పంజాబ్‌‍‌లోనే ఆక్సిజన్ కొరతతో మరణాలు: కేంద్రం

ABN , First Publish Date - 2021-12-03T21:32:48+05:30 IST

కరోనా సెకెండ్ వేవ్‌లో ఆక్సిజన్ కొరతతో సంభవించిన మరణాలపై డాటా అడిగినప్పుడు 19 రాష్ట్రాలు స్పందించాయని..

పంజాబ్‌‍‌లోనే ఆక్సిజన్ కొరతతో మరణాలు: కేంద్రం

న్యూఢిల్లీ: కరోనా సెకెండ్ వేవ్‌లో ఆక్సిజన్ కొరతతో సంభవించిన మరణాలపై డాటా అడిగినప్పుడు 19 రాష్ట్రాలు స్పందించాయని, పంజాబ్ మాత్రమే నాలుగు అనుమాస్పద మరణాలు సంభవించినట్టు రిపోర్ట్ చేసిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్షుక్ మాండవీయ శుక్రవారంనాడు లోక్‌సభలో ఈ విషయం తెలిపారు. మహారాష్ట్ర ఎంపీ బి.ధనరోర్కర్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి స్పందిస్తూ, సెకెండ్ వేవ్ ప్రారంభమైనప్పటి నుంచి దేశంలో ఆక్సిజన్‌ లభ్యతపై రాజకీయాలు మొదలయ్యాయని అన్నారు.


''ఆక్సిజన్ రోజువారీ అవసరం 900 నుంచి 1,000 మెట్రిక్ టన్నులు. మొదటి వేవ్‌లోనే 1,400 మెట్రిక్ టన్నులకు లభ్యతను పెంచాం. రెండో వేవ్‌లోనూ ఆక్సిజన్ కెపాసిటీని కూడా పెంచాం. విదేశాల నుంచి కూడా ట్యాంకర్ల ద్వారా ఆక్సిజన్ తెప్పించాం. నావికాదళంతో పాటు వైమానిక సిబ్బంది సేవలు వినియోగించుకున్నాం''అని మంత్రి తెలిపారు. ఈరోజు ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యం 4,500 మెట్రిక్ టన్నులుగా ఉందని ఆయన సభకు వివరించారు.


కేంద్రం శక్తివంచన లేకుండా అన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ కొందరు రాజకీయాలు చేయాలని చూశారని పరోక్షంగా ఢిల్లీలోని 'ఆప్‌' ప్రభుత్వాన్ని మన్షుక్ మాండవీయ తప్పుపట్టారు. లెక్కలు హెచ్చుచేసి చూపించి మరింత ఆక్సిజన్ కావాలంటూ కొందరు వ్యక్తులు సుప్రీంకోర్టును ఆశ్రయించారని, టాంకర్లను ఢిల్లీకి మళ్లించడం కూడా తాను చూశానని అన్నారు. మరణాలను కూడా రాజకీయం చేయాలనుకున్నారని విమర్శించారు. ఆక్సిజన్ కొరతపై మూడుసార్లు రాష్ట్రాలను గణాంకాలు కోరడం జరిందన్నారు. పంజాబ్ నుంచి మాత్రమే ఆక్సిజన్ కొరతతో నాలుగు అనుమాస్పదన మరణాలు సంభవించినట్టు రిపోర్ట్ వచ్చిందని, ఆయా కేసులపై దర్యాప్తు జరుగుతోందని మంత్రి చెప్పారు. ఆక్సిజన్ కొరతతో మరణాలేవీ సంభవించ లేదంటూ 18 రాష్ట్రాలు తమకు నివేదించినట్టు కేరళ ఎంపీ అదూర్ ప్రకాష్ అడిగిన మరో ప్రశ్నకు సమాధానంగా మన్షుక్ మాండవీయ చెప్పారు.

Updated Date - 2021-12-03T21:32:48+05:30 IST