వణికిస్తున్న కరోనా

ABN , First Publish Date - 2020-06-06T08:30:42+05:30 IST

జిల్లాలో శుక్రవారం 18 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్టు సమాచారం.

వణికిస్తున్న కరోనా

జిల్లాలో ఒక్కరోజే 18 మందికి పాజిటివ్‌ 

పాతూరును భయపెడుతున్న మహమ్మారి

డీఎంహెచ్‌ఓ ఆఫీస్‌కు పాకిన కరోనా

ఎన్‌హెచ్‌ఎం విభాగంలో ఏడుగురు క్వారంటైన్‌కు


అనంతపురం వైద్యం, జూన్‌ 5 : జిల్లాలో శుక్రవారం 18 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్టు సమాచారం. ఇందులో 12 మందికి సంబంధించిన వివరాలను అధికారికంగా వెల్లడించారు. మిగిలిన ఆరుగురిని అధికారులు కొవిడ్‌ ఆస్పత్రులకు తరలించారు. ముత్తాపురం తండాలో 45 ఏళ్ల వ్యక్తి, పెనుకొండలో 32 ఏళ్ల వ్యక్తి, వి.కొత్తకోటలో 30 ఏళ్ల మహిళ, విడపనకల్లులో 47 ఏళ్ల మహిళ, 47 ఏళ్ల వ్యక్తి, అనంతపురం రూరల్‌ కక్కలపల్లి కాలనీలో 52 ఏళ్ల మహిళ, 50 ఏళ్ల వ్యక్తి జిల్లా కేంద్రంలోని పాతూరు ఉమానగర్‌లో 24 ఏళ్ల మహిళ, 65 ఏళ్ల వ్యక్తి, అంబారపు వీధిలో ఒకరు కరోనా బారిన పడ్డారు. హిందూపురంలో ఒకరికి కరోనా నిర్ధారణ అయింది. 


పాతూరులో మరో ఆరుగురి తరలింపు

కరోనా మహమ్మారి జిల్లా కేంద్రంలోని పాతూరు ప్రజలను తీవ్రంగా  భయపెడుతోంది. గత నాలుగు రోజులుగా ఈ ప్రాంతంలో పలువురు కరోనా బారిన పడతున్నారు. శుక్రవారం కూడా ఈ ప్రాంతానికి చెందిన ఆరుగురికి కరోనా నిర్ధారణ అయినట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. సున్నపుగేరిలో ఇద్దరికి, గుత్తి రోడ్డుకు చెందిన ఇద్దరికి, నీరుగంటి వీధికి చెందిన ఇద్దరికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు సమాచారం. ఈ ఆరుగురిని శుక్రవారం అధికారులు కొవిడ్‌ ఆస్పత్రికి తరలించారు. పాతూరులో కాయగూరల మార్కెట్‌తో పాటు హోల్‌సేల్‌ బిజినెస్‌ షాపులు అధికంగా ఉన్నాయి. జనం కూడా పెద్ద ఎత్తున ఆ ప్రాంతంలో నిత్యం సంచరిస్తుంటారు. దీంతో అధికారులు మళ్లీ ఆంక్షలు విధించారు. కరోనా కేసులు నమోదైన ప్రాంతాలను రెడ్‌జోన్‌లుగా నిర్ణయించి బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలో షాపులు తెరవకుండా చర్యలు చేపట్టారు. 


వైద్యశాఖకు పాకిన వైరస్‌

జిల్లా వైద్యశాఖ కార్యాలయానికి కరోనా విస్తరించింది. ఈ కార్యాలయంలో లేపాక్షి పీహెచ్‌సీ మహిళా డాక్టర్‌ డిప్యుటేషన్‌పై పనిచేస్తున్నారు. కొంత కాలంగా ఇన్‌చార్జ్‌ ఏఓగా విధులు నిర్వర్తించారు. తాజాగా ఎన్‌హెచ్‌ఎం విభాగంలో పని చేస్తున్నారు. ఇప్పుడు ఆ మహిళా డాక్టర్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చింది. గురువారం ఆ డాక్టరమ్మను కొవిడ్‌ ఆస్పత్రికి తరలించారు. దీంతో డీఎంహెచ్‌ఓ ఆఫీసులో కలవరం మొదలైంది. రాత్రికి రాత్రే కార్యాలయంలో క్రిమిసంహారక మందును పిచికారీ చేయించారు. ఆ మహిళా డాక్టర్‌ విధులు నిర్వర్తిస్తున్న ఎన్‌హెచ్‌ఎం విభాగంలో పనిచేస్తున్న ఏడుగురు వైద్య సిబ్బందిని క్వారంటైన్‌కు తరలించి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఐసీడీఎస్‌ కార్యాలయంలో డేటాఎంట్రీ ఆపరేటర్‌కు కరోనా సోకింది. దీంతో ఆ ఆఫీస్‌ను మూసివేశారు. అందులో పనిచేస్తున్న దాదాపు 30 మంది అధికారులు, ఉద్యోగులు హోం క్వారంటైన్‌కు వెళ్లిపోయారు. వారికి కరోనా పరీక్షలకు శాంపిళ్లు తీసుకున్నారు.  

 

19 మంది కరోనా బాధితులు డిశ్చార్జ్‌

 కరోనా నుంచి కోలుకుని 19 మంది డిశ్చార్జ్‌ అయినట్లు జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రి నుంచి 11 మంది, ఎస్కేయూ కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ నుంచి 8 మందిని డిశ్చార్జ్‌ చేసి వారి  స్వస్థలాలకు పంపామన్నారు. ఒక్కొక్కరికి రూ. 2 వేలు అందజేసినట్లు కలెక్టర్‌ తెలిపారు. 

 

మూడేళ్ల చిన్నారికి కరోనా- కుర్లపల్లితండాలో కలకలం

కనగానపల్లి : మండలంలోని కుర్లపల్లి తండాలో మూడేళ్ల చిన్నారికి కరోనా పాజిటివ్‌ రావడం కలకలం రేపుతోంది. అప్రమత్తమైన అధికారులు చిన్నారితో పాటు మరొకరిని క్వారంటైన్‌కు తరలించారు. ముంబైకి వలస వెళ్లిన గ్రామంలోని కొన్ని కుటుంబాలు  కరోనా నేపథ్యంలో ఇటీవల స్వగ్రామాలకు వచ్చారు. అధికారులు వారిని గుర్తించి దాదాపు 9 మందిని గుట్టకిందపల్లి క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారు. అక్కడ 17 రోజులు పాటు పరీక్షలు నిర్వహించారు. మూడేళ్ల చిన్నారికి తప్పా మిగతా 8 మందికి నెగిటివ్‌గా రిపోర్టులు వచ్చాయి. చిన్నారి రిపోర్టు రానప్పటికీ కుటుంబసభ్యుల ఒత్తిడి మేరకు వారితో పాటు గురువారం ఇంటికి పంపారు. శుక్రవారం  చిన్నారికి కరోనా పాజిటివ్‌గా రిపోర్టు రావడంతో అధికారులు గ్రామంలో పర్యటించి చిన్నారితో పాటు మరొకరిని క్వారంటైన్‌కు తరలించారు. చిన్నారి కుటుంబ సభ్యులను స్వీయ నిర్బంధంలో ఉంచి గ్రామంలో శానిటైజేషన్‌ చర్యలు చేపట్టారు. పరీక్షల అనంతరం ఇతరులను క్వారంటైన్‌కు తరలిస్తామని తహసీల్దార్‌ శ్రీనివాసులు, వైద్యులు వెంకటరమణ తెలిపారు.


ధర్మవరంలో మరో ఇద్దరికి ... 

ధర్మవరం, జూన్‌ 5 : పట్టణంలో కరోనా విస్తరిస్తోంది. వారం కిందట ఓప్రజాప్రతినిధి కుటుంబంలో ఆరు పాజిటివ్‌ కేసులు నమోదవడంతో కలకలం రేగింది. తాజాగా మరో రెండు కేసులు నమోదు కావడంతో పట్టణ వాసులు హడలెత్తిపోతున్నారు. శుక్రవారం పట్టణంలోని సుందరయ్యనగర్‌లో ఒకరికి, రేగాటిపల్లి గేటు సమీపంలో మరొకరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్య వర్గాల ద్వారా స్పష్టమవుతోంది. దీంతో స్థానికుల్లో భయాందోళన వ్యక్తం అవుతోంది. 


‘పురం’లో రెండు కేసులు

  • రిటైడ్‌ స్టాఫ్‌ నర్సుకు మృతి తర్వాత నిర్ధారణ 
  • మరో వృద్ధురాలు కొవిడ్‌ ఆసుపత్రికి తరలింపు
  • బ్యాంకుల వద్ద భారీ క్యూతో ఆందోళన

హిందూపురం: హిందూపురంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. శుక్రవారం పట్టణంలోని మేళాపురం క్రాస్‌, అబాద్‌పేటలో రెండు కేసులు నమోదయ్యాయి. కాగా నింకంపల్లికి చెందిన ఇద్దరు వైద్యం కోసం బెంగుళూరుకు వెళ్లగా అక్కడ ఇద్దరికి పాజిటివ్‌ వచ్చింది. తాజాగా నమోదైన రెండు కేసుల్లో అబాద్‌ పేటకు చెందిన రిటైర్డ్‌ స్టాఫ్‌ నర్సు(65) బుధవారం మృతి చెందగా శుక్రవారం పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అనారోగ్యంతో ఉన్న రిటైర్డ్‌ స్టాఫ్‌ నర్సుకు ఈనెల 2న టెస్టింగ్‌ శాంపిల్‌ సేకరించారు. ఈమె అనంతపురంలోని ఓప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఆ తరువాత పాజిటివ్‌ రావడంతో మొదటి, రెండవ కాంటాక్ట్‌ గుర్తింపు చేపడుతున్నారు.


మేళాపురం క్రాస్‌ వద్ద 68 ఏళ్ల వృద్ధురాలికి పాజిటివ్‌ రాగా పట్టణంలోనే కొవిడ్‌ ఆసుపత్రికి తరలించారు. వివిధ లావాదేవీల కోసం ప్రజలు పట్టణంలోని బ్యాంకుల వద్దకు క్యూ కడుతున్నారు. దీంతో వైరస్‌ మరింతగా విస్తరించే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తం అవుతోంది. లాక్‌డౌన్‌ నిబంధనలు, సడలింపుల్లో భాగంగా మధ్యాహ్నం నుంచి జనాన్ని రోడ్లపైకి రానివ్వకుండా పోలీసులు నిలువరించారు. ఇప్సటికే కంటైన్మెంట్‌ జోన్ల పరిధి తగ్గించి కొన్నింటిని పాక్షికంగా, మరి కొన్నింటికి పూర్తిగా సడలింపు ఇచ్చి ఆరు కంటైన్మెంట్‌ జోన్లకే ఆంక్షలు విధించడంతో జనం భారీగా రోడ్లపైకి వస్తున్నారు. దీంతో పట్టణంలో కరోనా వైరస్‌ కాంటాక్ట్‌ టెన్షన్‌ పట్టుకుంది.


కొవిడ్‌ వైద్యసేవలు ప్రారంభం

హిందూపురం జిల్లా స్థాయి ప్రభుత్వ ఆసుపత్రిలో కొవిడ్‌ వైద్యసేవలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఆసుపత్రిలో 20 ఐసీయూ, 30 నాన్‌ ఐసీయూ పడకలను ఏర్పాటు చేశారు. ఆసుపత్రిలో 12 మంది వైద్యుల బృందం షిఫ్ట్‌కు నలుగురు చొప్పున రోజుకు మూడు షిఫ్ట్‌ లు పని చేయనుంది. వీరికి అవసరమైన వైద్యసిబ్బందిని కేటాయించారు.

Updated Date - 2020-06-06T08:30:42+05:30 IST