అతడి బొమ్మలే మాట్లాడతాయి

ABN , First Publish Date - 2021-01-06T05:30:00+05:30 IST

ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కవులు, కళాకారులు భిన్న మార్గాల్లో తమ గళం వినిపిస్తూనే ఉంటారు. జన చైతన్యానికి తమవంతు కృషి చేస్తుంటారు. ఇప్పుడు తుషార్‌ చేస్తున్నదదే.

అతడి బొమ్మలే  మాట్లాడతాయి

గడప దాటి బయట అడుగు పెడితే చుట్టూ ఎన్నో కథలు... కదిలించే ఘటనలు. అవన్నీ చూసీ చూడనట్టు వెళ్లిపోవడం అలవాటుగా మారిపోయిన దైనందిన జీవితంలో... కొన్ని స్పందించే హృదయాలూ తారసపడతాయి. ఎప్పటికప్పుడు వాటిని సమాజం దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాయి. అలాంటి ఓ స్పందించే హృదయమే తుషార్‌ మడాన్‌. ఢిల్లీకి చెందిన ఈ 28 ఏళ్ల కళాకారుడు నడుస్తున్న చరిత్రను తన చిత్రాలతో ప్రపంచం ముందు ఉంచుతున్నాడు. దేశ రాజధానిలో జరుగుతున్న రైతుల పోరటాన్ని  ప్రతిబింబించేలా అతడు వేసిన చిత్రాలు... ఆ ఉద్యమానికి మరింత ఊపునిచ్చాయి. 


ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కవులు, కళాకారులు భిన్న మార్గాల్లో తమ గళం వినిపిస్తూనే ఉంటారు. జన చైతన్యానికి తమవంతు కృషి చేస్తుంటారు. ఇప్పుడు తుషార్‌ చేస్తున్నదదే. ఢిల్లీలో ఉధృతంగా సాగుతున్న రైతు పోరాటం చూసి చలించిన అతడు... మనిషిగా స్పందించి... కళాకారుడిగా ఆ ఉద్యమ స్ఫూర్తి మరింతమందికి చేరేలా ఇలస్ట్రేషన్‌ చిత్రాన్ని వదిలాడు.


ఇదే కాదు... దేశంలో మానవ హక్కులకు ఎక్కడ విఘాతం కలిగినా, జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసే ఘటనలు చోటుచేసుకున్నా... మహిళలపై అఘాయిత్యాలు జరిగినా... అతడిలోని కళాకారుడు బయటికి వస్తాడు. ఒక్క బొమ్మలో సమస్య అంతా అర్థమయ్యేలా భావాలు పలికిస్తాడు. అందరినీ ఆలోచింపచింపజేసి, అవగాహన కల్పించడమే అతడి అంతిమ లక్ష్యం. దానివల్ల సమాజానికి కొంత మేలు జరిగినా అంతకు మించిన సంతృప్తి ఏమీ ఉండదంటాడీ యువకుడు. 




రెయిన్‌బో సిరీస్‌... 

తుషార్‌ మడాన్‌ చిత్రాలన్నీ నిత్య జీవితంలో మనకు ఎదురయ్యే, కనిపించే దృశ్యాలే. మొన్నామధ్య అతడు విడుదల చేసిన ‘రెయిన్‌బో’ సిరీస్‌ చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. రోజు కూలీల వ్యథలు, బడుగు జీవుల బతుకులు, ఏ ఆధారం లేనివారి వేదనలు... ఇలాంటి నిజజీవిత గాథలను స్ఫూర్తిగా తీసుకుని ‘రెయిన్‌బో’ సిరీస్‌ను ఆవిష్కరించాడు. తుషార్‌ శైలి భిన్నమైనది. సమస్యను ఎలుగెత్తి చాటుతూనే... వ్యంగ్యాస్త్రాన్ని కూడా సంధిస్తాడు. అప్పుడప్పుడూ హాస్యాన్నీ పండిస్తాడు. 

‘‘నా చిత్రాలు... వాటిని చూసేవారికి సంబంధించినవై ఉండాలనుకొంటాను. ముఖ్యంగా నవతరం ఒకే విషయంపై ఎక్కువ దృష్టి పెట్టదు. అందుకే చూడగానే అర్థమయ్యేలా గీస్తున్నాను. వీటితోపాటు సామాజిక కోణంలోనే యానిమేషన్లు కూడా చేస్తున్నా. అవీ అంతే... మూడు నాలుగు సెకన్లకు మించి ఉండవు. ఆ కొద్ది సమయంలోనే చెప్పదలుచుకున్నది స్పష్టంగా చెబుతున్నాను’’ అంటున్న తుషార్‌ ప్రతి చిత్రం సూటిగా, సుత్తి లేకుండా  ఉండి ఆలోచింపజేస్తుంది. 



రోటీ కప్పుకున్న మనిషి... 

ఇటీవల తుషార్‌ వేసిన వాటిల్లో ఓ పేదవాడి చిత్రం బాగా ఆకట్టుకుంది. రోటీని కప్పుకుని, ఉల్లిపాయను దిండుగా పెట్టుకుని, చిత్తు కాగితంపై ఆదమరిచి నిద్రిస్తున్న ఆ చిత్రం ప్రతి ఒక్కరినీ కదిలించిది. ‘‘ఆ మధ్య ఢిల్లీలోని ఓ గురుద్వారాకు వెళ్లాను. ఆ ప్రాంగణంలో ఒకతను నిద్రిస్తున్నాడు. గడ్డకట్టే చలిలో కప్పుకోవడానికి ఏమీ లేక వణికిపోతున్నాడు.


ఆరా తీస్తే... అక్కడి లంగర్‌ (గురుద్వారాలో పేదలకు వడ్డించే వంటశాల)లో రోజూ తినడానికి దొరుకుతుంది. దాని కోసమే అతడు రాత్రిళ్లు ఆ ప్రాంగణంలోనే నిద్రిస్తున్నాడని తెలిసింది. అతడి పక్కన కొన్ని ఉల్లిపాయలు, రోటీలు ఉన్నాయి. ఆ కొంచెం తింటూనే జీవిస్తున్నాడు. నిజంగా ఆ దృశ్యం చూసి నా గుండె బరువెక్కింది. కళ్లు చెమ్మగిల్లాయి’’ అని ఆ బొమ్మ వెనక కథ చెప్పుకొచ్చాడు ఈ కళాకారుడు. 



పేదరికంలో పెరిగి...  

తుషార్‌ జీవితం వడ్డించిన విస్తరి కాదు. ఆ విస్తరిలో వడ్డించే ప్రతిదాని కోసం ఎన్నో ఇబ్బందులు, కష్టాలు పడ్డాడు. ‘ఢిల్లీ స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌’ నుంచి డిగ్రీ పట్టా పొందిన అతడు... చిన్నప్పటి నుంచి బొమ్మలంటే ఎనలేని మక్కువ. పాఠశాల తరగతి గదిలో ఉన్నప్పుడు, ఖాళీ దొరికినప్పుడు పుస్తకాలపై ఏవేవో గీసేస్తుండేవాడు. కానీ ఏ రోజూ మంచి పెయింటర్‌ కావాలని కలలు కనలేదు.


‘‘నా బొమ్మలు చూసి ఓ డ్రాయింగ్‌ పోటీలో పాల్గొనమని మిత్రులు ప్రోత్సహించారు. అసలేమీ సన్నద్ధమవకుండానే పోటీకి వెళ్లాను. ఆశ్చర్యమేమంటే... అందులో నాకు మొదటి బహుమతి వచ్చింది. ఇక అప్పటి నుంచి బొమ్మలు వేయడంపై దృష్టి పెట్టాను. కాలేజీలో చదివే రోజుల్లో ఢిల్లీలోని చాలా మ్యాగజైన్లకు బొమ్మలు వేసేవాడిని’’ అంటున్న తుషార్‌ ప్రస్తుతం ఓ కంపెనీకి ఆర్ట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. 


‘రైతు చిత్రం’పై రగడ...  

సామాజిక ధృక్పథంతో చిత్రాలు గీసే తుషార్‌... అందులోని రాజకీయ కోణాన్నీ ఆవిష్కరించాడు. కొన్ని ప్రభుత్వ నిర్ణయాలపై, రాజకీయ నాయకులపైనా వ్యంగాస్త్రాలు సంధించాడు. వాటిని చూసినవారు వర్గాలుగా చీలిపోయి తుషార్‌ను తిట్టిపోసిన సందర్భాలూ ఉన్నాయి. తాజాగా ఢిల్లీలో జరుగుతున్న రైతుల పోరాటంపై అతడు వేసిన ఓ చిత్రం చర్చనీయాంశమైంది. సామాజిక మాధ్యమాల్లో దానిపై దుమారం రేగింది. కానీ తుషార్‌ అవేవీ పట్టించుకోలేదు.


‘‘నా చిత్రం కొన్ని వర్గాలను రెచ్చగొట్టేలా ఉందని, దానివల్ల అల్లర్లు చెలరేగే ప్రమాదం ఉందని కొందరు వ్యాఖ్యానించారు. ఒక వర్గానికి కొమ్ము కాస్తుందని మరికొందరు నోటికొచ్చినట్టు తిట్టారు. వాళ్ల మాటకి మాట చెప్పే ఉద్దేశం నాకు లేదు. నేను ధర్నా జరుగుతున్న ప్రాంతానికి వెళ్లాను. అక్కడి పరిస్థితిని క్షుణ్ణంగా గమనించాను. ఆ తరువాతే ఆ చిత్రానికి రూపం ఇచ్చాను’’ అంటాడు తుషార్‌.

కరోనా నేపథ్యంలో వేసిన మరో చిత్రం మాస్క్‌ ధరించడం ఎంత అవసరమో చూడగానే ఇట్టే అర్థమైపోతుంది. నిత్యం మన చుట్టూ జరుగుతున్న ఘటనలను ఎత్తి చూపడం తుషార్‌ నైజం. దానిపై అందరూ చర్చించుకోవాలి. అవగాహన తెచ్చుకోవాలి. అంతిమంగా ఆ సమస్య పరిష్కారం అవ్వాలి... ఇదే తన లక్ష్యం అంటున్న తుషార్‌ యువతను మేల్కొలిపే ప్రయత్నం చేస్తున్నాడు. 


Updated Date - 2021-01-06T05:30:00+05:30 IST