ఇచ్చిన మాటకు మేమే కట్టుబడ్డాం : మోదీ

ABN , First Publish Date - 2021-03-05T23:38:14+05:30 IST

వాతావరణ మార్పులపై ప్రధాన దృష్టితో పరస్పరం సహకరించుకోవాలని

ఇచ్చిన మాటకు మేమే కట్టుబడ్డాం : మోదీ

న్యూఢిల్లీ : వాతావరణ మార్పులపై ప్రధాన దృష్టితో పరస్పరం సహకరించుకోవాలని, ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని భారత్, స్వీడన్ నిర్ణయించాయి. శుక్రవారం జరిగిన వర్చువల్ సమావేశంలో ఇరు దేశాల ప్రధాన మంత్రులు వివిధ అంశాలపై చర్చలు జరిపారు. ఇటీవలి సంవత్సరాల్లో మన దేశం విద్యుత్తు రంగంలో సాధించిన విజయాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వివరించారు. 


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, గత ఐదేళ్ళలో భారత దేశ రెన్యూవబుల్ పవర్ కేపబిలిటీ 162 శాతం పెరిగిందని చెప్పారు. జీ20 దేశాల్లో కేవలం భారత దేశం మాత్రమే వాతావరణ మార్పులపై ఇచ్చిన మాటకు కట్టుబడిందని స్పష్టం చేశారు. ఎల్ఈడీ దీపాలను వినియోగించడం ద్వారా 38 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను నిలువరించగలిగామని తెలిపారు. 2030 నాటికి 450 గిగా వాట్ల రెన్యూవబుల్ ఎనర్జీని ఇన్‌స్టాల్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. 


50 దేశాలకు వ్యాక్సిన్లు

కరోనా వైరస్ మహమ్మారిపై జరుగుతున్న ప్రపంచ యుద్ధంలో భారత దేశం పోషిస్తున్న పాత్రను వివరిస్తూ, భారత దేశంలో తయారైన వ్యాక్సిన్లను దాదాపు 50 దేశాలకు అందజేశామని తెలిపారు. రాబోయే రోజుల్లో మరికొన్ని దేశాలకు వ్యాక్సిన్లను సరఫరా చేస్తామని చెప్పారు. 


ఆ విలువలతోనే పటిష్ట బంధం

ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, చట్టబద్ధ పరిపాలన, సమానత్వం, స్వాతంత్ర్యం, న్యాయం వంటి విలువలు భారత్, స్వీడన్లలో ఉన్నాయని చెప్పారు. ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం, సత్సంబంధాలను ఈ విలువలు బలోపేతం చేస్తున్నాయన్నారు. 


2015 సెప్టెంబరులో ఐక్య రాజ్య సమితి సాధారణ సభ సమావేశాల సందర్భంగా స్వీడన్ ప్రధాన మంత్రి స్టెఫాన్ లాఫ్‌వెన్‌తో మోదీ మాట్లాడారు. 2018 ఏప్రిల్‌లో మోదీ స్టాక్‌హోంలో పర్యటించారు. 2016 ఫిబ్రవరిలో స్టెఫాన్ మన దేశంలో పర్యటించారు. కోవిడ్-19 మహమ్మారి వేధిస్తున్న సమయంలో 2020 ఏప్రిల్‌లో ఇరువురు నేతలు టెలిఫోన్ ద్వారా చర్చలు జరిపారు. 


Updated Date - 2021-03-05T23:38:14+05:30 IST