ఢిల్లీ టెన్షన్: తబ్లీగీ జమాత్‌ సభల గురించి మరో కొత్త విషయం వెలుగులోకి..

ABN , First Publish Date - 2020-04-01T17:49:20+05:30 IST

ఢిల్లీలో జరిగిన తబ్లీగీ జమాత్‌ సభలకు అధికారికంగా రాష్ట్రం నుంచి కేవలం 550 మంది మాత్రమే పాల్గొన్నారని నిర్వాహకుడు అక్రమ్‌ తెలిపారు. ఢిల్లీలోని హజరత్‌ నిజాముద్దీన్‌ మర్కజ్‌లో జరిగిన కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి జమాత్‌ సభ్యులు వచ్చారు.

ఢిల్లీ టెన్షన్: తబ్లీగీ జమాత్‌ సభల గురించి మరో కొత్త విషయం వెలుగులోకి..

అధికారికంగా పాల్గొన్నది 550 మంది మాత్రమే..

మిగిలిన వారంతా అనధికారికంగా వెళ్లిన వాళ్లే..

తబ్లీగీ జమాత్‌ సభలకు హాజరైన వారిని గుర్తించి.. క్వారంటైన్‌ చేసే పనిలో అధికారులు

హైదరాబాద్ నగరం నుంచి 603 మంది... అడ్రస్‌ల సేకరణ పూర్తి

మరో రెండు రోజుల్లో అందరినీ గుర్తించే అవకాశం


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి): ఢిల్లీలో జరిగిన తబ్లీగీ జమాత్‌ సభలకు అధికారికంగా రాష్ట్రం నుంచి కేవలం 550 మంది మాత్రమే పాల్గొన్నారని నిర్వాహకుడు అక్రమ్‌ తెలిపారు. ఢిల్లీలోని హజరత్‌ నిజాముద్దీన్‌ మర్కజ్‌లో జరిగిన కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి జమాత్‌ సభ్యులు వచ్చారు. ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక కోటా ఉన్న నేపథ్యంలో తెలంగాణ నుంచి 550 మందికి అనుమతినిచ్చారు. వారు చెప్పిన విధంగా మొత్తం 550 మంది మార్చి రెండో వారంలో వివిధ ప్రయాణ మాధ్యమాల ద్వారా అక్కడికి చేరుకున్నారు. ఈ మేరకు కార్యక్రమంలో హాజరైన వారి వివరాలు పోలీసులకు, జీహెచ్‌ఎంసీ అధికారులకు అప్పగించినట్లు ఆయన వివరించారు. అనంతరం మార్చి 22న జనతా కర్ఫ్యూ, ఆ తర్వాత దేశవ్యాప్త లాక్‌డౌన్‌ అమల్లోకి రావడంతో అందరూ వెనుదిరిగారు. మల్లేపల్లిలోని తమ మర్కజ్‌ ద్వారా వెళ్లిన వారి పూర్తి వివరాలు రాసి ఉన్న రిజిస్టర్‌లన్నీ అధికారులకు అప్పగించారు. పోలీసుల్లో ఉర్దూ చదివే అధికారి ఆయా వివరాలను చదివి నిర్ధారించుకున్నట్లు అక్రమ్‌ తెలిపారు. ఆ రిజిస్టర్‌లో నమోదైన డేటా ఆధారంగా అక్కడికి వెళ్లిన వారి ఆరోగ్య స్థితిగతులపై అధికారులు అధ్యయనం చేశారని ఆయన అన్నారు. 


అనధికారికంగా...

అధికారికంగా అనుమతి ఉన్న వారి వివరాలు మాత్రమే రిజిస్టర్‌లో పొందుపరిచారు. కాగా అనధికారికంగా కూడా కొంతమంది అక్కడికి చేరి ఉండే అవకాశాలున్నాయని తెలుస్తోంది. వాటి ఆధారంగానే మన రాష్ట్ర అధికారులు ఓ జాబితాను రూపొందించారు. జీహెచ్‌ఎంసీ పరిధి నుంచి 603 మంది కాగా, ఇతర జిల్లాల నుంచి మరో 427 మంది మొత్తం 1,030 అక్కడికి వెళ్లినట్లు ఓ నిర్ధారణకు వచ్చారు. మల్లేపల్లిలోని మర్కజ్‌ నుంచి 550 మంది చిరునామాలు సేకరించడంతో పాటు అనధికారికంగా వెళ్లిన వారిని కూడా గుర్తించినట్లు తెలుస్తోంది.  ఇప్పటికే పలువురిని గుర్తించి వారి ద్వారా అనధికారికంగా ఢిల్లీ వెళ్లి వచ్చిన వారి వివరాలు కూడా సేకరించినట్లు సమాచారం. 


చిరునామాల సేకరణ పూర్తి

రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యికి పైగా, నగరంలో 600కు పైగా వెళ్లినవారు ఉన్నట్లు ధ్రువీకరించుకున్న తర్వాత వారి అడ్రస్‌లను సేకరించారు. ఇప్పటికే దాదాపు అందరి అడ్రస్‌లు తెలుసుకున్న అధికారులు సగానికి పైగా వ్యక్తులను క్వారంటైన్‌కు తరలించినట్లు సమాచారం. మిగతా వారిని కూడా గుర్తించినా చాలామంది అందుబాటులోకి రాలేదని, కొంతమంది తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. చెయిన్‌ లింక్‌ ఆధారాలతో ఒకరి ద్వారా మరొకరి సమాచారం సేకరిస్తూ ఢిల్లీ వెళ్లొచ్చిన వారినందరినీ గుర్తించి మరో రెండు రోజుల్లో వారిని క్వారంటైన్‌కు పంపే అవకాశాలున్నాయి.


అనుమానితులు ఎంతమంది ?

తబ్లీగీ జమాత్‌ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన సభలకు పాల్గొన్న వారిని గుర్తించిన అధికారులు మరో అడుగు ముందుకు వేశారు. కేవలం వెళ్లొచ్చిన వారు మాత్రమే కాకుండా... వారి కుటుంబీకులు, వారం రోజుల క్రితమే తిరిగొచ్చిన అనుమానితులు అప్పటి నుంచి ఎక్కడెక్కడ తిరిగారనే పూర్తి వివరాలను గుర్తించే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. కేవలం వెళ్లొచ్చిన వారు మాత్రమే కాకుండా, వారి కాంటాక్ట్‌లోకి వచ్చిన వారిని కూడా పరీక్షించాల్సిన ఆవశ్యకతను వివరిస్తున్నారు. ప్రయాణికులు మాత్రమే కాకుండా మిగతా వారు కూడా అనుమానితుల జాబితాలోకి చేరారు. అధికారులు జల్లెడ పడుతున్నారన్న సమాచారంతో కొంతమంది తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతమాత్రం ఆమోద యోగ్యం కాదని, అందరూ ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకుని, క్వారంటైన్‌ పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. 


వడపోత సాగిందిలా...

ఢిల్లీ హజ్రత్‌ నిజాముద్దీన్‌ వద్ద జరిగిన తబ్లీగీ జమాత్‌ సభల్లో పాల్గొన్న వారికి సంబంధించిన వివవరాలు మల్లేపల్లిలోని మర్కజ్‌ నుంచి జీహెచ్‌ఎంసీ అధికారులు పోలీసులు సేకరించారు. వారి అడ్ర్‌సలకు చేరుకుని వారితో పాటు ఇంకెంత మంది అక్కడికి వచ్చారనే డేటా సేకరించారు. నగరం మొత్తంలో 603 మంది వెళ్లి వచ్చినట్లు గుర్తించారు. ఆ తర్వాత మర్కజ్‌ వద్ద లేని వారి వివరాల కోసం రైల్వే అధికారులను ఆశ్రయించారు. ప్రయాణ తేదీలు, పీఎన్‌ఆర్‌ నెంబర్ల ఆధారంగా ఇతరుల అడ్రస్‌లు తీసుకున్నారు. ప్రతి పోలీస్‌స్టేషన్‌ ఇన్‌చార్జీలకు వారి పరిధిలో ఉన్న వ్యక్తుల వివవరాలు అందజేశారు. పోలీసులు, స్థానిక బల్దియా అధికారులు, ఆశ, అంగన్‌వాడీ వర్కర్ల సాయంతో ఇళ్లకు చేరి కౌన్సెలింగ్‌ నిర్వహిస్తూ క్వారంటైన్‌ చేశారు. ఈ క్రతువులో పోలీసులు, జీహెచ్‌ఎంసీ, వైద్య సిబ్బంది, ఆశ, అంగన్‌వాడీ, స్థానిక నేతలు పాల్గొన్నారు. 


అన్ని ప్రాంతాల నుంచి

జీహెచ్‌ఎంసీలోని అన్ని ప్రాంతాల నుంచి ఢిల్లీకి వెళ్లొచ్చినట్టు అధికారులు డేటా సేకరించారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌లోని పాతబస్తీ, నాంపల్లి, మల్లేపల్లి, ఆసిఫ్‌నగర్‌, బంజారాహిల్స్‌, యూసుఫ్‌గూడ, బోరబండతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా జనం వెళ్లొచ్చారు. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధి నుంచే అత్యధికంగా... ఒక్కో పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 10 నుంచి 20మంది దాకా ఉన్నారు. ఆయా వివరాలు ఎస్‌హెచ్‌ఓలకు చేరాయి. సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ల పరిధుల నుంచి ప్రజలు కాస్త తక్కువగానే వెళ్లినట్లు అధికారుల వద్దకు చేరిన లిస్టుల్లో స్పష్టమవుతోంది.


ఎవరిని ఎక్కడికి తరలించారంటే..

లక్షణాలు ఉంటే.. ఆస్పత్రులకు... కొద్దిగా నలతగా ఉంటే క్వారంటైన్‌లకు, బాగా ఉంటే హోం క్వారంటైన్‌కు....ఇలా ఢిల్లీకి వెళ్లి వచ్చిన పలువురిని తరలిస్తున్నారు. ఢిల్లీ సమావేశానికి గ్రేటర్‌ నుంచి ఎక్కువ సంఖ్యలో వెళ్లిన వారు ఉండడంతో విస్తృతంగా వారిని గుర్తించి ప్రాతిపదికన వారిని విభజించి తరలిస్తున్నారు. గ్రేటర్‌లో ఉన్న వారిని గుర్తించి వారిలో కరోనా వైరస్‌ లక్షణాలు ఉన్నాయా లేదా గమనిస్తున్నారు. జ్వరం, దగ్గు, జలుబు, ఆయాసం ఉంటే వారిని వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వారి వద్ద నమునాలు సేకరించి నిర్ధారణకు పంపిస్తున్నారు. ఒక వేళ వారికి పాజిటివ్‌గా తేలితే గాంధీ, చెస్ట్‌ ఆస్పత్రుల్లో చికిత్సలు అందించనున్నారు. ఇక కాస్త నలతగా ఉన్న వారిని ఎంపిక  చేసిన క్వారంటైన్లకు పంపిస్తున్నారు. ఇలాంటి వారిని బల్కంపేట, కింగ్‌కోఠిలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. 


ఎలాంటి లక్షణాలు లేకపోవడం, కాస్తా బాగా ఉన్నవారిని గుర్తించి వారిని ఇంట్లోనే హోం క్వారంటైన్‌గా ఉండాలని సూచిస్తున్నారు. గ్రేటర్‌లో గుర్తించిన వారిని పేర్లు, వివరాలు నమోదు చేసుకోని అధికారులు వెళ్తున్నారు. గ్రేటర్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో పలు విభాగాల శాఖల అధికారులు, సిబ్బంది జల్లెడ పట్టారు. ఆయా ప్రాంతాల్లో సమావేశాలకు వెళ్లొచ్చిన వచ్చిన వారిని గుర్తించి వివరాలు నమోదు చేసుకున్నారు. కాప్రా సర్కిల్‌, ఉప్పల్‌, చార్మినార్‌, జల్‌పల్లి, రామాంతాపూర్‌, మియాపూర్‌, ఎల్బీనగర్‌, మల్కాజిగిరి, నేరెడ్‌మెట్‌, అంబర్‌పేటల నుంచి దాదాపు నలభై మందికిపైగా గాంధీ ఆస్పత్రి, క్వారంటైన్‌కు తరలించారు. 

Updated Date - 2020-04-01T17:49:20+05:30 IST