ఎమ్మెల్యే భూమన కుమారుడికి CM YS Jagan కీలక పదవి...

ABN , First Publish Date - 2021-07-31T07:45:57+05:30 IST

తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి కుమారుడికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక పదవి ఇచ్చారు..

ఎమ్మెల్యే భూమన కుమారుడికి CM YS Jagan కీలక పదవి...

చిత్తూరు, జూలై 30 (ఆంధ్రజ్యోతి) : చిత్తూరు జిల్లాలోని రెండు నగరపాలక సంస్థల్లో రెండో డిప్యూటీ మేయర్‌, ఐదు పురపాలక సంస్థల్లో రెండో వైస్‌ ఛైర్మన్‌ ఎన్నికలు ముగిశాయి. ఆయా మేయర్‌, ఛైర్మన్ల అధ్యక్షతన శుక్రవారం ప్రత్యేక కౌన్సిల్‌ సమావేశం ఏర్పాటుచేశారు. రెండో డిప్యూటీ మేయర్‌, వైస్‌ ఛైర్మన్‌ ఎన్నికకు ప్రిసైడింగ్‌ అధికారులు అనుమతి ఇచ్చి.. వారి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియను నిర్వహించారు.అన్నిచోట్లా అభ్యర్థులను ముందుగానే వైసీపీ అధిష్ఠానం ప్రకటించడంతో ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. అనంతరం కొత్తగా ఎన్నికైన డిప్యూటీ మేయర్లు, వైస్‌ ఛైర్మన్లు ప్రమాణ స్వీకారం చేశారు. అన్ని ప్రాంతాల్లోనూ మొత్తం ఎన్నిక ప్రక్రియ 15 నిమిషాల్లో పూర్తి చేయడం విశేషం. పుంగనూరు, పలమనేరు మినహా  ఐదు ప్రాంతాల్లోనూ కౌన్సిల్‌ సమావేశాలకు ఆయా ప్రాంత ఎమ్మెల్యేలు హాజరయ్యారు.


తిరుపతి నగరపాలక సంస్థ రెండో డిప్యూటీ మేయర్‌గా ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి కుమారుడు, నాలుగో డివిజన్‌ కార్పొరేటర్‌ అభినయ్‌రెడ్డి ఎన్నికయ్యారు. ప్రిసైడింగ్‌ అధికారి అయిన కలెక్టర్‌ హరినారాయణన్‌ ఎన్నికల ప్రక్రియ నిర్వహించి ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు.మేయర్‌ శిరీష,కమిషనర్‌ పీఎస్‌ గిరీష, అడిషనల్‌ కమిషనర్‌ హరిత తదితరులు అభినయ్‌రెడ్డిని అభినందించారు.


చిత్తూరు నగరపాలక సంస్థ రెండో డిప్యూటీ మేయర్‌గా ఏడో డివిజన్‌ కార్పొరేటర్‌ రాజే్‌షకుమార్‌రెడ్డి ఎన్నికయ్యారు.ప్రిసైడింగ్‌ అధికారి అయిన జేసీ వీరబ్రహ్మం ఎన్నికల ప్రక్రియను నిర్వహించి ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. డిప్యూ టీ మేయర్‌గా ఎన్నికైన రాజేష్‌ కుమార్‌రెడ్డిని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మేయర్‌ అముద, ఏపీ మొదలియార్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ బుల్లెట్‌ సురేష్‌, డిప్యూటీ మేయర్‌ చంద్రశేఖర్‌, కార్పొరేటర్లు అభినందించారు.



  • మదనపల్లె మున్సిపాలిటీ రెండో వైస్‌ ఛైర్మన్‌గా జింకా వెంకటాచలపతి ఎన్నికయ్యారు. ప్రిసైడింగ్‌ అధికారి అయిన సబ్‌ కలెక్టర్‌ జాహ్నవి ఎన్నికల ప్రక్రియను నిర్వహించారు. ఎమ్మెల్యే నవాజ్‌బాషా, ఛైర్మన్‌ మనూజ, కమిషనర్‌ రఘనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

  • పుంగనూరు మున్సిపాలిటీలో రెండో వైస్‌ ఛైర్‌పర్సన్‌గా సీఆర్‌ లలితమ్మ ఎన్నికయ్యారు. ప్రిసైడింగ్‌ అధికారి అయిన డీఆర్వో మురళి ఎన్నికల ప్రక్రియను నిర్వహించి ప్రమాణస్వీకారం చేయించారు. రాష్ట్ర జానపదకళల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ కొండవీటి నాగభూషణం, పీకేఎం ఉడా ఛైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ కేఎల్‌ వర్మ, మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ నాగరాజరెడ్డి, మున్సిపల్‌ ఛైర్మన్‌ అలీమ్‌బాషా, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

  • పలమనేరు రెండో వైస్‌ ఛైర్మన్‌గా మూడో వార్డు కౌన్సిలర్‌ కిరణ్‌కుమార్‌ ఎన్నికయ్యారు. ప్రిసైడింగ్‌ అధికారి అయిన ఫారెస్టు సెటిల్‌మెంట్‌ అధికారి కోదండరామిరెడ్డి ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. కార్యక్రమంలో ఛైర్‌పర్సన్‌ పవిత్ర, కమిషనర్‌ కిరణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

  • పుత్తూరు మున్సిపాలిటీ రెండో వైస్‌ ఛైర్మన్‌గా జయప్రకాష్‌ ఎన్నికయ్యారు. ప్రిసైడింగ్‌ అధికారి అయిన చిత్తూరు ఆర్డీవో రేణుక ఎన్నిక నిర్వహించి ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఎమ్మెల్యే రోజా, మున్సిపల్‌ కమిషనర్‌ హరి, కమిషనర్‌ వెంకటరమణారెడ్డి ఆయన్ను అభినందించారు. ఫనగరి మున్సిపాలిటీ రెండో వైస్‌ ఛైర్మన్‌గా వెంకటరత్నం ఎన్నికవ్వగా.. వెల్ఫేర్‌ జేసీ రాజశేఖర్‌ ఎన్నిక నిర్వహించారు. ఎమ్మెల్యే రోజా,ఛైర్మన్‌ నీలమేఘం, కమిషనర్‌ నాగేంద్రప్రసాద్‌ తదితరులు వెంకటరత్నాన్ని అభినందించారు.


Updated Date - 2021-07-31T07:45:57+05:30 IST