టీఆర్‌ఎస్‌ టికెట్‌ కూసుకుంట్లకే

ABN , First Publish Date - 2022-10-08T10:25:03+05:30 IST

మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్‌రె డ్డి పేరే ఖరారైంది.

టీఆర్‌ఎస్‌ టికెట్‌ కూసుకుంట్లకే

  • అధికారికంగా ప్రకటించిన కేసీఆర్‌
  • బీఫారం, రూ.40 లక్షల చెక్కు అందజేత
  • జగదీశ్‌ నాయకత్వంలో ప్రచారం: కేటీఆర్‌

హైదరాబాద్‌/నల్లగొండ, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్‌రె డ్డి పేరే ఖరారైంది. ఈయనే అభ్యర్థి అని గతంలోనే నిర్ణయించిన అధిష్ఠానం.. శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ స్వయంగా కూసుకుంట్లకు బీఫారం అందజేశారు. ఇదే సందర్భంగా ఎన్నికల ఖర్చు కోసం పార్టీ నిధి నుంచి రూ.40 లక్షల చెక్కును కూడా అందించారు. ఉద్యమకారుడిగా పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగుతూ.. క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై పనిచేస్తున్న కూసుకుంట్లనే అభ్యర్థిగా పార్టీ నేతలు, నియోజకవర్గ ప్రజలు కోరుకున్నారని పార్టీ ప్రకటించింది. ఇవన్నీ పరిశీలించాకే కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారని పేర్కొంది. మరోవైపు ఈ ప్రకటనకు ముందు మునుగోడు నుంచి టికెట్‌ ఆశించిన మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌తో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ భేటీ అయ్యారు. వారిద్దరితోపాటు మంత్రి జగదీశ్‌రెడ్డితోనూ మాట్లాడారు. అనంతరం కూసుకుంట్ల పేరును ప్రకటించారు. 2014 ఎన్నికల్లో మునుగోడు నుంచి పోటీ చేసి గెలిచిన ప్రభాకర్‌రెడ్డి.. 2018 ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.


 ఉప ఎన్నికలో మరోసారి ఆయననే బరిలోకి దించాలని అధిష్ఠానం తొలినుంచీ భావించినా.. పార్టీ క్యాడర్‌ నుంచి కొంత వ్యతిరేకత వ్యక్తం కావడంతో అభ్యర్థి ఎంపిక ఆలస్యమైంది. అయినా చివరికి ప్రభాకర్‌రెడ్డిపైనే కేసీఆర్‌ విశ్వాసం ఉంచారు. కాగా, నల్లగొండ జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి నాయకత్వంలోనే మునుగోడు ఉప ఎన్నికను ఎదుర్కొంటామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.  ప్రచారానికి ఎవరెవరు వెళ్లాలన్నది నిర్ణయించామని, ఎప్పుడు ఎవరు అవసరమో మంత్రి జగదీశ్‌రెడ్డి సూచించిన మేరకు వెళతామని అన్నారు. తమది గెలిచే పార్టీ కాబట్టి ఎన్నికల సంఘంతో జాగ్రత్తగా ఉండాలని, ఎంతమంది వెళ్లారు? ఎన్నికల ఖర్చు ఎంత? వంటివన్నీ జాగ్రత్తగా చూసుకోకుంటే ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు కూడా జరుగుతాయని వ్యాఖ్యానించారు.


కూసుకుంట్లకు మద్దతు..

మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి మద్దతు ఇస్తున్నట్లు మున్నూరుకాపు సంఘం నేతలు తెలిపారు. శుక్రవారం టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర నాయకత్వంలో పలువురు సంఘం నేతలు ప్రగతిభవన్‌లో మంత్రులు కేటీఆర్‌ను, జగదీశ్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. మునుగోడు నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి ప్రభాకర్‌ రెడ్డికి ఘనవిజయం చేకూర్చేందుకు తమ వంతు కృషి చేస్తామని మంత్రులకు తెలిపారు. మంత్రులను కలిసిన వారిలో హైదరాబాద్‌ నగర మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్‌, చౌటుప్పల్‌ మునిసిపల్‌ చైర్మన్‌ వెన్‌రెడ్డి రాజు, సర్దార్‌ పుటం పురుషోత్తం, ఆకుల రంజిత్‌ తదితరులు ఉన్నారు. మరోవైపు తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంఘం కూడా కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి మద్దతు ప్రకటించింది. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంధం రాములు, ప్రధాన కార్యదర్శి కరుణాకర్‌రెడ్డి శుక్రవారం మంత్రి కేటీఆర్‌ను కలిసి తమ మద్దతు విషయాన్ని వెల్లడించారు. 

Updated Date - 2022-10-08T10:25:03+05:30 IST