ఎంపిక చేసిన గడపలకే..!

ABN , First Publish Date - 2022-05-17T06:44:59+05:30 IST

రాష్ట్ర స్త్రీశిశు సంక్షేమశాఖ మంత్రి ఉషాశ్రీచరణ్‌ సోమవారం కళ్యాణదుర్గం మండలం శిబాయి గ్రామంలో చేపట్టిన ‘గడప గడపకు ప్రభుత్వం’ ఓ పక్కా ప్రణాళిక ప్రకారం సాగింది.

ఎంపిక చేసిన గడపలకే..!
శిబాయిలో గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమానికి ఊరేగింపుగా వెళ్తున్న మంత్రి

సమస్యలను గాలికొదిలి సంబరాలు

ఎన్నికల ప్రచారాన్ని తలపించిన వైనం

పోలీస్‌ పహారాలో ‘గడప గడపకు మన ప్రభుత్వం’

మీ పథకాలే వద్దు.. చెరువులకు నీరిస్తే చాలన్న రైతు

మంత్రి ఉషాశ్రీచరణ్‌ పర్యటనకు స్పందన కరువు 


  కళ్యాణదుర్గం, మే 16: రాష్ట్ర స్త్రీశిశు సంక్షేమశాఖ మంత్రి ఉషాశ్రీచరణ్‌ సోమవారం కళ్యాణదుర్గం మండలం శిబాయి గ్రామంలో చేపట్టిన ‘గడప గడపకు ప్రభుత్వం’ ఓ పక్కా ప్రణాళిక ప్రకారం సాగింది. ఎంపిక చేసిన మద్దతుదారులు గడప వద్దకే వెళ్తూ.. మిగిలిన గడపలను దాటుకుంటూ సాగింది. శిబాయి గ్రామం లో మొదట ఈ కార్యక్రమం ఆర్భాటంగా ప్రారంభమైంది. డప్పులు వాయిస్తూ మంత్రిపై పూలవర్షం కురిపించారు. కేవలం ఆ గ్రామస్థుల యోగక్షేమాలను అడుగుతూ గడపదేటేసుకుంటూ వెళ్లారు.  తమ సమస్యలపై స్థానికులు ప్రశ్నించేలోగానే మరో ఇంటి గడప వద్దకు వెళ్లసాగారు. కనీసం గ్రామ సమస్యలపై కూడా అడిగేందుకు ప్రజలకు అవకాశం ఇవ్వలేదు. రైతు బొజ్జన్న ‘ మీ పథకాలే వద్దు.. చెరువులకు నీరిస్తేచాలు..’ అని అడగ్గా.. ఆ కార్యక్రమాన్ని కూడా తొందరగా ప్రారంభిస్తామని మంత్రి చెప్పుకుంటూ మరో గడపకు వెళ్లిపోయారు.  దీంతో స్థానికులు నిమ్మకుండిపోయారు.స్థానిక వైసీపీ నాయకులు సూచించిన ఇళ్ల వద్దకే వెళ్లి ప్రభుత్వం పంపిణీ సంక్షేమబాపుట కరపత్రాలను అందజేశారు. ఇలా ఈ కార్యక్రమం పూర్తిస్థాయిలో పోలీస్‌ పహారా మధ్య సాగింది. ఎన్నికల ప్రచారాన్ని తలపించింది. అధికారులు, పోలీసులు, వైసీపీ నాయకులు మినహా ప్రజలెవ్వరు మంత్రికి స్వాగతం పలికేందుకు స్వచ్ఛందగా ముందుకురాలేదు.


  రైతు భరోసా.. ఒక వరం : మంత్రి  

   వైఎస్‌ఆర్‌ రైతు భరోసా, పీఎం కిసాన పథకం రైతులకు ఒక వరమని రాష్ట్ర స్త్రీ, శిశుసంక్షేమ శాఖ మంత్రి ఉషాశ్రీచరణ్‌ అన్నారు. సోమవారం స్థానిక వ్యవసాయ మార్కెట్‌ యార్డులో వైఎస్‌ఆర్‌ రైతుభరోసా నాల్గొ విడత చెక్కును విడుదల చేశారు. ఇందులో కలెక్టర్‌ నాగలక్ష్మి, జాయింట్‌ కలెక్టర్‌ కేతనగార్గ్‌, వ్యవసాయశాఖ జేడీ చంద్రనాయక్‌, ఆర్డీఓ నిశాంతరెడ్డి, ప్రభుత్వ విఫ్‌ వెన్నపూస గోపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, జిల్లా పరిషత చైర్‌పర్సన గిరిజమ్మ హాజరయ్యారు. జిల్లాలో 2,76,258 మంది రైతు కుటుంబాలకు గాను రూ.207.19 కోట్లు  విడుదల చేసిన ట్లు మంత్రి చెప్పారు.  అనంతరం వ్యవసాయ అనుబంద సంస్థలు  ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించారు.  రైతు సంఘాల కింద మంజూరైన ట్రాక్టర్లను పంపిణీ చేశారు. మంత్రి స్వగృహంలో విలేకరులతో మాట్లాడుతూ..  ఈనెల 19న 175 అంబులెన్సలను జాతికి అంకితం చేస్తున్నామన్నారు. జూన, జూలైలో కృష్ణ, చిత్రావతి నుంచి చెరువులకు నీరునింపే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. హంద్రీనీవా కాలువ పనుల కోసం భూములు కోల్పోయిన రైతులకు పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. కాగా జిల్లా స్థాయి రైతు భరోసా కార్యక్రమానికి అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీ హాజరుకాకపోవడం కొసమెరుపు.  


Updated Date - 2022-05-17T06:44:59+05:30 IST