Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Tue, 05 Apr 2022 11:36:15 IST

యూట్యూబ్ వీడియోలు చూసి వర్కవుట్స్‌ చేస్తున్నారా? అయితే జాగ్రత్త!

twitter-iconwatsapp-iconfb-icon
యూట్యూబ్ వీడియోలు చూసి వర్కవుట్స్‌ చేస్తున్నారా? అయితే జాగ్రత్త!

ఆంధ్రజ్యోతి(05-04-2022)

అడ్డదారిలో ఆరోగ్యాన్ని అందుకోవాలనే తాపత్రయమే అందరిదీ! అయితే ఫిట్‌నెస్‌ కోసం అలాంటి షార్ట్‌కట్‌ సురక్షితం కాదు. యూ ట్యూబ్‌ వీడియోలు, ఫిట్‌నెస్‌ యాప్‌ల ఆధారంగా వ్యాయామాలు కొనసాగిస్తే, గాయాలకు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. 


ఫిట్‌నెస్‌ కోసం పిలాటీలు, జుంబా, ఏరోబిక్స్‌ వ్యాయామాలనే ఎంచుకోవలసిన అవసరం లేదు. అంతే సమానమైన ఫిట్‌నె్‌సను నడకతోనూ సాధించవచ్చు. స్టాటిక్‌ సైక్లింగ్‌, ట్రెడ్‌మిల్‌, ఈతలతో కూడా ఫిట్‌నె్‌సను పొందవచ్చు. అయితే ఈ వ్యాయామాలను తక్కువ తీవ్రతతో మొదలుపెట్టి, క్రమేపీ పెంచుకుంటూ పోవాలి. మరీ ముఖ్యంగా 60 ఏళ్లు దాటినవాళ్లు నడక లేదా ఈతలను వ్యాయామాలుగా ఎంచుకోవచ్చు.  


ఫిట్‌నెస్‌ అని టైప్‌ చేసి, సెర్చ్‌ చేసిన క్షణాల్లోనే సామాజిక మాధ్యమాల్లో, యూట్యూబ్‌లో లెక్కలేనన్ని వీడియోలు ప్రత్యక్షమవుతాయి. వాటిలో సునాయాసంగా కిలోలకొద్దీ బరువులు ఎత్తే ఫిట్‌నెస్‌ నిపుణులు కనిపిస్తారు, చలాకీగా జుంబా డాన్స్‌లు చేసే డాన్సర్లూ కనిపిస్తారు. చూడడానికి ఆ వ్యాయామాలన్నీ చాలా తేలికగా కనిపిస్తాయి. వాటిని చేసే నిపుణులు కూడా చక్కని ఫిట్‌నె్‌సతో దర్శనమిస్తూ ఉంటారు. దాంతో జిమ్‌కు వెళ్లి, రుసుములు కట్టి, గంటల తరబడి వ్యాయామాలు చేయడం దండగ అని ఎవరికైనా అనిపించడం సహజం. అయితే ఆ వీడియోల్లో కనిపించే వ్యాయామాలు అందరికీ అవే ఫలితాలను అందిస్తాయా? అందరి శరీరాలూ ఆ వ్యాయామాలకు అనువుగానే ఉంటాయా? 


ఆరోగ్యం కుదేలే!

బరువులు ఎత్తే వ్యాయామాలు, మారథాన్లు, సైక్లింగ్‌, పిలాటీస్‌, జుంబా మొదలైన వ్యాయామాలు క్రమేపీ తీవ్రత పెంచుకుంటూ కొనసాగించాలి. కానీ ఫోన్లలో యూట్యూబ్‌ వీడియోలను చూస్తూ, డౌన్‌లోడ్‌ చేసుకున్న సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రాములను  గుడ్డిగా అనుసరిస్తూ, ఇంటెన్స్‌ వర్కవుట్స్‌ చేయడం మొదలుపెడితే, ఆ ప్రభావం కీళ్లు, కండరాలు, లిగమెంట్ల మీద పడుతుంది. వెన్నులో డిస్క్‌ సమస్యలు, మోకీళ్లలో లిగమెంట్‌ సమస్యలు కూడా మొదలవుతాయి. అధిక బరువులు ఎత్తడం మూలంగా భుజాల్లో కండరాలు కూడా చిరుగుతాయి. అలాగే కండరాలు కండిషన్‌లో ఉండవు కాబట్టి, వ్యాయామ సమయంలో వేగంగా కదిలేటప్పుడు, కిందపడిపోయి దెబ్బలు తగిలే అవకాశాలు కూడా ఉంటాయి. 


పాశ్చాత్య యాప్‌లతో తంటా

ఆన్‌లైన్‌ యాప్‌ల సాఫ్ట్‌వేర్లలో ఎక్కువ శాతం పాశ్చాత్య దేశీయులను ఉద్దేశించి తయారు చేసినవే!! యాపిల్‌ వి ఫిట్‌ ఇందుకో ఉదాహరణ. సాధారణంగానే పాశ్చాత్యులు ఎంతోకొంత ఫిట్‌నె్‌సను కలిగి ఉంటారు. భారతీయులతో పోలిస్తే పాశ్చాత్యులకు ఫిట్‌నెస్‌ పట్ల అవగాహన, ఆసక్తి ఎక్కువ. వారి ఆహారపుటలవాట్లు, జీవనశైలులు కూడా మనకంటే భిన్నమైనవి. వాళ్ల ప్రొటీన్‌ ప్రధాన ఆహారం ఇంటెన్స్‌ వర్కవుట్లకు, రోజుకు 10 వేల అడుగుల నడకకు తగినట్టుగా ఉంటుంది. కానీ మనం పిండి పదార్థాలు ఎక్కువగా తీసుకుంటాం. పైగా మనలో ఎముకలు గుల్లబారే ఆస్టియొపోరోసిస్‌తో పాటు రక్తంలో అధిక చక్కెరలు ఎక్కువ. కాబట్టి విదేశీ భౌగోళిక పరిస్థితులు, జీవనశైలుల ఆధారంగా తయారైన ఫిట్‌నెస్‌ ప్రోగ్రాములను మనం అనుసరించడం సరైన పద్ధతి కాదు. అలాగే విదేశాల్లో ఇళ్ల ఫ్లోరింగ్‌ కార్పెట్‌తో కప్పి ఉంటుంది లేదా కలపతో తయారై ఉంటుంది. అలాంటి ఫ్లోరింగ్‌ మీద వ్యాయామాలు చేయడం సురక్షితం. కానీ మన ఇళ్లలో టైల్స్‌, లేదా గ్రానైట్‌ లేదా మార్చుల్‌ ఫ్లోరింగ్‌ ఉంటుంది. కాబట్టి విదేశీయులే లక్ష్యంగా రూపొందిన వ్యాయామాలు అనుసరించడం సరి కాదు. ఆన్‌లైన్‌ వర్కవుట్స్‌ చేయాలా? వద్దా?

యూట్యూబ్ వీడియోలు చూసి వర్కవుట్స్‌ చేస్తున్నారా? అయితే జాగ్రత్త!

ఫుట్‌వేర్‌, ఫ్లోర్‌ కీలకం

వ్యాయామాలతో కీళ్లు అరిగిపోకుండా, కండరాలు దెబ్బతినకుండా ఉండాలంటే అందుకు తగిన ఫుట్‌వేర్‌ ధరించాలి. ఇంట్లోనే వ్యాయామం చేస్తున్నాం కదా అని చెప్పులు లైదా సాదాసీదా స్పోర్ట్స్‌ షూ ధరించి వ్యాయామం చేసేస్తూ ఉంటాం. కానీ వ్యాయామాల కోసం అందుకు తగిన మన్నికైన, నాణ్యమైన స్పోర్ట్స్‌ షూ ధరించాలి. అలాగే రోడ్ల మీద వాకింగ్‌, జాగింగ్‌ చేసేవాళ్లు కూడా ఎత్తుపల్లాలు లేని ప్రదేశాలనే అందుకు ఎంచుకోవాలి. అప్పుడే కాలి గిలకలు, మోకాళ్లు, తుంటి కీళ్లూ సురక్షితంగా ఉంటాయి.


డైట్‌ అన్నిటికంటే ముఖ్యం

వ్యాయామంతో పాటు అందుకు అవసరమైన డైట్‌ తప్పనిసరిగా తీసుకోవాలి. కానీ వ్యాయామం పట్ల కనబరిచే శ్రద్ధ, తీసుకునే ఆహారం పట్ల కనబరిచేవారు ఎంతో తక్కువ. అందుకోసం ఫిట్‌నెస్‌ ట్రైనర్‌కు రుసుం చెల్లించడం దండగ అనే భావనలోఉండేవారూ ఉన్నారు. అలా అరకొర అవగాహనతో సరైన ఆహారం తీసుకోకపోవడం మూలంగా వ్యాయామాలతో ఆరోగ్యాన్ని చేతులారా పాడుచేసుకున్న వాళ్లం అవుతాం. వ్యాయామానికి ముందు, తర్వాత తీసుకునే ఆహారం ఎంతో కీలకం. వ్యాయామంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ప్రతి రోజూ ప్రొటీన్‌ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. మాంసాహారులైతే గుడ్లు, చికెన్‌, శాకాహారులైతే పప్పులు, నట్స్‌, డ్రైఫ్రూట్స్‌ తింటూ ఉండాలి.


యూట్యూబ్ వీడియోలు చూసి వర్కవుట్స్‌ చేస్తున్నారా? అయితే జాగ్రత్త!

వీళ్లకు వద్దు

గుండె జబ్బులు, తీవ్రమైన కీళ్ల అరుగుదల సమస్యలు ఉన్నవాళ్లు, ఇతరత్రా తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్లు, ఊబకాయులు ఇలాంటి సొంత వ్యాయామాల జోలికి వెళ్లకూడదు. తప్పుడు భంగిమల్లో వ్యాయామాలు చేయడం, అధిక బరువులు ఎత్తడం చేయకూడదు. 


ఈత ఉత్తమం

వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వాళ్లూ అనుసరించదగిన అనువైన, సురక్షితమైన వ్యాయామం... ఈత ఒక్కటే! స్పాండిలైటిస్‌, మోకాళ్ల ఆర్థ్రయిటిస్‌, గుండె జబ్బులు, ఇతరత్రా ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ఈతను వ్యాయామంగా అనుసరించవచ్చు.


గురువు పర్యవేక్షణలోనే...

ఇంటెన్స్‌ యోగా, విక్రమ్‌ యోగా.. ఇలా ఎన్నో రకాల యోగాభ్యాసాలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటున్నాయి. వ్యాయామాల మాదిరిగానే యోగా కూడా గురువుల పర్యవేక్షణ లేకుండా సాధన చేయడం సరి కాదు. ప్రతి రెండు అభ్యాసాల మధ్య అనుసరించవలసిన రిలాక్సేషన్‌ టెక్నిక్స్‌ కొన్ని ఉంటాయి. ఊపిరి తీసుకుని వదిలే క్రమాలు కూడా ఉంటాయి. ఇవన్నీ కృత్రిమ మేథస్సులు, యంత్రాలు లెక్కించి చెప్పే అంశాలు కావు. కాబట్టి గురువుల పర్యవేక్షణలోనే యోగా సాధన చేయడం అవసరం. 


ఆరోగ్య ప్రమాణాలకు అనుగుణంగా...

థైరాయిడ్‌, మధుమేహం, అధిక కొలెస్ర్టాల్‌, వంశపారంపర్య హృద్రోగ సమస్యలు... వైద్య పరీక్షల్లో మినహా బయల్పడని ఈ ఆరోగ్య సమస్యలను ఎవరికి వారు తెలుసుకోలేరు. ఈ కోవకు చెందిన వాళ్లు సొంత వ్యాయామాలు మొదలుపెట్టడం ఆరోగ్యానికి హానికరమే! అలాగే ఎక్కువ మందిలో బి12, హీమోగ్లోబిన్‌, విటమిన్‌ డి మెతాదులు తక్కువ ఉంటూ ఉంటాయి. ఇలాంటి వాళ్లు అవసరానికి మించి వ్యాయామాలు చేయడం వల్ల నష్టమే తప్ప లాభం ఉండదు.


నిజానికి వ్యక్తి వయసు, ఆరోగ్య పరిస్థితి, కండరాలు, ఎముకల పటుత్వం (మస్క్యులోస్కెలెటల్‌ ఇవాల్యుయేషన్‌), బాడీ మాస్‌ ఇండెక్స్‌, క్యాల్షియం, థైరాయిడ్‌, హీమోగ్లోబిన్‌ మోతాదులు, ఆహార, జీవనశైలుల ఆధారంగా వ్యాయామాలను ఎంచుకోవాలి. ఇందుకోసం వైద్యులను సంప్రతించి, అవసరమైన పరీక్షలు చేయించుకుని, ఆరోగ్య స్థితి పట్ల అవగాహన పెంచుకుని, వైద్యులు సూచించిన వ్యాయామాలనే సాధన చేయాలి. 


డాక్టర్‌ రామ్మోహన్‌ రెడ్డి,

ఆర్థోపెడిక్‌ స్పోర్ట్స్‌ సర్జన్‌, 

కాంటినెంటల్‌ హాస్పిటల్స్‌, 

హైదరాబాద్‌.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.