కేవలం ఏడ్రోజుల్లోనే కరోనాను ఎలా జయించారో చూడండి..

ABN , First Publish Date - 2021-05-18T17:01:37+05:30 IST

అరవై ఏళ్ల వయసులో కరోనా వచ్చిందని భయపడలేదు. ఇంట్లోనే ఉండి చికిత్స పొందారు.

కేవలం ఏడ్రోజుల్లోనే కరోనాను ఎలా జయించారో చూడండి..

  • సరైన ఆహారం, మందులతో కరోనాను ఎదుర్కొన్న దంపతులు


అరవై ఏళ్ల వయసులో కరోనా వచ్చిందని భయపడలేదు. ఇంట్లోనే ఉండి చికిత్స పొందారు. మనోస్థైర్యంతో మహమ్మారిని ఎదుర్కొన్నారు. కరోనాను జయించి ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. ఆ దంపతులే.. సీతాఫల్‌మండి మేడిబావికి చెందిన బొల్ల వనజయాదవ్‌ (62). బొల్ల కృష్ణారావు (67).


హైదరాబాద్/బౌద్ధనగర్‌ : వనజ యాదవ్‌ గృహిణి. కృష్ణారావు రిటైర్డ్‌ ఉద్యోగి. భార్యాభర్తలిద్దరూ ఇంట్లోనే ఉంటున్నారు. ఏప్రిల్‌ 9న కొద్దిగా జ్వరంగా అనిపించింది. జ్వరం తగ్గకపోవటంతో స్థానికంగా నివసించే వీరి కుమారుడు సుమిత్‌యాదవ్‌ ఏప్రిల్‌ 12న ఓ ప్రైవేట్‌ ల్యాబ్‌లో కరోనా టెస్టులు చేయించారు. 13న వచ్చిన రిపోర్ట్‌లో ఇద్దరికీ పాజిటివ్‌గా తేలింది. దీంతో అందరూ ఆందోళన చెందారు. వనజయాదవ్‌కు బాగా నీరసంగా ఉండటంతో నల్లకుంటలోని ఓ డయాగ్నస్టిక్‌ సెంటర్‌లో సిటీస్కాన్‌ చేయించారు. మూడురోజులు పాటు ఇంటిలోనే వేర్వేరు రూమ్‌లో ఉంటూ మందులు వాడారు. అయినప్పటికీ జ్వరం, ఒంటి నొప్పులు తగ్గలేదు.


చేర్చుకోని ప్రైవేట్‌ ఆస్పత్రి...

ఏప్రిల్‌ 17న వ సుమిత్‌యాదవ్‌ తల్లిదండ్రులిద్దరినీ స్థానికంగా ఉన్న ఓ నర్సింగ్‌హోమ్‌కు తీసుకువెళ్లారు. వీరి కరోనా రిపోర్ట్‌లు చూసిన డాక్టర్లు ఆస్పత్రిలో చేర్చుకోలేదు. స్థానికుల సూచన మేరకు శ్రీనివా్‌సనగర్‌లో ఓ ప్రైవేట్‌ క్లినిక్‌లో ఇద్దరినీ చేర్పించారు. అక్కడ వారికి వైద్యుడు ఉదయం, సాయంత్రం పెయిన్‌ కిల్లర్‌ ఇంజెక్షన్‌, నాలుగు ట్యాబెట్లు ఇచ్చారు. అక్కడి వైద్యం నచ్చక కుమారుడు ఇద్దరినీ ఇంటికి తీసుకువచ్చాడు. మందులు వాడిన తర్వాత ఏప్రిల్‌ 21న చేసిన కరోనా పరీక్షల్లో నెగిటివ్‌ రిపోర్ట్‌ వచ్చింది. వనజయాదవ్‌కు మాత్రం ఆరోగ్యం కుదుటపడలేదు. దీంతో తెలిసినవారి ద్వారా ఓ ప్రముఖ ఆస్పత్రిలో పనిచేసే వైద్యుడిని సంప్రదించారు. వైద్యుడి సూచన మేరకు ఏప్రిల్‌ 23వ తేదీ సాయంత్రం వనజయాదవ్‌కు ఇంట్లోనే వైద్యం మొదలు పెట్టారు. ఏప్రిల్‌ 29న వనజయాదవ్‌కు కూడా నెగెటివ్‌ రిపోర్ట్‌ వచ్చింది.


ఆహార జాగ్రత్తలు...

మందులు వాడడంతో పాటు దంపతులిద్దరూ ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. రోజూ ఉదయం రెండు ఇడ్లీ, రెండు కోడిగుడ్లు, మధ్యాహ్నం రెండు పుల్కాలు, కొద్దిగా రైస్‌, మూడు కోడిగుడ్లు, ఆకుకూరలు, సాయంత్రం న్యూట్రిషియన్‌ బిస్కెట్లు, టీ, రాత్రికి నాలుగు పుల్కాలు, మూడు కోడిగుడ్లు, కూరలను తినేవారు.


వాడిన మందులు...

ఉదయం రెండు గంటలు, సాయంత్రం రెండుగంటల పాటు మందుల కోర్సును ఐదురోజులు పాటు వాడారు. స్టెరాయిడ్‌ ఇంజెక్షన్‌, యాంటిబయొటిక్‌ ట్యాబెట్లు వాడారు. వనజయాదవ్‌కు రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు కూడా ఇచ్చారు. బలానికి ట్యాబెట్లు వాడారు.


చాలా భయం వేసింది 

అమ్మ, నాన్నలకు కరోనా పాజిటివ్‌ అని తెలియడంతో చాలా భయం వేసింది. వారితో పాటు నేను కూడా టెస్ట్‌ చేయించుకున్నా. నెగెటివ్‌ వచ్చింది. నాన్నకు ఏడురోజుల్లోనే నెగెటివ్‌ వచ్చింది. అమ్మకు కొద్దిగా ఇబ్బంది అయింది. నెగెటివ్‌ రావటానికి పదహారు రోజులు పట్టింది. అత్యవసరంగా రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు కావడంతో డిప్యూటీ స్పీకర్‌ తీగుళ్ల పద్మారావుగౌడ్‌ అందజేశారు. వారికి మా కుటుంబం ఎప్పుడూ రుణపడి ఉంటుంది. దేవుడి దయవల్ల అమ్మనాన్నలు ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారు.- బొల్ల సుమిత్‌యాదవ్‌, కుమారుడు.

Updated Date - 2021-05-18T17:01:37+05:30 IST