ఒమన్‌లో విదేశీయులకు నో ఎంట్రీ !

ABN , First Publish Date - 2021-04-07T13:29:33+05:30 IST

మహమ్మారి కరోనావైరస్ విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో గల్ఫ్ దేశం ఒమన్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.

ఒమన్‌లో విదేశీయులకు నో ఎంట్రీ !

మస్కట్: మహమ్మారి కరోనావైరస్ విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో గల్ఫ్ దేశం ఒమన్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. దేశ పౌరులు, నివాసితులకు మాత్రమే సుల్తానేట్‌లోకి ప్రవేశించడానికి అనుమతించాలని నిర్ణయించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు విదేశీయులకు దేశంలోకి ప్రవేశించడానికి అనుమతి ఉండదు. గురువారం నుంచి ఈ ఆంక్షలు అమలులోకి వస్తాయని సంబంధిత అధికారులు ప్రకటించారు. రోజువారీ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో ఆ దేశ సుప్రీం కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే రంజాన్ మాసం సందర్భంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు ఏడు గంటల పాటు నైట్ కర్ఫ్యూ కూడా విధించింది. ఈ కర్ఫ్యూ సమయంలో అన్ని వ్యాపార సముదాయాలు మూసి ఉంచాలని కమిటీ ఆదేశించింది.


అంతేగాక రంజాన్ సందర్భంగా మసీదులలో నిర్వహించే తారావీహ్ ప్రార్థనలను సైతం కమిటీ నిషేధించింది. దీంతోపాటు మసీదులు, గుడారాలు, బహిరంగ ప్రదేశాలలో అన్ని రకాల రంజాన్ సమావేశాలు, ఇఫ్తార్ విందులపై బ్యాన్ విధించింది. ఏప్రిల్ నెల మొత్తం అన్ని సామాజిక, క్రీడ, సాంస్కృతిక కార్యకలాపాలు నిషేధించబడ్డాయి. కాగా, ఒమన్ ఆరోగ్యశాఖ నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,64,274 మందికి వైరస్ ప్రబలగా.. 1,722 మంది మృతిచెందారు. ప్రస్తుతం దేశంలోని వివిధ ఆస్పత్రుల్లో 606 మంది కరోనా రోగులు చికిత్స పొందుతుండగా.. వీరిలో 198 మంది ఐసీయూల్లో ఉన్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది.  

Updated Date - 2021-04-07T13:29:33+05:30 IST