‘ఉత్త’ర్వులే

ABN , First Publish Date - 2022-01-07T07:24:00+05:30 IST

ఆర్టీసీలో మహిళా కండక్టర్లకు 8గంటల పని విధానాన్ని అమలుచేస్తామని, వారికి పలు సౌకర్యాలు కల్పిస్తామని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చినా, దీనికి అనుగుణంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసినా నల్లగొండ రీజియన్‌లో ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదు. మహిళా కండక్టర్ల హక్కులు, సౌకర్యాలు కాగితాలకే పరిమితమయ్యాయి.

‘ఉత్త’ర్వులే

ఎండీ సజ్జనార్‌ ఆదేశాలు బేఖాతర్‌ 

మహిళా కండక్టర్లకు వసతులు కరువు

డ్యూటీల కేటాయింపులో వివక్ష 

జూనియర్లు కార్యాలయాల్లో, సీనియర్లు బస్సుల్లో

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి-నల్లగొండ)

ఆర్టీసీలో మహిళా కండక్టర్లకు 8గంటల పని విధానాన్ని అమలుచేస్తామని, వారికి పలు సౌకర్యాలు కల్పిస్తామని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చినా, దీనికి అనుగుణంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసినా నల్లగొండ రీజియన్‌లో ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదు. మహిళా కండక్టర్ల హక్కులు, సౌకర్యాలు కాగితాలకే పరిమితమయ్యాయి. డ్యూటీ దిగి ఇంటికి చేరేసరికి మొత్తం 15గంటల సమయం అవుతోందని, కనీసం కాలకృత్యాలు తీర్చుకునే తీరిక, సౌకర్యాలు కూడా లేవని మహిళా కండక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదనంగా ఇచ్చిన మూడు సీఎల్‌ మాట అటుంచితే సాధారణ అవసరాలకు కూడా అధికారులు సెలవులు మంజూరు చేయడంలేదని, వయస్సు, విద్యార్హత ఆధారంగా డ్యూటీలు వేయడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ఓ వైపు కుటుంబం, మరోవైపు ఉద్యోగ భారంతో మహిళా కండక్టర్లు సతమతమవుతున్నారు.

మహిళా కండక్టర్లతో సీఎం కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో 2019, డిసెంబరు 2వ తేదీన సహపంక్తి భోజనం చేసి వారి సమస్యలు తెలుసుకున్నారు. మహిళా కండక్టర్లు రాత్రి 8లోపే విధులు ముగించుకుని ఇంటికి చేరేలా డ్యూటీలు వేయాలని, రెస్ట్‌ రూములు, ఇతర సౌకర్యాలు కల్పించాలని అక్కడి నుంచే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆయన ఆదేశాలతో కొంతకాలం ఈ విధానాన్ని అమలుచేసిన ఆర్టీసీ అధికారులు ఆ తరువాత ఎత్తేశారు. ఆర్టీసీ ఎండీగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన సజ్జనార్‌ దృష్టికి ఈ సమస్యను సంఘాలు తీసుకెళ్లడంతో 8గంటల డ్యూటీ విధానాన్ని అమలు చేయాలని 2021, డిసెంబరు 28న ఉత్తర్వులు జారీ చేశారు. అయినా ఈ విధానం నల్లగొండ రీజియన్‌లో అమలుకు నోచడంలేదు.

308 మంది మహిళా కండక్టర్లు

ఉమ్మడి జిల్లాలో ఆర్టీసీ డిపోల్లో మొత్తం 308 మంది మహిళా కండక్టర్లు పనిచేస్తున్నారు. నల్లగొండ రీజియన్‌లో మొత్తం ఏడు డిపోలు ఉన్నాయి. దేవరకొండ డిపోలో 19 మంది మహిళా కండక్టర్లు, నల్లగొండలో 64, నార్కట్‌పల్లిలో 43, మిర్యాలగూడలో 53, యాదగిరిగుట్టలో 36, కోదాడలో 36, సూర్యాపేటలో 57 మంది విధులు నిర్వహిస్తున్నారు. వీరికి 8గంటల డ్యూటీ విధానాన్ని అమలు చేయాల్సి ఉండగా, అధికారుల ఒత్తిడితో 14గంటల మేర పనిచేయాల్సి వస్తోంది. రాత్రి 8గంటలకే ఇంటి బాట పట్టాల్సి ఉండగా, డ్యూటీ ముగించుకొని నగదు లెక్కలు అప్పగించే వరకు రాత్రి 10 అవుతోంది. ఇంటికి చేరేసరికి మరికొన్ని గంటల సమయం పడుతోంది. వరుసగా 14గంటల పాటు పనిచేస్తే మరుసటి రోజు డేఆఫ్‌ సెలవు ఇవ్వాలనే నిబంధన ఆర్టీసీలో ఉంది. అది కూడా వీరికి వర్తించడం లేదు. మహిళా కండక్టర్ల వ్యక్తిగత ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని నెలకు 3 సీఎల్స్‌ అదనంగా ఇవ్వాల్సి ఉంటుంది. సిబ్బంది కొరత సాకుతో మూడు సీఎల్స్‌ మహిళా కండక్టర్లకు దక్కడం లేదు. అనారోగ్యం, కుటుంబ అవసరాలకు సైతం సెలవు ఇవ్వడం లేదని మహిళా కండక్టర్లు ఆరోపిస్తున్నారు. అధికారులు మంజూరు చేస్తారో లేదో అన్న సందేహంతోనే చాలా మంది సెలవు అడగడమే మానేశారని పలువురు తెలిపారు. ఒక మహిళా కండక్టర్‌ రోజులో 370కి.మీ మాత్రమే ప్రయాణించేలా డ్యూటీ వేయాలి. కాగా, రోజుకు 500కి.మీ ప్రయాణించేలా డ్యూటీలు కేటాయిస్తున్నారు. పురుషులకు ఎక్స్‌ప్రెస్‌ విధులు ఇస్తూ, పని ఒత్తిడి ఉండే పల్లెవెలుగు బస్సుల విధులను తమకు కేటాయిస్తున్నారని మహిళా కండక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళా ఉద్యోగుల అవసరాల కోసం డిపోల్లో ప్రత్యేకంగా రెస్ట్‌ రూములు ఏర్పాటు చేసినా వాటిలో సౌకర్యాలు కల్పించలేదు. దేవరకొండ నుంచి హైదరాబాద్‌కు వెళ్లి వచ్చే మహిళలకు మధ్యలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఎలాంటి సౌకర్యాలు లేవు. మాల్‌లో బస్సు ఆగినా అక్కడ వసతులు లేకపోవడంతోపాటు, ఇక్కడ బస్సు నిలిచే సమయం కూడా అతి స్వల్పం. రీజియన్‌లోని అన్ని డిపోల్లో ఇదే పరిస్థితి ఉంది. సిబ్బందికి అందజేసిన బూట్లు సైతం నాణ్యతగా లేకపోవడంతో ప్రైవేటుగా కొనుగోలుచేస్తున్నారు. సంస్థ ఇచ్చిన యూనిఫాం ధరించేందుకు సైతం మహిళా కండక్టర్లు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

డిప్లో విధుల్లో పురుషులే అధికం

రీజియన్‌లోని ఏ డిపోలో సైతం కార్యాల య విధులకు మహిళలను నియమించలే దు. విద్యార్హత, నైపుణ్యం ఉన్నా తమను నియమించడం లేదని మహిళా కండక్టర్లు ఆరోపిస్తున్నారు. జూనియర్లను రూట్‌లో పంపి, 45 ఏళ్లు దాటిన వారిని కార్యాలయాల్లో సేవలకు వినియోగించాల్సి ఉండగా, అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. జూనియర్లకు ఆఫీసుల్లో విధులు కేటాయించి సీనియర్లను రూట్లకు పంపుతున్నారని ఆరోపిస్తున్నా రు. పీజీ చేసి 21ఏళ్లు సర్వీసు చేసినా పదోన్న తి లేదని, బస్సుల్లోనే తిప్పుతున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2014లో మిర్యాలగూడ డిపోలో మహిళా కండక్టర్‌ను నైట్‌హాల్ట్‌ బస్సు డైవర్‌ వేధించిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు ఏడేళ్లవుతున్నా మహిళా కండక్టర్లకు కేటాయిస్తున్న డ్యూటీలు, సౌకర్యాల్లో ఎలాంటి మార్పు లేకపోవడం గమనార్హం.


పదోన్నతులు లేవు : నల్లా శ్రీవాణి, కండక్టర్‌, నల్లగొండ డిపో

నేను పీజీ చేసి, 21ఏళ్లుగా కండక్టర్‌ విధులు నిర్వహిస్తున్నా. చదువు, సీనియారిటీ, అర్హత ఉన్నా నేటికీ పదోన్నతి లేదు. పదోన్నతి కల్పిస్తే మరింత ఉత్సాహంతో విధులు నిర్వహిస్తాం. ఇతర డిపార్ట్‌మెంట్లలో పదోన్నతులు ఉన్నాయి. ఉద్యోగ విరమణ చెందేవరకు ఒకే కేటగిరీలో పనిచేయాల్సి వస్తోంది. ఇప్పటికైనా అర్హత ఉన్న వారికి పదోన్నతులు కల్పించాలి.

అవకాశాలు దక్కడంలేదు : సుజాత, కండక్టర్‌, దేవరకొండ డిపో 

న్యాయపరంగా మాకు రావాల్సిన హక్కులు, అవకాశాలు అందడం లేదు. రాష్ట్రస్థాయి యూనిఫాం ఎంపిక కమిటీలో నేను సభ్యురాలిని. మేం ఎంపికచేసిన డ్రెస్‌ చెర్రీ పండు రంగు అయితే, తారా ఇచ్చింది మెరున్‌ కలర్‌. పురుషులకంటే అధిక పనిగంటలు, ఎక్కు కిలోమీటర్ల దూరం పనిచేయిస్తున్నారు. అవకాశం ఉన్నా ఆఫీసుల్లోకి మార్చడం లేదు. ఇష్టానుసారంగా డ్యూటీలు వేస్తున్నా, గత్యంతరం లేక విధులు నిర్వహిస్తున్నాం. కరోనా విపత్కర పరిస్థితుల్లో సైతం విధులు నిర్వహిస్తున్నాం.  

డిపో డ్యూటీలు వేయాలి : బి.ఆండాలమ్మ, కండక్టర్‌, నల్లగొండ డిపో

ఆర్టీసీలో 26 ఏళ్లుగా కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నా. వయసు పైబడింది. ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఆరు నెలల్లో ఉద్యోగ విరమణ ఉంది. వయసురీత్యా బస్సులో నిలబడి టికెట్లు ఇవ్వలేకపోతున్నా. నాలాగా వయసుపైబడిన వారికి, సీనియర్లకు డిపోలో కార్యాలయ విధులు కేటాయించాలి. కానీ అధికారులు ఏ మాత్రం కనికరం లేకుండా ప్రవర్తిస్తున్నారు.  

త్వరలోనే 8గంటల పనివిధానం : రాజేంద్రప్రసాద్‌, ఆర్‌ఎం, నల్లగొండ 

మహిళా కండక్టర్లకు నైట్‌హాల్ట్‌ డ్యూటీలు లేవు. రాత్రి 8గంటల్లోపు విధులు ముగించుకునేలా త్వరలో కార్యచరణ రూపొందిస్తాం. ప్రస్తుతం ఈ విధానం ఉన్నా, ఆయా రూట్లల్లో ట్రాఫిక్‌ కారణంగా అర్ధగంట, గంటపాటు ఆలస్యమవుతున్న మాట వాస్తవమే.

Updated Date - 2022-01-07T07:24:00+05:30 IST