Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Fri, 26 Nov 2021 00:00:00 IST

సంకల్పంతోనే సాధ్యం

twitter-iconwatsapp-iconfb-icon
సంకల్పంతోనే సాధ్యం

మనసుంటే, శ్రద్ధ ఉంటే, అసాధ్యమైన ఏ కార్యాన్నయినా సాధించవచ్చని ధ్రువుడి కథ తెలియజేస్తుంది. ఆ విధమైన ఉపవాస దీక్షతో భగవంతుడి అనుగ్రహం పొందిన ధ్రువుడిలా... మనం కూడా దృఢమైన, శుద్ధమైన మనసుతో, నియమ నిష్టలతో మోక్ష సాధనకు ప్రయత్నం చెయ్యాలి.


మానవుడి మోక్షానికి కారకాలు అతని వయసు, పరిసరాలు కావు... దృఢ సంకల్పం, సజ్జన సాంగత్యం, ఉపదేశం. శ్రీమద్భాగవతంలోని ధ్రువుడి కథ ఈ విషయాన్ని మనకు తెలియజేస్తుంది. ధ్రువుణ్ణి చాలా పరుషమైన మాటలతో అతని సవతితల్లి నొప్పించింది. కన్న తండ్రి తన ఒడిలో అతణ్ణి కూర్చోబెట్టుకోవడానికి ముందువెనుకలాడుతున్నాడు. ధ్రువుడిది ఆటపాటలతో గడిపే చిన్న వయసు. అతని పరిస్థితి ప్రకారం... తనకు జరిగిన అవమానానికి అతను విలపిస్తూ కూర్చోవాలి. అయితే అతనికి సజ్జనురాలైన తల్లి సాంగత్యం, నారద మహర్షి లాంటి జ్ఞానుల ఉపదేశం దొరికింది. తను ఆపేక్షించిన స్థానం అశాశ్వతమనీ, నిజమైన శాశ్వత స్థానాన్ని ఇచ్చే పరమాత్ముణ్ణి శరణు వేడితే మన అజ్ఞానం, సమస్తకష్టాలు తొలగిపోతాయనీ గుర్తించాడు. వాసుదేవుడి కోసం అనితరసాధ్యమైన తపస్సు చేయాలన్న దృఢ సంకల్పం అతనికి కలిగింది. 


లౌకిక జీవనంలో ఉన్నతమైన స్థానం పొందడానికి మనం ఎంతో శ్రమిస్తాం. ఎందరినో ఆశ్రయిస్తాం. కానీ ఆ స్థానాలు అశాశ్వతం. వాటిని మనకు అందించే వ్యక్తులు అస్వతంత్రులు. వారి శక్తి పరిమితికి లోబడి ఉంటుంది. శాశ్వతమైనవాడు, సకల స్వతంత్రుడు కేవలం భగవంతుదైన వాసుదేవుడు మాత్రమే. ఆయన అనుగ్రహంతోనే బ్రహ్మాది దేవతలకు వారి యోగ్యతానుసారం సముచిత స్థానాన్ని శ్రీమహాలక్ష్మి ప్రసాదిస్తుంది. ఆమె కటాక్షంతోనే ఆదిశేషుడికి పరమాత్ముడి స్పర్శ నిరంతరం లభ్యమయ్యే భాగ్యం కలిగింది. తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామిని క్షణకాలం చూసినందుకే మనం పొంగిపోతాం. అటువంటిది... నిరంతరం ఆయన స్పర్శను పొందే ఆదిశేషుడు ఎంత అదృష్టవంతుడు! అందుకే ‘అన్యసురైహిదురాపామ్‌’ అన్నారు శ్రీ మధ్వాచార్యులు. అంటే... ఇంద్రాది దేవతలకు సైతం అది దుర్లభం. 


అటువంటి వాసుదేవుడి అనుగ్రహం పొందాలనుకున్న ధ్రువుడు మూడు రోజులకు ఒకసారి పండు తింటూ, ఆ తరువాత ఆరు రోజులకు ఒకసారి ఆకులు తింటూ, అనంతరం తొమ్మిది రోజులకు ఒకసారి గాలి పీలుస్తూ... పిదప కేవలం నీటిని తాగి, గాలిని పీల్చి... చివరకు ఊపిరి బిగబట్టి...  గాలిని సైతం పీల్చకుండా కఠోర తపస్సు చేశాడు. వాసుదేవుడి కటాక్షాన్ని పొందాడు. ఆ బాలుడి దీక్షకు పరవశుడైన పరమాత్మ ప్రత్యక్షమయ్యాడు. అతనికి సుస్థిరమైన, ప్రకాశమానమైన స్థానాన్ని అనుగ్రహించాడు. 


ఏదైనా ఏకాదశి రోజున నీరు కూడా తాగకుండా ఉపవాసం ఉండాలంటే జంకే మనకు... మనసుంటే, శ్రద్ధ ఉంటే, అసాధ్యమైన ఏ కార్యాన్నయినా సాధించవచ్చని ధ్రువుడి కథ తెలియజేస్తుంది. ఆ విధమైన ఉపవాస దీక్షతో భగవంతుడి అనుగ్రహం పొందిన ధ్రువుడిలా... మనం కూడా దృఢమైన, శుద్ధమైన మనసుతో, నియమ నిష్టలతో మోక్ష సాధనకు ప్రయత్నం చెయ్యాలి. సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమే.


ఉత్తరాది మఠాధిపతి శ్రీ సత్యాత్మతీర్థ శ్రీపాదులు జ్ఞాన, భక్తి, వైరాగ్యాల గురించి భగవద్భక్తులకు ఉపదేశిస్తూ ఉంటారు. ఒకసారి చాతుర్మాస్య దీక్షలో ఆయన ఇచ్చిన సందేశం ఇది.

మాధ్వ ప్రచార పరిషత్‌

9440258841

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.