠశాలల నుంచి ఫర్నీచర్లను సమకూర్చాలని సూచనలు ఇచ్చాం. విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలగకుండా చూడాలని విద్యుత్‌ శాఖ అధికారులను కోరాం. అలాగే గ్రామీణ ప్రాంతాల్లోని పరీక్ష కేంద్రాలకు ఆర్టీసీ బస్సు నడపాలని రీజనల్‌ మేనేజర్‌కు లెటరు ఇచ్చాం. పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, లైటింగ్‌, ఫ్యాన్లు సమకూర్చాలని సూచనలు ఇచ్చాం. పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌ జరగకుండా పది ప్లయింగ్‌ స్క్వాడ్లను ఏర్పాటు చేశాం. 


 - డీఈవో రంగారెడ్డి

Updated Date - 2022-04-18T04:40:24+05:30 IST