భక్తి కాసులపై.. ఇంద్రకీలాద్రిపై కాంట్రాక్టర్ల దందా

ABN , First Publish Date - 2020-10-19T16:54:16+05:30 IST

కనకదుర్గమ్మ సన్నిధిలో ప్రైవేటు వ్యాపార కాంట్రాక్టర్ల దందా రోజురోజుకూ మితిమీరిపోతోంది. సాక్షాత్తూ రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అనుచరులే వ్యాపారులు, కాంట్రాక్టర్ల అవతారమెత్తి కొండపై తమ మాటే నెగ్గాలన్న ధోరణితో వ్యవహరిస్తున్నారు. వారి భక్తి కాసులపైనే. వారి దృష్టి భక్తుల సౌకర్యాలపై ఉండదు.. భక్తులను నిలువునా దోచుకోవడంపైనే ఉంటుంది.

భక్తి కాసులపై.. ఇంద్రకీలాద్రిపై కాంట్రాక్టర్ల దందా
కొండపై వెండింగ్ మెషీన్ పాయింట్లో వాటర్ బాటిల్స్, శీతల పానియాల విక్రయాలు

అమాత్యుడి అనుచరులైతే నిబంధనలు పక్కకే 

వారి ప్రయోజనాలకే పెద్దపీట

సేవలకు చెల్లు.. భక్తుల జేబులు గుల్ల 

అధికారుల కనుసన్నల్లోనే అక్రమాలు 

కొండపై అక్రమాలకు పాలకమండలి వత్తాసు


(ఆంధ్రజ్యోతి, విజయవాడ): కనకదుర్గమ్మ సన్నిధిలో ప్రైవేటు వ్యాపార కాంట్రాక్టర్ల దందా రోజురోజుకూ మితిమీరిపోతోంది.  సాక్షాత్తూ రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అనుచరులే వ్యాపారులు, కాంట్రాక్టర్ల అవతారమెత్తి కొండపై తమ మాటే నెగ్గాలన్న ధోరణితో వ్యవహరిస్తున్నారు. వారి భక్తి కాసులపైనే. వారి దృష్టి భక్తుల సౌకర్యాలపై ఉండదు.. భక్తులను నిలువునా దోచుకోవడంపైనే ఉంటుంది. 


ఇంద్రకీలాద్రిపై నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలు వసూలు చేస్తూ భక్తులను దోపిడీ చేసేందుకు అధికారికంగా అనుమతులు ఇస్తున్నారు. కొండపైన దాహమేస్తే నీళ్లు కొనుక్కోవాల్సిందే. కొండపైన, దిగువన, వెండింగ్‌ మెషీన్ల ద్వారా భక్తులకు కాఫీ, టీ, పాలు విక్రయించుకునేందుకు లైసెన్స్‌లు పొందిన కాంట్రాక్టర్లకే వాటర్‌ బాటిల్స్‌, కూల్‌డ్రింక్స్‌ టెట్రాప్యాకెట్లు విక్రయించుకునేందుకు అనుమతులు జారీ చేశారు. ఇందుకుగానూ లీజుతో పాటు అదనంగా నెలకు రూ.10 వేలు చెల్లిస్తే చాలన్న ప్రతిపాదనను దేవస్థానం పాలకమండలి ఆమోదించడం వివాదాస్పదంగా మారింది. కొండపై కాంట్రాక్టర్లందరూ మంత్రి అనుచరులే కాబట్టి అనుమతులిచ్చేయవచ్చనే ధోరణితో పాలక మండలి వ్యవహరిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 


కొండపైన, దిగువన మూడుచోట్ల బ్రూ/ నెస్‌ కాఫీ వెండింగ్‌ మెషిన్ల ద్వారా టీ, కాఫీ, పాలు విక్రయించుకునేందుకు లైసెన్స్‌ కోసం దుర్గగుడి అధికారులు ఈ ఏడాది ఫిబ్రవరి 4న టెండర్లు పిలిచారు. కొండపైన ‘ఓం’ టర్నింగ్‌ వద్ద, దిగువన కనకదుర్గానగర్‌ ప్రవేశం వద్ద, గోశాల సమీపంలో మెషిన్లు ఏర్పాటు చేసుకునేందుకు వచ్చే ఏడాది మార్చి 31 వరకు రూ.50 వేల ధరావతుతో టెండర్లు ఆహ్వానించారు. మంత్రి అనుచరుడు కాంట్రాక్టరుగా రంగంలోకి దిగాడు. టెండరు నోటీసులో పేర్కొన్న మూడు పాయింట్లనూ ఒకే కాంట్రాక్టరుకు కేటాయించేందుకు నిబంధనలు అడ్డుగా నిలవడంతో రెండు పాయింట్లకు తన స్నేహితుల పేర్లతో టెండర్లు వేశాడు. ‘వడ్డించేవాడు మనవాడైతే’.. అనే సామెత చందంగా మొత్తం మూడు పాయింట్లూ ఆయనకే దక్కాయి. 


కొండపైన ‘ఓం’ టర్నింగ్‌ వద్ద పాయింట్‌కు నెలకు రూ.40 వేలు, కనకదుర్గానగర్‌ వద్ద పాయింట్‌కు రూ.53 వేలు, చెప్పుల స్టాండ్‌ పాయింట్‌కు రూ.60 వేలు చొప్పున ప్రతి నెలా దేవస్థానానికి రూ.1.53 లక్షలు అద్దె చెల్లించేలా టెండర్లు ఖరారు కావడంతో ఆ మూడు పాయింట్లలోనూ వెండింగ్‌ మెషిన్లు ఏర్పాటు చేసుకుని, మార్చి ఒకటో తేదీ నుంచి విక్రయాలు ప్రారంభించారు. షరతుల ప్రకారం ఆ పాయింట్లలో టీ, కాఫీ, పాలు మాత్రమే విక్రయించాలి. 100 మిల్లీ లీటర్ల టీ, కాఫీ, పాలను రూ.10కి మించి విక్రయించకూడదు. కానీ కాఫీ, లెమెన్‌ టీలకు రూ.15 చొప్పున వసూలు చేస్తూ, టెండరు షరతులకు విరుద్ధంగా ఫ్రిజ్‌లను ఏర్పాటు చేసి, వాటర్‌ బాటిళ్లు, కూల్‌డ్రింకులు, ఐస్‌క్రీములను కూడా విక్రయిస్తున్నారు. శీతల పానీయాల విక్రయాలకు టెండర్లు పిలిస్తే దేవస్థానానికి ప్రతి నెలా రూ.లక్షల్లో ఆదాయం సమకూరేది. అయితే కాఫీ వెండింగ్‌ మెషిన్ల లైసెన్స్‌ పొందిన కాంట్రాక్టర్లకే నెలకు అదనంగా రూ.10 వేలు మాత్రమే చెల్లించేలా తాజాగా అనుమతులు జారీ చేయడం వెనుక పెద్ద తతంగమే నడిచిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.  

Updated Date - 2020-10-19T16:54:16+05:30 IST